ఈస్ట్‌ జోన్‌లో ఈజీ జర్నీ | Nagole Junction Flyover Plan Starts | Sakshi
Sakshi News home page

రయ్‌..రయ్‌

Published Sat, Jan 5 2019 9:24 AM | Last Updated on Sat, Jan 5 2019 9:24 AM

Nagole Junction Flyover Plan Starts - Sakshi

ఎల్‌బీనగర్‌ ఫ్లై ఓవర్‌

సాక్షి, సిటీబ్యూరో: ఎల్‌బీనగర్‌ పరిసరాల్లో ప్రయాణించేవారికి ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన కామినేని ఫ్లై ఓవర్‌(ఎడమవైపు), చింతల్‌కుంట అండర్‌పాస్‌లతోపాటు మరికొన్ని ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఎల్‌బీనగర్‌ జంక్షన్‌ వద్ద దిల్‌సుఖ్‌నగర్‌ వైపు నుంచి హయత్‌నగర్‌ వైపు వెళ్లే ఫ్లై ఓవర్‌ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నెల్లోనే దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఇదే జంక్షన్‌ వద్ద కామినేని వైపు నుంచి బైరామల్‌ గూడవైపు వెళ్లేవారికి సదుపాయంగా నిర్మాణం చేపట్టిన అండర్‌పాస్‌ పనులు పురోగతిలో ఉన్నాయి. మరో ఆర్నెళ్లలో ఈ పనులు పూర్తికానున్నాయి. దీంతోపాటు నాగోల్‌ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ చిక్కుల పరిష్కారానికి తాజాగా చేపట్టిన ఫ్లై ఓవర్‌ పనులతో ఈస్ట్‌జోన్‌లో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఏటా రూ.10 వేల కోట్ల వంతున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లతో నగరాభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన నేపథ్యంలో, అందుకనుగుణంగా ఎస్సార్‌డీపీ ప్రాజెక్టు పనుల్నికూడా పెంచనున్నట్లు మేయర్‌ రామ్మోహన్‌ ఇటీవల ప్రకటించడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ పనుల వేగం పెంచారు.

ఇప్పటికే ప్రారంభించిన పనులతోపాటు కొత్త పనులపైనా ప్రతిపాదనలకు సిద్ధమవుతున్నారు.  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు మందకొడిగా సాగిన  ఎస్సార్‌డీపీ పనులపై  ప్రస్తుతం దృష్టి సారించారు.  ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌ – ఎల్‌బీనగర్‌ అటు నుంచి ఇటు,  ఇటునుంచి అటు వెళ్లేవారికి నాగోల్‌ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ చిక్కులు తగ్గించేందుకు,సిగ్నల్‌ ఫ్రీగా వెళ్లేందుకు నాగోల్‌ వద్ద ఫ్లై ఓవర్‌ పనులకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. ఈ ఫ్లై ఓవర్‌ పొడవు 980 మీటర్లు, వెడల్పు 24 మీటర్లు. ఇన్నర్‌రింగ్‌రోడ్‌లో ప్రయాణం చేసేవారికి ఎంతో సదుపాయంగా ఉండే ఈ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి వస్తే కొత్తపేట నుంచి బండ్లగూడ వైపు వెళ్లే వారికి, మన్సూరాబాద్‌తో సహ ఎల్‌బీనగర్‌ పరిసరాల్లోని వివిధ ప్రాంతాల్లోకి వెళ్లేవారికి ట్రాఫిక్‌ ఇక్కట్లు తగ్గుతాయని భావించి జీహెచ్‌ఎంసీ ఈ ఫ్లై ఓవర్‌ పనులకు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్, ఉప్పల్‌ల వైపు నుంచి కామినేని, ఎల్‌బీనగర్‌ల వైపు వెళ్లేవారికి మూసీ బ్రిడ్జి దాటాక దాదాపు 200 మీటర్ల తర్వాత ప్రారంభమయ్యే ఈ ఫ్లై ఓవర్‌ అలకాపురికి దాదాపు 500 మీటర్ల ముందుగా ముగుస్తుంది. దీంతో నాగోల్‌ జంక్షన్‌ మీదుగా పరిసరాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గుతాయి. ఈ ఫ్లై ఓవర్‌ అంచనా వ్యయం రూ.65.71 కోట్లు. ఇటీవలే ఈ ఫ్లై ఓవర్‌ పనులకు శ్రీకారం చుట్టారు. ఒకే వరుస స్తంభాలపై ఆరులేన్లుగా నిర్మించనున్న ఈ ఫ్లై ఓవర్‌ను కామినేని తరహాలో ప్రీకాస్ట్‌ పద్ధతిలో నిర్మించనున్నారు. 

హయత్‌నగర్‌ ఫ్లై ఓవర్‌ స్థానే ..
ఎస్సార్‌డీపీ రెండో ప్యాకేజీలో భాగంగా ఎల్‌బీనగర్‌ చుట్టుపక్కల సిగ్నల్‌ఫ్రీ పనుల్లో భాగంగా పలు జంక్షన్లలో పలు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లున్నాయి. కామినేని నుంచి హయత్‌నగర్‌ వరకు కూడా ఒక ఫ్లై ఓవర్‌ నిర్మించాల్సి ఉండగా,  మెట్రోరైలు రెండో దశలో  ఎదురయ్యే  ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ఆ ఫ్లై ఓవర్‌ ప్రతిపాదనను విరమించుకున్నారు. ప్యాకేజీలో భాగంగా దాని స్థానే నాగోల్‌ జంక్షన్‌ వద్ద కొత్తగా ఫ్లై ఓవర్‌ నిర్మించాలని భావించారు. అందుకు ప్రభుత్వం అనుమతించడం, ప్యాకేజీ పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్‌ ఏజెన్సీ సుముఖత వ్యక్తం చేయడంతో పనులు ప్రారంభించారు. దాదాపు ఏడాది కాలంలో ఈ ఫ్లై ఓవర్‌ పూర్తవుతుందని పనులు పర్యవేక్షిస్తున్న ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పీవీ కృష్ణారావు తెలిపారు. ఎల్‌బీనగర్‌ ఫ్లై ఓవర్‌ ఫినిషింగ్‌ పనులు మాత్రం మిగిలి ఉన్నాయిన రిపబ్లిక్‌డేనాటికి ఈ పనులు పూర్తి కాగలవన్నారు.

ఎల్‌బీనగర్‌ ఫ్లై ఓవర్‌..
ఫ్లై ఓవర్‌ పొడవు : 780 మీటర్లు
వెడల్పు : 9 మీటర్లు
అంచనా వ్యయం : రూ. 42.75 కోట్లు
ఇది అందుబాటులోకి వస్తే 90 శాతం ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమవుతుంది.
మెట్రోరైలు రాకకుముందు రద్దీ సమయంలో
వెళ్లే వాహనాలు: 14,153
మెట్రో రైలు వచ్చాక రద్దీసమయంలో
వాహనాలు:8,916
2034 నాటికి జంక్షన్‌లో రద్దీసమయంలో గంటకు  వెళ్లే వాహనాలు: 21,990

రూ. 448 కోట్లతో..  
ప్రభుత్వం దాదాపు రూ. 25వేల కోట్లతో చేపట్టిన ఎస్సార్‌డీపీ పనుల్లో ప్యాకేజీ–2లో కామినేని, ఎల్‌బీనగర్, బైరామల్‌గూడ జంక్షన్ల వద్ద నిర్మించ ప్రతిపాదించిన ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల అంచనా వ్యయం మొత్తం రూ. 448 కోట్లు. వీటిల్లో చింతల్‌కుండ అండర్‌పాస్, కామినేని ఎడమవైపు ఫ్లై ఓవర్‌ వినియోగంలోకి రావడం తెలిసిందే. ఈనెలలో ప్రారంభానికి అవకాశమున్న ఎల్‌బీనగర్‌ ఫ్లై ఓవర్‌తోపాటు కూకట్‌పల్లి రాజీవ్‌గాంధీ జంక్షన్‌ దగ్గరి ఫ్లై ఓవర్‌ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement