ఫిర్యాదుతోనే అసలు కథ మొదలైంది | MRO Sujatha Arrested On Banjara Hills Land Issue | Sakshi
Sakshi News home page

కుదిరితే కాసులు.. లేకుంటే కేసులు

Published Tue, Jun 9 2020 8:25 AM | Last Updated on Tue, Jun 9 2020 9:14 AM

MRO Sujatha Arrested On Banjara Hills Land Issue - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : ‘కుదిరితే కాసులు..లేకుంటే కోర్టు కేసులుగా..’ తయారైంది ప్రభుత్వ స్థలాల పర్యవేక్షణ పరిస్థితి. హైదరాబాద్‌ జిల్లాలో రెవెన్యూ శాఖ అంటేనే ప్రభుత్వ భూములు...వాటి పరిరక్షణే ప్రధాన బాధ్యత. ఇక అత్యంత విలువ గల స్థలాలు కావడంతో అటూ అక్రమార్కులకు... ఇటు అధికారులకు కాసుల పంట పండుతోంది. తాజాగా వెలుగు చూసిన బంజారాహిల్స్‌ భూ వివాదంలో ఇరువర్గాల సరికొత్త వ్యూహం బెడిసికొట్టినట్లయింది. ఒకవైపు మధ్యంతర ఉత్తర్యులు అడ్డం పెట్టుకొని స్థలం సర్వే, ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌కోసం ప్రయత్నించడం..మరోవైపు ఒక స్థలంపై ఫిర్యాదు చేసి అసలు వివాదాస్పద స్థలంపై బేరసారాలు నడిపి కాసులుదండుకుంటూ ఏసీబీ చేతిలో చిక్కక తప్పలేదు.

ఏకంగా రూ.30 లక్షల డీల్‌ కుదుర్చుకొని రూ.15 లక్షలు తీసుకుంటూ షేక్‌పేట ఆర్‌ఐ నాగార్జునరెడ్డి  రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడం సంచలనం సృష్టించగా, తహసీల్దార్‌ సుజాత ఇంట్లో రూ.30 లక్షల నగదు, అరకిలో బంగారు నగలు ఏసీబీ అధికారులకు లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా ఏసీబీ విచారణలో మరి కొందరి చేతివాటం కూడా వెలుగు చూడటం రెవెన్యూ యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా,  తహాసీల్దార్‌ సుజాతను కలెక్టరేట్‌కు బదిలీ చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ అయ్యాయి. అమీర్‌పేట తహసీల్దార్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. (షేక్‌పేట భూవివాదం కేసు : రూ.30 లక్షలు ఎక్కడివి?)

ఇదీ కథ.. 
నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14 సర్వేనెంబర్‌ 129/59లో అత్యంత విలువగల  4,865 చదరపు గజాల భూమిపై గత రెండు దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. హైదరాబాద్‌ పాతబస్తీ మీరాలం మండికి చెందిన సయ్యద్‌ అబ్దుల్‌ ఖలీద్‌ అనే వ్యక్తి తన తండ్రి అబ్దుల్‌ రషీద్‌  1969లో ఈ భూమిని  కొనుగోలు చేశాడని పేర్కొంటుండగా.. అది ప్రభుత్వ స్థలమంటూ సివిల్‌ కోర్టు 1998లో తీర్పుచెప్పింది. దీనిపై అబ్దుల్‌ ఖలీద్‌ హైకోర్టును ఆశ్రయించి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు పొందారు. కోర్టులో వివాదం పెండింగ్‌లో ఉన్నప్పటికి మధ్యంతర ఉత్తర్వులు ఆధారంగా తన భూమిని సర్వే చేసి ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలని షేక్‌పేట్‌ రెవెన్యూ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆ భూమి వ్యవహారంలో ఎలాంటి జోక్యం చేసుకునేందుకు వీల్లేకుండా పోయింది. 

మరో స్థలంపై ఫిర్యాదు. 
వివాదాస్పద భూమి అయినా..కాసులు దండుకునేందుకు రెవెన్యూ అధికారులు అతితెలివి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అసలు వివాదాస్పద స్థలాన్ని వదిలి..దాని పక్కన గల స్థలంపై ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావిస్తోంది. బంజరాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 14లోని ఆశా హాస్పిటల్‌ దగ్గర వివాదాస్పద స్థలానికి సమీపంలోని సర్వే నెంబర్‌ 403/పీలోని ప్రభుత్వ స్థలాన్ని  కబ్జా చేసేందుకు అబ్దుల్‌ ఖలీద్‌ ప్రయత్నం చేశారని షేక్‌పేట తహసీల్దార్‌ ఏప్రిల్‌ 30న  బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సూచిక బోర్డునుసైతం తొలగించడంతో పాటు తమ సిబ్బంది అడ్డుకున్నప్పటికి పదేపదే తన సొంత భూమి అంటూ  బోర్డు ఏర్పాటు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. (ఎమ్మార్వో ఇంట్లో మరిన్ని ల్యాండ్‌ డాక్యుమెంట్లు)

కేసు తర్వాతనే అసలు కథ.. 
బంజారాహిల్స్‌లోని సర్వే నెంబర్‌ 403/పీలోని స్థలంపై ఫిర్యాదుతోనే అసలు కథ మొదలైంది. ఒకవైపు పోలీసుల వత్తిడి పెరగడంతో అసలు వివాదాస్పద భూమి వ్యవహారంపై బేరసారాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇందులో పోలీసుల ఉచిత సలహాల కూడా ఉన్నట్లు సమాచారం. . దీంతో వివాదాస్పద స్థలానికి అన్ని విధాలుగా సహకరించేందుకు స్థలం విలువలో పది శాతం డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది. అధికారుల అత్యాశ ఫలితంగా పూర్తి స్థాయిలో వ్యవహరం చక్కబడకముందే బహిర్గతమైంది. ఇక ప్రభుత్వ భూములను పర్యవేక్షించాల్సిన వారే భక్షించడంపట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

షేక్‌పేట తహసీల్దార్‌ అరెస్టు 

రెవెన్యూ శాఖలో సంచలనం సృష్టించిన  బంజారాహిల్స్‌ భూవివాదం కేసులో షేక్‌పేట తహసీల్దార్‌ సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. సోమవారం ఉదయం నుంచి సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ అధికారులు.. భూ వివాదం కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దీంతో అరెస్ట్‌ చేసి, అనంతరం వైద్యపరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మార్వో సుజాత పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇంట్లో దొరికిన రూ.30 లక్షలకు ఆధారాలు చూపలేకపోయారని సమాచారం. మరోవైపు సుజాత ఇంట్లో షేక్‌పేట్‌కు చెందిన మరికొన్ని ల్యాండ్‌ డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో సంబంధం ఉన్నట్లు అనుమానం ఉన్న అందరి కాల్‌లిస్ట్‌లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆర్డీవో వసంత కుమారిని అధికారులు విచారించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement