సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మహిళలను సీఎం రేవంత్ అవమానించారని.. వారంటే సీఎంకు గౌరవం లేదని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలు బాధాకారం.. ‘అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని అంటారా?’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ, తమ మహిళా శాసనసభ్యులపైన అకారణంగా సీఎం నోరు పారేసుకున్నారన్నారు.
ఈ అవమానం కేవలం సబితక్క, సున్నితక్కకు జరిగింది కాదు.. తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానం. నోరు జారితే ఎవరైనా వెనక్కి తీసుకుంటారు కానీ కండకావరంతో సీఎం ఆడబిడ్డలను అవమానించారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగుల్తది. మా ఇద్దరూ మహిళా నేతలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలు. ప్రజల దీవెనలు కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవాళ్లు. నీ లెక్క పార్టీలు మారి పదవులు తెచ్చుకున్న వాళ్లు కారు.. సీఎం గుర్తుంచుకోవాలి’’ అని కేటీఆర్ హితవు పలికారు.
‘‘ఇప్పటికైనా ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని... బుద్ధి తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఏ మొహం పెట్టుకుని వచ్చినవని ఉప ముఖ్యమంత్రి అనడం అన్యాయం. ఆడబిడ్డల గురించి అంత దారుణంగా మాట్లాడే అధికారం నీకు ఎవరు ఇచ్చారు భట్టి. పదేళ్లు అధికారంలో ఉన్న ఏరోజైనా ఒక్కరోజైనా ఆడబిడ్డలను అవమానించామా. సీఎంను ఏకవచనంతో మాట్లాడానని అని అభ్యంతరం చెప్తే వెంటనే మార్చుకున్నాం.. అది మాకు కేసీఆర్ నేర్పించిన సంస్కారం’’ అని కేటీఆర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment