సాక్షి, కరీంనగర్: అందరిలోను అదే టెన్షన్.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తేదీ ఖరారుపై హైకోర్టు నేడు ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ ఇటు అభ్యర్థులు.. అటు అధికారుల్లోనూ ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల మాదిరిగానే మే నెలలోనే మున్సిపల్ ఫలితాలు ప్రకటించాలని తీర్పు వస్తే అన్ని రోజులు ఈవీఎంల భద్రత ఎలా అని అధికారుల్లో ఆందోళన.. అన్ని రోజులు టెన్షన్ ఎలా భరించేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. హైకోర్టు తీర్పునుబట్టి అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
షెడ్యూల్ ప్రకారం రేపు ఫలితాలు ప్రకటించాలని తీర్పు వస్తే ఫర్వాలేదనీ... మే నెలలో ప్రకటించాలని హైకోర్టు తీర్పు చెబితే.. ఈవీఎంలను సంబంధిత రెవిన్యూ డివిజన్ కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఆర్డీవోలను ఆదేశించారు. అవే కేంద్రాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులు భద్రపర్చనున్నారు. కార్పొరేషన్లయిన కరీంనగర్, రామగుండం, మున్సిపాలిటీలైన కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, సిరిసిల్ల, నగరపంచాయతీలు జమ్మికుంట, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వేములవాడల్లో మార్చి30న ఎన్నికలు జరిగాయి.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 2న ఫలితాలు ప్రకటించాలి. ఈ నెల 6, 11 తేదీల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ‘పుర’పోరు ప్రభావం ఈ నెల 30 నాటి సాధారణ ఎన్నికలపై ఉంటుంద ని అన్నిపార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు సైతం మేలో ప్రకటించాలని సుప్రీం తీర్పు చెప్పింది. ఈక్రమంలో పుర పోరుపైనా హైకోర్టును ఆశ్రయించగా ఫలితాలపై నేడు తీర్పు చెప్పనుంది.
ఒకవేళ వచ్చే నెలలో ఫలితాలు ప్రకటించాలని హైకోర్టు తీర్పి చెబితే.. హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట నగర పంచాయతీల్లో ఉన్న ఈవీఎంలు కరీంనగర్‌లోని చింతకుంట రెసిడెన్షియల్ స్కూలుకు తరలించి భద్రపర్చాలని అధికారులు నిర్ణయించారు. పెద్దపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఈవీఎంలు రామగుండం కార్పొరేషన్లో, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఈవీఎంలు జగిత్యాల పట్టణంలో, సిరిసిల్ల మున్సిపాలిటీ, వేములవాడ నగరపంచాయతీ ఈవీఎంలు సిరిసిల్ల పట్టణంలో భద్రపరుస్తున్నట్లు మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారి శ్యాంప్రసాద్‌లాల్ తెలిపారు.
టెన్షన్.. టెన్షన్
Published Tue, Apr 1 2014 2:43 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement