
పోలీసుల ప్రతీకార హత్యలు: అసదుద్దీన్
వరంగల్ శివారులో జరిగిన ఎన్‌కౌంటర్ ఘటన పోలీసుల ప్రతీకార హత్యలుగా మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: వరంగల్ శివారులో జరిగిన ఎన్‌కౌంటర్ ఘటన పోలీసుల ప్రతీకార హత్యలుగా మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఐదుగురు అండర్ ట్రయిల్ ఖైదీల ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సూర్యాపేట ఘటనకు ప్రతీ కారంగా పోలీసులు చట్టపరిధిని అతిక్రమించి ఐదుగురు ముస్లిం యువకులను ఎన్‌కౌంటర్ పేరుతో హత్య చేశారని ఆయన ఆరోపించారు.
ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడిన పోలీసు అధికారులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఐదుగురు ఖైదీల ఎన్‌కౌంటర్ బూటక మని ఎంబీటీ బాధ్యుడు అమ్జదుల్లా ఖాన్ అన్నారు.