
అనుమానాస్పదంగా మృతిచెందిన జోసఫ్
శంషాబాద్ : ప్రైవేటు ఎయిర్‌లైన్స్ ఉద్యోగి అనుమానస్పదంగా మృతిచెందిన సంఘటన శంషాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన జోసెఫ్(28) ఎయిర్‌పోర్టులోని ఎయిర్‌లైన్స్‌లో ఆరు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాడు. తోటి ఉద్యోగులతో కలిసి పట్టణంలోని మధురానగర్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు నివాసముంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం స్నేహితుడికి ఫోన్ చేసి తాళం చెవి తీసుకుని గదికి వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా నాలుగో అంతస్థు నుంచి జోసఫ్ కిందపడడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.
స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తోటి ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. జోసఫ్ కిందపడి మృతిచెందిన సమయంలో అతడి ఒంటిపై బనియన్, డ్రాయర్ మాత్రమే ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరితోనైనా ఘర్షణ పడ్డాడా? ప్రమాదవశాత్తు జారిపడ్డాడా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment