బండరాయితో మోది అమ్మనే చంపేశాడు..
ఆస్తి కోసం అమ్మనే చంపేశాడు
బండరాయితో మోది హత్య చేసిన కొడుకు
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ
కోటమర్పల్లిలో ఘటన
మర్పల్లి: ఆస్తి కోసం.. నవమాసాలు మోసి కనిపెంచి పెద్దచేసిన కన్నతల్లినే చంపేశాడో కర్కోటకుడు. బండరాయితో మోది హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. ఈ సంఘటన మండల పరిధిలోని కోటమర్పల్లి గ్రామంలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సొన్నాయి బాలమణి (65), రాచయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు.
ఇద్దరు కుమారులతో పాటు బాలమణి భర్త రాచయ్య గతంలోనే చనిపోయాడు. కూతుళ్ల వివాహాలు జరిగాయి. బాలమణి పెద్దకొడుకు రాజు మెదక్ జిల్లా రుద్రారం నివాసి నాగమణితో పాటు అదే జిల్లా చిట్కుల గ్రామానికి చెందిన వినోదను వివాహం చేసుకొని నగరంలో ఉంటూ కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బాలమణి తమకున్న 4 ఎకరాల పొలాన్ని సాగుచేసుకుంటూ వచ్చిన డబ్బును తన అవసరాలకు ఉపయోగించుకుంటోంది. జల్సాలకు అలవాటుపడిన రాజు తల్లిని చంపేస్తే నాలుగెకరాల పొలం తనకు వస్తుందని భావించాడు.
ఎలాగైనా తల్లిని హత్య చేయాలని పథకం పన్నాడు. ఈక్రమంలో అతడు శుక్రవారం రాత్రి కోటమర్పల్లికి వచ్చాడు. సదాశివపేట్ ఆస్పత్రిలో అక్క స్వరూప జ్వరంతో చికిత్స పొందుతోందని తల్లి బాలమణిని నమ్మించాడు. రాత్రి 8 గంటల సమయంలో తన మోపెడ్‌పై తల్లిని ఎక్కించుకొని సదాశివపేట్‌కు బయలుదేరాడు. మార్గమధ్యంలోని మోమిన్‌పేట్ మండలం బూర్గుపల్లి సమీపంలో వాహ నం ఆపాడు. రాజు తల్లి బాలమణి తలపై బండరాయితో మోదడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందింది.
ఇలా దొరికిపోయాడు..
తల్లిని చంపేసిన రాజు హత్యను.. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడు. మర్పల్లి మండలం సిరిపురంలో ఉండే తన అక్క స్వరూప ఇంటికి అదే రాత్రి వెళ్లాడు. ‘అమ్మకు గుండెపోటు వచ్చింది.. సదాశివపేట్‌ని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.. బావను తీసుకెళ్తా’నని స్వరూపను రాజు నమ్మించా డు. బావ ఆశయ్యను ఘటనా స్థలానికి తీసుకెళ్లిన అతడు తన తల్లిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందిందని నమ్మబలికాడు. రాజు బావతో కలిసి తల్లి మృతదేహాన్ని స్వగ్రామం కోటమర్పల్లికి తీసుకెళ్లాడు. తన తల్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని గ్రామస్తులకు చెప్పాడు. అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో శనివారం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మోమిన్‌పేట్ సీఐ ఏవీ రంగా, మర్పల్లి ఎస్‌ఐ అరుణ్‌కుమార్ కోటమర్పల్లికి చేరుకొని రాజును విచారణ జరిపారు. తన తల్లిని చంపితే ఆస్తి(పొలం) వస్తుందని భావించి తానే చంపేశానని అంగీకరించాడు. పోస్టుమార్టం అనంతరం పోలీసు లు బాలమణి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. వృద్దురాలి హత్యతో ఆమె కుమార్తెలు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈమేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. హతురాలి కూతురు స్వరూప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అరుణ్‌కుమార్ తెలిపాడు.