
రాష్ట్రానికి నష్టం చేయడమే వారి ఎజెండా
టీజేఏసీ చైర్మన్ కోదండరాం తన రాజకీయ స్వార్థం కోసం విద్యార్థులను బలిపశువులను చేసే కుట్రలు సాగిస్తున్నారని ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు.
కోదండరాంపై ఎంపీ బాల్క సుమన్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్ కోదండరాం తన రాజకీయ స్వార్థం కోసం విద్యార్థులను బలిపశువులను చేసే కుట్రలు సాగిస్తున్నారని ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. తెలంగా ణకు నష్టం చేయాలన్నదే కోదండరాం బ్యాచ్ ఎజెండా అని ధ్వజమెత్తారు. గురువారం టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు శ్రీనివాసరెడ్డి, శంభీపూర్‌రాజుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడా రు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వాస్తవాలను వెల్లడిస్తున్నా, వాటిని పట్టించుకోకుండా నిరుద్యోగ ర్యాలీకి పిలుపునిచ్చి ప్రభుత్వాన్ని బద్‌నాం చేసేందుకు కోదండరాం కుట్రలు పన్నారని సుమన్ మండిపడ్డారు. తెలంగాణ విషయంలో ద్రోహపూరితంగా వ్యవహరించిన కాంగ్రెస్, టీడీపీలతో పాటు తెలంగాణ రాష్ట్రమే వద్దన్న సీపీఎంతో కోదండరాం అంటకాగుతున్నారని విమర్శించారు.