ఇక స్మార్ట్‌ వాష్‌ రూమ్స్‌ | Municipal branch mandate For Municipal Commissioners On Smart Wash Rooms | Sakshi
Sakshi News home page

ఇక స్మార్ట్‌ వాష్‌ రూమ్స్‌

Published Mon, Mar 16 2020 1:51 AM | Last Updated on Mon, Mar 16 2020 1:51 AM

Municipal branch mandate For Municipal Commissioners On Smart Wash Rooms - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అన్ని పట్టణ ప్రాంతాల్లో జనాభా అవసరాలకు తగ్గట్టు సమీకృత స్మార్ట్‌ వాష్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ నిర్ణయించింది. స్వచ్ఛ భారత్‌ (అర్బన్‌) మార్గదర్శకాల మేరకు పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) లేదా ఇతర పద్ధతుల్లో టాయిలెట్లు, యూరినల్స్, హ్యాండ్‌వాష్‌ల సదుపాయంతో సమీకృత వాష్‌రూమ్స్‌ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. టాయిలెట్, యూరినల్స్, హ్యాండ్‌ వాష్‌లు ఒకే సముదాయంలో ఉండనున్నాయి. వీటికి అదనంగా ఏటీఎం, ఫొటో కాపీయింగ్‌ (జిరాక్స్‌), వైఫై, ఇంటర్నెట్, ప్రింటర్, మీ–సేవాలతో పాటు ఆహ్లాదకరమైన కేఫే సదుపాయాన్ని కల్పిస్తారు. స్మార్ట్‌ వాష్‌ రూమ్‌లో ఏర్పాటు చేసే ఇతర వాణిజ్య సముదాయాలతో పాటు ప్రకటనలతో ఆదాయం వచ్చే మార్గాలుంటే వాష్‌రూమ్‌ల వినియోగానికి చార్జీలు వసూలు చేయరు. హైదరాబాద్‌లో పలు చోట్ల వాష్‌రూమ్స్, ఏటీఎం, కేఫేలతో నిర్మించిన ‘లూ కేఫే’లను ఆదర్శంగా తీసుకుని వీటిని ఏర్పాటు చేయబోతున్నారు.  

జనాభాకు తగ్గట్టు.. 
పురుషుల కోసం 100 నుంచి 400 మందికి టాయిలెట్‌ సీట్‌ ఏర్పాటు చేయాలని, జన సంచారం 400 మందికి మించి ఉంటే, ఆపై 250 మందికి ఒక టాయిలెట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి 50 మందికి ఒక యూరినల్‌ నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రతి ఒక్క టాయిలెట్, యూరినల్‌కు ఒక హ్యాండ్‌వాష్‌ను ఏర్పాటు చేయనుంది. మహిళల కోసం 100 నుంచి 200 మందికి రెండు టాయిలెట్‌ సీట్లు, 200 మందికి మించితే ప్రతి 100 మందికి అదనంగా మరో ఒక టాయిలెట్‌ సీట్‌ను నిర్మించనుంది. మహిళల కోసం ప్రత్యేకంగా యూరినల్స్, హ్యాండ్‌ వాష్‌లు ఏర్పాటు చేయరు. సామూహిక మరుగుదొడ్ల విషయానికి వస్తే ప్రతి 35 మంది పురుషులకు ఒకటి, 25 మంది మహిళలకు ఒకటి చొప్పున టాయిలెట్లు నిర్మిస్తారు. వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలు ఉండనున్నాయి.
 
పీపీపీ భాగస్వామ్యంతో.. 
రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో స్థానికంగా సమీకృత స్మార్ట్‌ వాష్‌ రూమ్స్, సామూహిక మరుగుదొడ్లకు ఉన్న అవసరాలను గుర్తించేందుకు అధ్యయనం చేసి అవసరమైన మేరకు టాయిలెట్ల నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేయాలని మున్సిపల్‌ కమిషనర్లను పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ తాజాగా ఆదేశించారు. పీపీపీ విధానం లేదా ప్రైవేటు వ్యాపారవేత్తల భాగస్వామ్యంతో సుదీర్ఘ కాలం మన్నిక కలిగిన సమీకృత స్మార్ట్‌ వాష్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలని కమిషనర్లను కోరారు. పీపీపీ భాగస్వామ్యంతో డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ (డీబీ ఎఫ్‌వోటీ) విధానంలో పురపాలికల్లోని వాణిజ్యపర ప్రాంతాల్లో స్మార్ట్‌ వాష్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసేందుకు, ఇప్పటికే ఉన్న పాత టాయిలెట్‌ కాంప్లెక్స్‌లను రిహాబిలేట్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ (ఆర్‌వోటీ) కింద స్మార్ట్‌ వాష్‌ రూమ్స్‌గా పునర్‌నిర్మించేందుకు ప్రైవేటు పార్టీలు ఆసక్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ వాష్‌ రూమ్స్‌ల ఏర్పాటుకు ఆసక్తి గల ప్రైవేటు సంస్థలు, సొసైటీలు, స్వయం సహాయక సంఘాలు తదితర వాటి నుంచి ఆసక్తి వ్యక్తీకరణను (ఈవోఐ) ఆహ్వానించాలని కమిషనర్లను ఆదేశించారు. స్వచ్ఛ బారత్‌ మార్గదర్శకాల ప్రకారం ఒక స్మార్ట్‌ వాష్‌ రూమ్‌లో ఒక టాయిలెట్‌ నిర్మాణానికి రూ.98 వేలు, యూరినల్‌ ఏర్పాటుకు రూ.32 వేల వరకు వ్యయాన్ని అనుమతించనున్నారు.  

మూడు పద్ధతుల్లో నిర్మాణం.. 
ప్రైవేటు సంస్థల డిజైన్లకు అనుగుణంగా స్మార్ట్‌ వాష్‌ రూమ్స్‌ల నిర్మాణాన్ని అనుమతించనున్నారు. అయితే, డిజైన్లను స్థానిక పురపాలిక/జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. పురపాలిక/జిల్లా కమిటీ రూపొందించిన డిజైన్‌ ప్రకారం స్మార్ట్‌ వాష్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయవచ్చు. అయితే, స్థానిక లేఅవుట్‌కు తగ్గట్టు డిజైన్‌కు చిన్నచిన్న మార్పులు అనుమతిస్తారు. ఇప్పటికే ఉన్న పాత టాయిలెట్‌ సముదాయాల స్థానంలో కొత్తగా స్మార్ట్‌ వాష్‌ రూమ్స్‌ను నిర్మిస్తారు.  

సమయ పాలన..     
సామూహిక టాయిలెట్లు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం వరకు బాగా వినియోగంలో ఉంటాయి. రైల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్లు, విమానాశ్రాయాల వద్ద ఉండే స్మార్ట్‌ వాష్‌రూమ్స్‌ 24 గంటలు వినియోగంలో ఉంటాయి. ప్రధాన వ్యాపార కూడళ్లలో ఉండే వాటికి ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు డిమాండ్‌ ఉండనుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని స్మార్ట్‌ వాష్‌ రూమ్స్‌ నిర్వహించనున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement