బీటెక్ కాంట్రాక్టర్
- ఇంజనీరింగ్ పూర్తయిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
- కాంట్రాక్టర్లుగా ఎదిగేందుకు ప్రభుత్వ ప్రోత్సాహం
- కాంట్రాక్టు పనులపై న్యాక్ ద్వారా శిక్షణ
- ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా రాయితీలు
- త్వరలో 200 మందితో తొలి బ్యాచ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్
కాంట్రాక్టర్ కావాలంటే ఏం చేయాలి..? చేతిలో దండిగా డబ్బులుండాలి.. నిర్మాణ పనులు చేయగలిగే సామర్థ్యం ఉండాలి.. పనులు పొందగలిగే పలుకుబడి ఉండాలి! ఇది సర్వత్రా వ్యక్తమయ్యే అభిప్రాయం. కానీ దీనికి భిన్నంగా.. బీటెక్ పూర్తికాగానే నేరుగా కాంట్రాక్టర్ అయ్యేలా ప్రభుత్వమే ప్రోత్సహించబోతోంది. అయితే దీన్ని ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే పరిమితం చేసింది. వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు శిక్షణ ఇచ్చే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) ఇందులో కీలక భూమిక పోషించనుంది.
ఇప్పటివరకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణకే పరిమితమైన న్యాక్ తాజాగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తరగతులకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ రంగంలో గతంలో కొన్ని శిక్షణ తరగతులు నిర్వహించినా అవి తాత్కాలికంగానే కొనసాగాయి. ఇప్పుడు పూర్తిస్థాయిలో శిక్షణలు ప్రారంభించబోతోంది. తొలి విడతలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు కాంట్రాక్టుల్లో నైపుణ్యం కల్పించేందుకు ప్రత్యేక తరగతులకు శ్రీకారం చుడుతోంది.
మూడు నెలల శిక్షణ
రోడ్లు, భవనాలు, ఇతర ప్రాజెక్టుల్లో కాంట్రాక్టులు పొందటంలో ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భవించిన తొలినాళ్లలోనే ఈ మేరకు ప్రభుత్వం ఓ ఉత్తర్వు కూడా జారీ చేసింది. కానీ అది ఆచరణలోకి రాలేదు. ఇప్పుడు దాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు న్యాక్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. బీటెక్ పూర్తి అయిన ఎస్సీ, ఎస్టీ ఔత్సాహికులు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ద్వారా కాంట్రాక్టు పనులు నిర్వహించే విషయంలో వారికి న్యాక్ మెళకువలు నేర్పుతుంది. కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత సొంతంగా కాంట్రాక్టులు పొందేందుకు వారికి అర్హత లభిస్తుంది.
సాధారణంగా ఆర్థికంగా స్థితిమంతులే కాంట్రాక్టులను పొందటం కద్దు. కానీ దానితో సంబంధం లేకుండా పేద ఎస్సీ, ఎస్టీ యువకులు కాంట్రాక్టులు పొందేలా ప్రభుత్వం కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు కల్పించనుంది. న్యాక్ ద్వారా శిక్షణ పొంది కాంట్రాక్టుల్లో పాల్గొనే వారికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. రుసుములు, ధరావతులు, ఇతర కొన్ని నిబంధనల నుంచి వారికి సడలింపు ఇవ్వాలని
నిర్ణయించింది. తొలుత 200 మందితో ఓ బ్యాచ్‌ను త్వరలో న్యాక్ ప్రారంభించబోతోంది.