ది ప్రొటీన్ వీక్ సర్వే వివరాలు వెల్లడిస్తున్న సుమతీరావు, శశికిరణ్, నందన్ జోషి తదితరులు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రతి పదిమంది ఉద్యోగుల్లో ఆరుగురు కండరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నట్లు ది ప్రొటీన్ వీక్–2019 సర్వేలో వెల్లడైంది. డనోన్ ఇండియా, ఆరోగ్య వరల్డ్ ఇండియా ట్రస్ట్ సంయుక్తంగా ఇటీవల దేశంలోని నోయిడా, హైదరాబాద్, బెంగళూర్‌లలోని వివిధ కార్పొరేట్ సంస్థల్లో పని చేస్తున్న సుమారు 40 వేల మంది ఉద్యోగుల కండరాల ఆరోగ్యంపై సర్వే నిర్వహించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన సర్వేలో ప్రొటిన్స్ లోపం వల్ల ప్రతి పదిమంది ఉద్యోగుల్లో ఆరుగురు కండరాల బలహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించింది. పురుషులతో పోలిస్తే, మహిళల్లో బాధితులు 10:8 నిష్పత్తిగా నమోదు ఆందోళన కలిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం తాజ్‌దెక్కన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ శశికిరణ్, డనోస్ ఇండియా న్యూట్రిషన్స్ సైన్స్ మెడికల్
విభాగాధిపతి డాక్టర్ నందన్
జోషి, ఇన్‌బాడీ సంస్థ ప్రతినిధి డాసన్‌కిమ్, ఆరోగ్య వరల్డ్ కంట్రి మేనేజర్ సుమతిరావులు మాట్లాడారు. జీవనశైలిలో చోటు చేసుకున్న మార్పులకు తోడు ఆహారపు అలవాట్లు, శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడంతో కండరాల ఆరోగ్యం దెబ్బతింటోందని ప్రకటించారు. ప్రొటీన్ వీక్ కార్యక్రమంలో భాగంగా జూలై 24 నుంచి 30వరకు దేశంలోని వివిధ కార్పొరేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు కండరాల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మనిషి ఆరోగ్యవంతమైన జీవితానికి అన్ని దశల్లోనూ ప్రొటీన్స్ అవసరమని ప్రకటించారు. శారీరక ఎదుగుదల తర్వాత శరీరానికి కావాల్సినంత ప్రొటీన్ అందటం లేదు. ప్రతి రోజు తీసుకునే ఆహారంలో మనకు అందే కేలరీలతో పోలిస్తే ప్రొటీన్ పది నుంచి 15 శాతం అందాలి. శరీర బరువుకు సంబంధించి ప్రతి కేజీకి 08 నుంచి 1.0 గ్రాముల ప్రొటీన్ అవసరం. ఈమేరకు అందకపోవడంతో కండరాలు బలహీనపడి, ఆరోగ్యం దెబ్బతింటోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. శరీరానికి అవసరమైన ప్రొటిన్స్ తీసుకోవడం వల్ల కార్పొరేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పని చేసే అవకాశం ఉందని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment