sabitha
-
సబితపై రేవంత్ వ్యాఖ్యలు.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మహిళలను సీఎం రేవంత్ అవమానించారని.. వారంటే సీఎంకు గౌరవం లేదని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలు బాధాకారం.. ‘అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని అంటారా?’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ, తమ మహిళా శాసనసభ్యులపైన అకారణంగా సీఎం నోరు పారేసుకున్నారన్నారు.ఈ అవమానం కేవలం సబితక్క, సున్నితక్కకు జరిగింది కాదు.. తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానం. నోరు జారితే ఎవరైనా వెనక్కి తీసుకుంటారు కానీ కండకావరంతో సీఎం ఆడబిడ్డలను అవమానించారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగుల్తది. మా ఇద్దరూ మహిళా నేతలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలు. ప్రజల దీవెనలు కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవాళ్లు. నీ లెక్క పార్టీలు మారి పదవులు తెచ్చుకున్న వాళ్లు కారు.. సీఎం గుర్తుంచుకోవాలి’’ అని కేటీఆర్ హితవు పలికారు.‘‘ఇప్పటికైనా ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని... బుద్ధి తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఏ మొహం పెట్టుకుని వచ్చినవని ఉప ముఖ్యమంత్రి అనడం అన్యాయం. ఆడబిడ్డల గురించి అంత దారుణంగా మాట్లాడే అధికారం నీకు ఎవరు ఇచ్చారు భట్టి. పదేళ్లు అధికారంలో ఉన్న ఏరోజైనా ఒక్కరోజైనా ఆడబిడ్డలను అవమానించామా. సీఎంను ఏకవచనంతో మాట్లాడానని అని అభ్యంతరం చెప్తే వెంటనే మార్చుకున్నాం.. అది మాకు కేసీఆర్ నేర్పించిన సంస్కారం’’ అని కేటీఆర్ చెప్పారు. -
నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు..
భద్రాద్రి: ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల పిలుపునిచ్చారు. ఐడీఓసీలో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారోత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లిపాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కె.వెంకటేశ్వర్లు, మధుసూదన్‌రాజు, డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష, ఆస్పత్రుల సమన్వయ అధికారి రవిబాబు, మహిళా, శిశు సంక్షేమాధికారి సబిత, ఉపాధి కల్పన అధికారి విజేత పాల్గొన్నారు. వరద నష్టాల నివేదిక అందించాలి జిల్లాలో వరద నష్టాల నివేదికలను అందజేయాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. ఐడీఓసీలో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద సహాయక చర్యల్లో అధికారుల పనితీరును అభినందించారు. వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలు, పశువులు, ఇళ్లు, పిడుగుపాటు తదితర అంశాలపై సమగ్ర నివేదికలు రూపొందించాలని సూచించారు. ఆర్అండ్బీ శాఖ పరిధిలో నాలుగు వంతెనలు దెబ్బతిన్నాయని, పంచాయతీరాజ్ పరిధిలో 97 రహదారులు మరమ్మతులకు గురి కాగా 60 పనులు పూర్తి చేశామని తెలిపారు. 11 చోట్ల దెబ్బతిన్న పైపులైన్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. వచ్చిన దరఖాస్తులలో కొన్ని.. ► ఇల్లెందు సీఎస్పీ బస్తీకి చెందిన ఆదివాసీ వ్యవసాయదారులు.. తాము 1987 నుంచి పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నామని సింగరేణి అధికారులు జేకే 5 ఓసీ ఏర్పాటుకు సర్వే నిర్వహించి ఏర్పాటు చేసిన హద్దుల ప్రకారం తమ భూములను కోల్పోతున్నామని, జీవనోపాధి కల్పించాలని దరఖాస్తు చేయగా రెవెన్యూ అధికారులకు ఎండార్స్ చేశారు. ►పాల్వంచ నవభారత్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో సౌకర్యాలు లేక విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారని, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యంతో తప్పుదోవ పడుతున్నారని విద్యార్థి, యువజన సంఘాలు దరఖాస్తు చేయగా త్వరలో పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ►కొత్తగూడెం మున్సిపాలిటీ నాలుగో వార్డులో కాలువల నిర్మాణం మంజూరైనా ప్రారంభించ లేదని బీజేపీ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ అగర్వాల్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు జోగు ప్రదీప్ తదితరులు ఫిర్యాదు చేయగా కమిషనర్‌ను పిలిచి సమస్యపై ఆరా తీశారు. సంబంధిత వార్డు కౌన్సిలర్, చైర్‌పర్సన్‌ను ఆహ్వానించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. -
నల్లగొండ సబితకు కేటీఆర్ అండ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతూ కుటుంబ పోషణ కోసం ఆటో నడిపిస్తున్న నల్లగొండ విద్యార్థిని సబితకు అండగా ఉంటానని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నల్లగొండలో సబిత కుటుంబం ఆర్థిక పరిస్థితిని, ధైర్యంగా ఆటో నడుపుతూ డబ్బులు సంపాదిస్తున్న తీరును తెలుసుకున్న మంత్రి.. జిల్లా కలెక్టర్ ద్వారా వివరాలు తెప్పించుకున్నారు. ఆమెను స్వయంగా కలసి సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సబితను బుధవారం హైదరాబాద్‌లో ప్రగతిభవన్‌కు పిలిపించుకొని మాట్లాడారు. చిన్నవయసులోనే కుటుంబ పోషణ కోసం ఆటోను నడిపిస్తూ మగవారికి తీసిపోని విధంగా ధైర్యంగా ముందుకు సాగుతున్న సబిత తీరును చూసి ఆయన అభినందించారు. ఆమె కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొద్ది సంవత్సరాల కిందట తండ్రిని కోల్పోవడంతో తన తల్లి ఇళ్లల్లో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకు వచ్చిందని తెలిపింది. తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సహాయం చేయాలని, కొత్త ఆటోరిక్షా ఇప్పించాలని సబిత కోరింది. కాగా, సబిత పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని డబుల్ బెడ్రూం ఇంటి ప్రొసీడింగ్స్‌తో పాటు ఆమె అడిగిన నూతన ఆటో రిక్షా ప్రొసీడింగ్స్‌ని కేటీఆర్ స్వయంగా అందించారు. సబిత చదువుకుంటానంటే తగిన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. సబిత తన కుటుంబానికి అండగా నిలిచిన తీరు ఇతర యువతులకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు. కేటీఆర్ తనకు అండగా నిలవడంపై సబిత సంతోషం వ్యక్తం చేసింది. -
విద్యార్థిని అదృశ్యం.. ఆ యువకుడిపైనే అనుమానం
సాక్షి, పహడీషరీఫ్: ఓ యువతి అదృశ్యమైన సంఘటన పహడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ బస్వగూడ తండాకు చెందిన సభావత్ రెడ్యా నాయక్ రెండో కూతురు సభావత్ సబిత(20) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈనెల 27న బాలిక తల్లి పనికి వెళ్లి సాయంత్రం వచ్చి చూడగా సబిత కనిపించలేదు. కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించినా ఫలితం లేకపోయింది. నరేశ్ అనే యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. సబిత ఆచూకీ తెలిసిన వారు 94906 17241 నంబర్లో సమాచారం ఇవ్వాలని కోరారు. చదవండి: (పెళ్లయ్యాక స్వాతితో పీకల్లోతు ప్రేమ.. ట్యూషన్‌కి వెళ్లి..) -
పెళ్లి కూతుళ్లకు ఉచితంగా డ్రస్సులు
ఏదో ఒకటి కట్టుకుని ఎలాగోలా పెళ్లి చేసుకునే నిరుపేద వధూవరులు ఈ దేశంలో కొల్లలు. అబ్బాయిలు సరే. అమ్మాయిలకు ఎన్ని కలలని. కనీసం పెళ్లినాడు మంచి పెళ్లికూతురి డ్రస్సు వేసుకోవాలని ఉండదా? దానికి కూడా వీలు లేకపోతే ఎంత బాధ? కేరళకు చెందిన సబిత ఈ బాధ గ్రహించింది. దేశంలోని దాతల నుంచి వారు ఉపయోగించిన పెళ్లి డ్రస్సులు సేకరించి కాబోయే పెళ్లికూతుళ్లకు ఉచితంగా ఇస్తోంది. అవి కట్టుకున్న ఆడపిల్లలు ఆనందబాష్పాలు రాలుస్తుంటే సబిత అదే పెద్ద ఆశీస్సుగా భావిస్తోంది. కేరళ కోస్తా టౌన్ అయిన కన్నూర్‌లో సముద్రపు అలలు ఎన్ని ఉంటాయో పేద ఆడపిల్లల కష్టాలూ అన్నే ఉంటాయి. వరుడు దొరకడం, ఆ వరుడికి చేయాల్సిన మర్యాదలకు డబ్బు దొరకడం, పెళ్లి ఖర్చు దొరకడం, అన్నింటికి మించి కనీసం మంచి పెళ్లి డ్రస్సు ఏర్పాటు చేసుకోవడం... నిరుపేద ఆడపిల్లలు నోరు తెరిచి ఏమీ అడగలేరు. మనసులో ఉంటుంది అంతే. ఆ మనసును గ్రహించింది సబిత. ప్రార్థిస్తున్న ద్రౌపదికి వస్త్రాలు బహూకరించాడు కృష్ణుడు. పెళ్లిబట్టలకు కూడా వీలు లేక మనసులోనే బాధపడుతున్న పెళ్లికూతుళ్లకు కొత్త బట్టలు ఇస్తోంది సబిత. అమ్మాయి మనసు కన్నూరులో ‘రెయిన్ బో’ పేరుతో ఒక బొటిక్ నడుపుతోంది సబిత తొమ్మిదేళ్లుగా. కొనుక్కోగలిగిన ఆడపిల్లలు ఆమె దగ్గరకు వచ్చి డిజైనర్ దుస్తులు, డిజైనర్ పెళ్లిబట్టలు కొనుక్కుని వెళ్లేవాళ్లు. కాని కొందరు ఆడపిల్లలు కేవలం చూడ్డానికి వచ్చేవారు. ఈ చూడ్డానికి వచ్చే ఆడపిల్లలు పెళ్లి పెట్టుకొని అలాంటి డ్రస్సులు కొనలేక కనీసం చూసన్నా పోదామని వచ్చేవారు. వారిని గమనించి తనకు వీలున్నప్పుడు కొన్ని డ్రస్సులు తయారు చేయించి సబిత ఇచ్చేది. కాని వారికి అంతగా సంతృప్తి కనిపించేది కాదు. ఎందుకంటే ఉచితంగా వస్తోంది కనుక ఇచ్చింది తీసుకోవాల్సి వచ్చేది. ఛాయిస్ ఉండేది కాదు. ‘నచ్చింది తీసుకున్నామన్న’ తృప్తి వారికి కావాల్సి వచ్చేది. కాని అందుకు బదులుగా ఏం చేయాలో సబితకు అర్థమయ్యేది కాదు. రెండు నెలల క్రితం ఒక అమ్మాయి మాత్రం తనకు పెళ్లి కుదిరిందని, పెళ్లి డ్రస్సు కోసం తండ్రి వాళ్ల కాళ్లూ వీళ్ల కాళ్లూ పట్టుకుంటున్నాడని చెప్పింది. అప్పుడు సబితకు వచ్చింది ‘ఉపయోగించిన పెళ్లిబట్టలను సేకరించాలనే’ ఆలోచన. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ‘పెళ్లికోసం మీరు మంచి డ్రస్సులు కొనుక్కుంటారు. కాని అవి ప్రత్యేకమైనవి కాబట్టి ఒకటి రెండుసార్లు ఉపయోగించి దాచుకుని ఉంటారు. అవి వృధాగా పడి ఉంటాయి. అలాంటి బట్టలు పేద వధువులకు ఉపయోగపడతాయి. మంచి కండిషన్లో ఉండి, డ్రైక్లీనింగ్ చేయించి ఉన్న పెళ్లి బట్టలను మాకు పంపండి. పేద ఆడపిల్లలకు ఇస్తాం’ అని సబిత ఇన్‌స్టాగ్రామ్‌లో, తన వాట్సప్ గ్రూప్‌లో రెండు నెలల క్రితం వీడియో పెట్టింది. అంతే. ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కన్నూర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతోమంది స్త్రీలు సబితకు ఫోన్లు చేశారు. తమ పెళ్లిబట్టలు ఇస్తామని చెప్పారు. వెంటనే సబిత వాటిని కలెక్ట్ చేయడానికి ఒక మనిషిని అపాయింట్ చేసింది. కొన్ని బట్టలు కొరియర్లో వచ్చాయి. ఇప్పటి వరకూ ఆమె 300 జతల పెళ్లి బట్టలు రిసీవ్ చేసుకుంది. వాటిలో ఒక్కోటి లక్ష రూపాయల డ్రస్సు కూడా ఉన్నాయి. కొందరు చెప్పులు, ఇమిటేషన్ జువెలరీ కూడా పంపారు. విడి షోరూమ్ సబిత తన షోరూమ్‌కు ఆనుకునే ఒక గదిని ఈ ఉచిత పెళ్లిడ్రస్సుల షోరూమ్‌గా మార్చింది. దీని గురించి తెలిసిన ఆడపిల్లలు వారు ఏ మతం వారైనా కాని వచ్చి ఉచితంగా తమకు నచ్చినది తీసుకుని వెళ్లవచ్చు. కాని వారికి త్వరలో పెళ్లి కాబోతున్నదని ఏదైనా ఆధారం (వెడ్డింగ్ కార్డ్, మత పెద్ద రాసిచ్చిన లేఖ) చూపించాలి. ఈ ఏర్పాటు గురించి కేరళ అంతా తెలిసి పోయింది. దూర ప్రాంతాల నుంచి డ్రస్సులు అడిగేవారు, డ్రస్సులు పంపుతామనే వారు పెరిగిపోయారు. దాంతో సబిత తన పరిచయస్తులు, బంధువుల ద్వారా ముఖ్యమైన టౌన్లలో వారి ఇళ్లలోనే ఒక గదిలో ఈ బట్టలను చేర్చే ఏర్పాటు చేసింది. ఫోన్ వస్తే దగ్గరి ఊర్లో ఉన్న ఉచిత బొటిక్కు రిఫర్ చేస్తుంది. ఆనందబాష్పాలు ‘ఒక అమ్మాయి ఈ ఉచిత డ్రస్సు కోసం వచ్చింది. దానిని తీసుకున్న వెంటనే ఒక్క నిమిషం కూడా ఆగకుండా పరిగెత్తింది. తర్వాత ఫోన్ చేసి చెప్పింది... నాకు ఏడుపు వచ్చేసింది.. అది కనపడకూడదని పరిగెత్తాను అని. మరొకమ్మాయి.. అక్కా... దేవుడు నా ప్రార్థనను నీ ద్వారా తీర్చాడు అని చెప్పింది. ఇవన్నీ నాకు సంతోషాన్ని ఇచ్చాయి. నేను ఇదంతా ప్రచారానికి చేయడం లేదు. నేను ఆ ఆడపిల్లల ఫొటోలు తీయడం కూడా చేయను. అందుకే వారు అసౌకర్యం లేకుండా నా దగ్గరికి వస్తున్నారు’ అంది సబిత. ఆమె భర్త షార్జాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను ఆమె చేస్తున్న పనికి ఫుల్ సపోర్ట్ అందిస్తున్నాడు. మంచివాళ్లు ఉన్నారు లోకంలో. – సాక్షి ఫ్యామిలీ -
సీఎం గారూ.. ప్రజల మొక్కులు తీరేదెన్నడు?
మీర్పేట్: వరుసబెట్టి ఆలయాల చుట్టూ తిరుగుతూ దేవుళ్ల మొక్కులను తీర్చుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కాలయాపన చేయడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. జన ఆవేదన సమ్మేళనంలో భాగంగా ఆదివారం మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కుటుంబపాలన పేరుతో దోపిడీ పాలన కొగసాగుతోందని దుయ్యబట్టారు. మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ కార్యక్రమాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఇది ముమ్మాటికీ నూటికి నూరుపాళ్లు అవినీతి కార్యక్రమమని విమర్శించారు. కాంట్రా క్టర్లకు ప్రజాధనం దోచి పెట్టేందుకే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ఆసరాగా చేసుకుని అధికారాన్ని దక్కించుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో ప్రజలను ఊరడిస్తోందన్నారు. హామీల అమలుకు మూడేళ్ల కాల వ్యవధి సరిపోలేదా అని ఆమె సీఎం కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. ఎర్రవల్లిలో నిర్మించిన మోడల్ డబుల్బెడ్రూం ఇళ్లను ప్రసార మాధ్యమాల ద్వార చూపెట్టడం మినహా.. అర్హులైన నిరుపేదలకు ఒక్కరికీ అందించలేదన్నారు. పెద్ద నోట్ల రద్దు పెద్ద కుట్ర ఇక కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు వెనక పెద్ద కుట్ర జరిగిందని ఈ కుట్రలో సీఎం కేసీఆర్ కూడా భాగస్వామి అని సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. నోట్ల రద్దు తరువాత.. ఇదో దిక్కు మాలిన చర్య అని ఘాటుగా విమర్శించిన కేసీఆర్ కేవలం 24 గంటల వ్యవధిలోనే తన స్వరా న్ని మార్చి ఇదో అద్భుతమైన ప్రక్రియ అని ప్రకటించడాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలని సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం తీసుకోని నిర్ణయాలను అసెంబ్లీ సాక్షిగా.. కేసీఆర్ తీసుకున్నారని విమర్శించారు.అవినీతి మొత్తం గంపగుత్తా కొనసాగిస్తుండటం మూలం గా..స్థానిక సంస్థలన్నీ అచేతనంగా మారిపోయాయని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూల్ చేస్తున్న నిధులను సైతం ప్రభుత్వం తమ ఖాజానాలో వేసుకుంటూ వారికి కల్పించాల్సిన మౌలిక సదుపాయాలను విస్మరించడం దారుణమని అన్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో రూ. 450 కోట్ల నిధులను అర్ధాంతరంగా నిలిపివేశారని దీంతో స్థానిక సంస్థల పాలన ఆటకెక్కిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే.. జన ఆవేదన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామ మల్లేష్, చేవెళ్ల పార్లమెంట్ నియోజక వర్గం ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి, మీర్పేట్, జిల్లెలగూడ ము న్సిపాలిటీల అధ్యక్షులు పల్లె జంగయ్యగౌడ్, బండి నాగేష్‌యాదవ్, నేతలు దేప భాస్కర్‌రెడ్డి, జంగారెడ్డి పాల్గొన్నారు. -
నకిలీ తల్లిదండ్రులతో వైద్యుల వివాహయత్నం
-
నకిలీ తల్లిదండ్రులతో వైద్యుల వివాహయత్నం
చిత్తూరు: తిరుమల కొండ మీద శుక్రవారం ఉదయం మరికాసేపట్లో జరగాల్సిన పెళ్లి పీటల మీద ఆగిపోయింది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌కు చెందిన అనిల్(34), కవిత(28) వైద్యులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఏడుకొండల స్వామి సాక్షిగా వీరిద్దరు ఏడడుగులు నడవాలనుకున్నారు. శుక్రవారం మంచి ముహుర్తం ఉండటంతో టీటీడీ పౌరోహిత సంఘంలో వివాహం కోసం దరఖాస్తు చేసుకున్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం తిరుమలలో వివాహం చేసుకోవాలంటే తల్లిదండ్రుల అంగీకార పత్రాలు తప్పనిసరి. కాగా.. వధువు కవిత తరపున పెద్దలు ఈ పెళ్లికి నిరాకరించడంతో నకిలీ పత్రాలు సృష్టించి దొంగ తల్లిదండ్రులతో పెళ్లి తతంగాన్ని ముగించాలనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఈ విషయం బయటకు పోక్కడంతో కవిత తల్లిదండ్రులతో పాటు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దాంతో పెళ్లి పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. కాగా.. గతంలో కవితకు వేరే వ్యక్తితో వివాహం అయినట్లు తెలుస్తోంది. . -
టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్
పుత్తూరు : తెలుగుతమ్ముళ్లు ప్రొటోకాల్‌ను విస్మరించి ఓవరాక్షన్ చేశారు. పుత్తూరు ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం జరిగిన అభివృద్ధి కమిటీ తొలి సమావేశంలో వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే రోజా హాజరైన ఈ సమావేశానికి ఆస్పత్రి ఇన్చార్జ్ డాక్టర్ సబిత, డాక్టర్ రవిరాజులు ప్రొటోకాల్ ప్రకారం తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో భాగ్యలక్ష్మి, మున్సిపల్ ఇన్చార్జ్ కమిషనర్ తులసీకుమార్, చైర్మన్ కరుణాకరన్, ఎంపీపీ గంజి మాధవయ్య, జెడ్పీటీసీ సభ్యురాలు కమలమ్మ, 13వ వార్డు కౌన్సిలర్ పుష్పలతను వేదికపైకి ఆహ్వానించారు. ఆస్పత్రి నివేదికను చదివి వినిపించడంతో పాటు సమస్యలను వేదిక దృష్టికి తీసుకొచ్చారు. అయితే అక్కడే డాక్టర్స్ గదిలో వేచి ఉన్న టీడీపీ కార్యకర్తల్లోని ఒకరు గోపాల్‌రెడ్డి సమావేశం మధ్యలో కల్పించుకున్నారు. వైద్యులు వారి సమస్యలను మాత్రమే చెప్పుకొచ్చారని, తాను పబ్లిక్ తరఫున మాట్లాడుతున్నానని, రోగుల సమస్యను మరచి మాట్లాడటం సరికాదని వాదించారు. ఆస్పత్రి అంబులెన్స్ మూడు సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉన్నా పట్టించుకునే వారే లేరని గట్టిగా రెచ్చిపోయారు. ఈ దశలో కౌన్సిలర్, వైఎస్సార్సీపీకి చెందిన ఏలుమలై(అమ్ములు) జోక్యం చేసుకుంటూ ప్రొటోకాల్‌ను వ్యతిరేకించి అతనిని ఎందుకు రానిచ్చారని అధికారులపై మండిపడ్డారు. దీంతో మాట్లాడటానికి నువ్వెవరంటూ గోపాల్‌రెడ్డి బిగ్గరగా కేకలు వేయడంతో ఆయనకు అండగా అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు తోడయ్యారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. ఇరువర్గాల అరుపులు కేకలతో ఆస్పత్రి దద్దరిల్లింది. ఒక దశలో రోజా సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోని టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులకు సమాచారం వెళ్లింది. ఎస్ఐ రామాంజనేయులు, సిబ్బంది అక్కడికి చేరుకుని ఇరువర్గాలను బయటకు పంపేశారు. ఆస్పత్రి ఆవరణలో ఉదయం నుంచే టీడీపీ వర్గీయులు మోహరించినా అధికారులు పట్టించుకోలేదు. -
కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య
పటాన్చెరు టౌన్, న్యూస్‌లైన్: భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భానూర్‌లో శనివారం చోటుచేసుకుంది. బీడీఎల్ సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2001లో పటాన్చెరు మండలం భానూ ర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కి కొండాపూర్‌కు చెందిన సబిత (28)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. వివాహ సమయంలో సబిత తల్లిదండ్రులు కట్నం ఇచ్చారు. అదనపు కట్నం తేవాలని శ్రీనివాస్ భార్యను వేధించసాగాడు. శుక్రవారం కొండాపూర్‌లో జరిగే ఓ పెళ్లికి భార్యభర్తలు వెళ్లారు. ఆక్కడ కూడా శ్రీనివాస్ అదనపు కట్నం తేవాలని భార్య సబితను కొట్టాడు. దీంతో మనస్థాపం చెందిన సబిత ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం ఈ విషయాన్ని శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సబిత తల్లి కమలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదనపు కట్నం కోసం సబితను హత్య చేసి ఆపై ఫ్యానుకు వేలాడదీశారని కమలమ్మ ఆరోపించారు.