
'వీరికి కేడర్ లేదు.. వారికి నాయకులు లేరు'
⇒ మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం: హోంమంత్రి నాయిని
హైదరాబాద్: తమ పార్టీ టీఆర్ఎస్ తరఫున ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఎన్నికైనందుకు సంతోషంగా ఉందని, తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎలిమినేటి క్రిష్ణారెడ్డి ,గంగాధర్ గౌడ్లతో కలిసి ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం చరిత్రాత్మకమని కొనియాడారు. గత అరవై ఏళ్లలో సాధించని అభివృద్ధిని తమ పాలనలో సాధిస్తున్నామన్నారు. ఒక పార్టీకి కేడర్ లేదు.. ఇంకో పార్టీకి నాయకులు లేరని వ్యంగ్యంగా అన్నారు.
శాసన సభలో విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలకు ధీటుగా బదులిస్తామని, టీఆర్‌ఎస్ పటిష్టంగా ఉందని, తమ బలం సర్వేలో ప్రతిబింబించిందని పేర్కొన్నారు. ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే 106 సీట్లు వస్తాయని సర్వే ఫలితాలు చెబుతున్నాయని గుర్తుచేశారు. తమను గుర్తించి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్‌గౌడ్‌లు ధన్యవాదాలు తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో తమవంతు కృషి చేస్తామన్నారు.