సీఎం గారూ.. ప్రజల మొక్కులు తీరేదెన్నడు?
Published Mon, Feb 27 2017 11:18 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM
మీర్‌పేట్: వరుసబెట్టి ఆలయాల చుట్టూ తిరుగుతూ దేవుళ్ల మొక్కులను తీర్చుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కాలయాపన చేయడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. జన ఆవేదన సమ్మేళనంలో భాగంగా ఆదివారం మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కుటుంబపాలన పేరుతో దోపిడీ పాలన కొగసాగుతోందని దుయ్యబట్టారు.
మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ కార్యక్రమాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఇది ముమ్మాటికీ నూటికి నూరుపాళ్లు అవినీతి కార్యక్రమమని విమర్శించారు. కాంట్రా క్టర్లకు ప్రజాధనం దోచి పెట్టేందుకే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ఆసరాగా చేసుకుని అధికారాన్ని దక్కించుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో ప్రజలను ఊరడిస్తోందన్నారు. హామీల అమలుకు మూడేళ్ల కాల వ్యవధి సరిపోలేదా అని ఆమె సీఎం కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. ఎర్రవల్లిలో నిర్మించిన మోడల్ డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రసార మాధ్యమాల ద్వార చూపెట్టడం మినహా.. అర్హులైన నిరుపేదలకు ఒక్కరికీ అందించలేదన్నారు.
పెద్ద నోట్ల రద్దు పెద్ద కుట్ర
ఇక కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు వెనక పెద్ద కుట్ర జరిగిందని ఈ కుట్రలో సీఎం కేసీఆర్ కూడా భాగస్వామి అని సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. నోట్ల రద్దు తరువాత.. ఇదో దిక్కు మాలిన చర్య అని ఘాటుగా విమర్శించిన కేసీఆర్ కేవలం 24 గంటల వ్యవధిలోనే తన స్వరా న్ని మార్చి ఇదో అద్భుతమైన ప్రక్రియ అని ప్రకటించడాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలని సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం తీసుకోని నిర్ణయాలను అసెంబ్లీ సాక్షిగా.. కేసీఆర్ తీసుకున్నారని విమర్శించారు.అవినీతి మొత్తం గంపగుత్తా కొనసాగిస్తుండటం మూలం గా..స్థానిక సంస్థలన్నీ అచేతనంగా మారిపోయాయని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూల్ చేస్తున్న నిధులను సైతం ప్రభుత్వం తమ ఖాజానాలో వేసుకుంటూ వారికి కల్పించాల్సిన మౌలిక సదుపాయాలను విస్మరించడం దారుణమని అన్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో రూ. 450 కోట్ల నిధులను అర్ధాంతరంగా నిలిపివేశారని దీంతో స్థానిక సంస్థల పాలన ఆటకెక్కిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే.. జన ఆవేదన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామ మల్లేష్, చేవెళ్ల పార్లమెంట్ నియోజక వర్గం ఇన్‌చార్జి కార్తిక్‌రెడ్డి, మీర్‌పేట్, జిల్లెలగూడ ము న్సిపాలిటీల అధ్యక్షులు పల్లె జంగయ్యగౌడ్, బండి నాగేష్‌యాదవ్, నేతలు దేప భాస్కర్‌రెడ్డి, జంగారెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement