- నల్లగొండ మున్సిపల్ ఆస్తుల కిరికిరి
- షాపులు ఖాళీ చేయించని అధికారులు
- లీజుదారులకు రాజకీయ అండదండలు
- హైకోర్టు స్టేఎత్తివేసి రెండు నెలలపైనే
- నోరు మెదపని ఉన్నతాధికారులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ మున్సిపాలిటీలో పెద్ద మంత్రాంగమే నడుస్తోంది. పట్టణం నడిబొడ్డున ఉన్న వందలాది మున్సిపల్ షాపుల లీజు వ్యవహారం ఇంకా ఓ కొలిక్కిరాలేదు. ఫలితంగా నెలనెలా మున్సిపాలిటీకి రావాల్సిన సుమారు రూ. 3.20 కోట్ల ఆదాయం రాకుండా పోతోంది. నెలకు రూ.10వేల నుంచి రూ.20 వేల దాకా అద్దె (బహిరంగ మార్కెట్ మేరకు..) రావాల్సిన షాపులకు కేవలం రూ.500 మాత్రమే చెల్లిస్తున్న వారున్నారు. అదికూడా 2008 నుంచి ఒక్కరూ చెల్లించడం లేదు. కొందరు లీజుదారుల అద్దె మూడు వందల రూపాయల కంటే కూడా తక్కువగానే ఉంది.
ఇక, మున్సిపాలిటీ నుంచి 25ఏళ్ల లీజు తీసుకున్న వారిలో అత్యధికులు ఇతర వ్యాపారులకు వేలాది రూపాయల అద్దెకు ఇచ్చుకున్నారు. కాగా 234 మంది లీజుదారుల్లో మాజీ చైర్మన్ వెంకటనారాయణగౌడ్‌కు చెందిన పీవీఎన్ సినీ మ్యాక్స్ (సినిమా థియేటర్) కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లిన విషయం విదితమే. మిగిలిన 233 మంది లీజుదారుల్లో కేవలం 137మందే కోర్టును ఆశ్రయించి స్టే పొందారు. కాగా ఈ ఏడాది జూన్ 26వ తేదీనే ఈ స్టేను తొలగిస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.
చీఫ్ జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ సంజయ్‌కుమార్‌లతో కూడిన బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికీ రెండు నెలలుపైగా దాటిపోయినా, మున్సిపల్ అధికారుల్లో చలనం కనిపించడం లేదు. కేవలం నోటీసులు మాత్రం ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. రాజకీయజోక్యంతో, లీజుదారులు సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేంత గడువు ఇచ్చేలా సాయం చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి, పాతికేళ్ల లీజు పూర్తయిన మున్సిపల్ ఆస్తులన్నింటికీ తిరిగి వేలం నిర్వహించాలని 2009, ఆగస్టు25వ తేదీన హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కానీ, కొత్తగా వేలం నిర్వహించలేదు. హైకోర్టు ఈఏడాది జూన్‌లో స్టే ఎత్తివేశాక, దుకాణ లీజుదారుల నుంచి ఒక్కొక్కరి నుంచి కనీసం రూ. 10వేల చొప్పున డబ్బులు వసూలు చేశారని సమాచారం.
ఇలా వసూలు మొత్తం రూ.23.40లక్షల దాకా అయ్యింది. ఈ డబ్బును వెదజల్లే దుకాణాలకు కొత్తవేలం నిర్వహించకుండా అటు అధికారులు, ఇటు మున్సిపల్ పాలకవర్గాన్ని మేనేజ్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యంత రద్దీ ప్రాంతాల్లోని దుకాణాలు కావడంతో వీటి అద్దెలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ, మున్సిపల్ అధికారులు మాత్రం అతితక్కువ అద్దెకు లీజుకు ఇచ్చారు.
నిధులలేమిని సాకుగా చూపెడుతూ పట్టణంలోని సమస్యలను పెండింగులో పెడుతున్న వీరు, మున్సిపాలిటికీ రావాల్సిన ఆదాయంపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. తక్షణం దుకాణాలకు కొత్త వే లంపాటకు నోటిఫికేషన్ జారీ చేసి, వేలం పూర్తి చేస్తే, లీజు అద్దెల రూపంలో రూ.కోట్లు మున్సిపల్ ఖజానాకు చేరే అవకాశం ఉంది. ఇక, దృష్టి సారించాల్సింది మాత్రం, రాష్ట్ర స్థాయిలోని మున్సిపల్ ఉన్నతాధికారులు, జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్‌పాలక వర్గమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గలీజు దందా!
Published Tue, Sep 9 2014 2:25 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement