
పోలీసులే జడ్జిల్లా వ్యవహరిస్తారా?
హైదరాబాద్ : వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్పై మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఎన్కౌంటర్పై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన బుధవారమిక్కడ డిమాండ్ చేశారు. పోలీసులే జడ్జిల్లా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. విచారణ ఖైదీలపై కాల్పులు ఏవిధంగా జరుపుతారని అసదుద్దీన్ అన్నారు.
అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని ఆయన కోరారు. సూర్యాపేట ఘటనకు ప్రతీకారంగా పోలీసులు చట్టపరిధిని అతిక్రమించి ఐదుగురు ముస్లిం యువకులను ఎన్‌కౌంటర్ పేరుతో హత్య చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వమే పథకం ప్రకారం వికారుద్దీన్ గ్యాంగ్ ని హతమార్చిందని ఆయన అన్నారు.