సాక్షి, హైదరాబాద్ : ముహుర్త బలం గట్టిగా ఉంటేనే వివాహ బంధం కలకాలం నిలుస్తుందని నమ్మకం. అందుకే పెళ్లి ముహుర్తానికి అంత ప్రాధాన్యత ఇస్తారు. అయితే అనుకున్న ముహుర్తానికి తాళి కట్టలేదని పీటల మీద నుంచి కూతుర్ని తీసుకు వెళ్లిపోయింది ఓ తల్లి. ఈ సంఘటన పటాన్‌చెరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...ఇస్నాపూర్ కు చెందిన వెంకటేష్కు సింధూజ అనే యువతితో నిశ్చితార్ధం జరిగింది.
మార్చి 14వ తేదీ 7 గంటల36 నిమిషాలకు పెళ్లి ముహుర్తం. ఇస్నాపూర్లోని పెళ్లికొడుకు నివాసంలో పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. ముహుర్తానికి పెళ్లికొడుకు వెంకటేష్, పెళ్లి కూతురు సింధుజ కూడా పెళ్లిపీటలపై కూర్చొవడానికి సిద్దమయ్యారు. అంతే అక్కడ ప్రత్యక్షమైన పెళ్లికూతురు తల్లి నిర్మల ముహుర్తం దాటి పోయిందంటూ కూతుర్ని బలవంతంగా పీటలపై నుంచి లేపి, అక్కడ నుంచి తీసుకు వెళ్లిపోయింది. దీంతో చివరి నిమిషంలో పెళ్లి నిలిచిపోయింది. సినిమా ట్విస్ట్ ను తలపించేలా జరిగిన ఈ ఘటనతో పెళ్లికొడుకు బంధువులు షాక్ తిన్నారు.
కాగా జిల్లాకు చెందిన పెళ్లిళ్ల పేరయ్య ఈ సంబంధం కుదిర్చినట్లు పెళ్లికొడుకు తరపు బంధువులు తెలిపారు. అయితే పెళ్లి కూతురు బీదరాలు కావడంతో పెళ్లి ఖర్చుల నిమిత్తం 50 వేల రూపాయలతో పాటు బంగారు ఉంగరాన్ని కూడా ఇచ్చామని చెబుతున్నారు. పెళ్లి కూతురు సింధూ, ఆమె తల్లి నిర్మల మాత్రమే పెళ్లికి వచ్చారన్నారు. చివరకు పెళ్లికొడుకు బంధువుల ఫిర్యాదు మేరకు పెళ్లి కూతురు తల్లి నిర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment