సాక్షి, హైదరాబాద్: ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణ తదితర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నాబార్డు పచ్చజెండా ఊపింది. ఈ రంగాలకు పూర్తి ప్రాధాన్యం ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డు దిశానిర్దేశం చేసింది. ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర రుణ ప్రణాళిక విధానపత్రంలో ఈ అంశాలను పేర్కొంది. వీటితోపాటు రాష్ట్రంలో ఏయే రంగా లపై దృష్టి సారించాలన్న దానిపై సమగ్ర నివేదిక తయారు చేసింది. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చు తగ్గించడం, కూలీల కొరతను అధిగమించడం సాధ్యమవుతుందని పేర్కొంది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమపై దృష్టిపెట్టడం ద్వారా వ్యవసాయ పంట ఉత్పత్తుల్లో వృథాను అరికట్టడం, విలువ ఆధారిత అదనపు ఉత్పత్తులను తయారు చేసి అధిక లాభాలను ఆర్జించడానికి వీలవుతుందని తెలిపింది. ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు, కాటన్ సీడ్ ఆయిల్, ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇలా అనేక రకాల వాటిని ఏర్పాటు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగానే ఈ ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యత కల్పించింది. జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా యూనిట్లు, రుణాలను ఖరారు చేసింది.
11వేల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.1.01 లక్షల కోట్లు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డు సూచించిన సంగతి తెలిసిందే. అందులో 70% అంటే రూ.70,965 కోట్లు వ్యవసాయం, పశుసంవర్థక, మత్స్యశాఖ సహా అనుబంధరంగాలకే చెందాలని నిర్దేశించింది. వచ్చే ఏడాది 11,182 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఇందుకోసం రూ.1,145 కోట్లు రుణంగా ఇవ్వాలని సూచించింది. ప్రతిపాదిత అంశాల్లో 667 ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు, 899 డెయిరీ ప్రొడక్ట్ యూనిట్లు, 482 రైస్ మిల్లులు, 345 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు రుణాలు ఇవ్వాలని సూచించింది. వీటితోపాటు కాటన్ సీడ్ ఆయిల్ యూనిట్లు 22, దాల్ మిల్లులు 74, ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్లు 180, మసాలా గ్రైండింగ్ యూనిట్లు 84, మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు 14, వేప నూనె మిల్లులు 3 ఉన్నాయి. వీటన్నింటినీ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని ఏర్పాటు చేసింది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవసరమైన ధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, కోళ్లు, చేపలు వంటి వాటిని పంట కాలనీల ద్వారా నిర్దేశిత ప్రాంతాల నుంచి సేకరిస్తారు. ఈ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని నాబార్డు తెలిపింది.
ట్రాక్టర్లు, పరికరాలకు 1,987 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నాబార్డు నివేదిక తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వివిధ రకాల యంత్రాల కొనుగోలుకు రూ.2,833 కోట్లు కేటాయింపునకు సూచనలు ఇచ్చింది. అందులో కేవలం ట్రాక్టర్లు, పరికరాల కోసమే రూ.1,987 కోట్లు కేటాయించడం గమనార్హం. అంటే వచ్చే ఏడాది అత్యధికంగా ట్రాక్టర్ల రుణాలపైనే సర్కారు దృష్టిసారించింది. అందులో 2,585 సెకండ్ హ్యాండ్ లేదా మినీ ట్రాక్టర్లకు రూ.79 కోట్లు రుణంగా ఇస్తారు. అలాగే 25,356 ట్రాక్టర్లు, ఇతర పరికరాలకు రూ.1,906 కోట్ల రుణం ఇస్తారు. 180 ట్రాక్టర్ డ్రాన్ డైరెక్ట్ సీడింగ్ యూనిట్లకు రూ.1.22 కోట్లు ఇస్తారు. 68 ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్లకు రూ.63 లక్షలు ఇస్తారు.
సగం రుణాలు పత్తి, వరి పంటలకే!
నాబార్డు ప్రకటించిన విధాన పత్రంలో వచ్చే ఏడాది రూ.49,785 కోట్లు పంట రుణాలకు కేటాయించాలని సూచించగా, అందులో దాదాపు సగం అంటే రూ.24 వేల కోట్లు పత్తి, వరి పంటలకే ఇవ్వాలని ఆదేశించింది. పత్తి రైతులకు రూ.12,456 కోట్లు, వరి రైతులకు రూ.11,635 కోట్లు రుణంగా ఇవ్వాలని బ్యాంకర్లకు ప్రతిపాదించింది. అలాగే మొక్కజొన్న సాగు చేసే రైతులకు రూ.4,250 కోట్లు కేటాయించింది. మిర్చి సాగు చేసే రైతులకు రూ. వెయ్యి కోట్లు కేటాయించింది. విత్తనోత్పత్తి చేసే రైతులకు కేవలం రూ.142 కోట్లు మాత్రమే రుణంగా ఇవ్వనుంది.
Published Mon, Feb 4 2019 2:22 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment