‘ఎన్టీఆర్‌నే చావగొట్టినోడు..మనకేం చేస్తాడు?’
‘ఎన్టీఆర్‌నే చావగొట్టినోడు..మనకేం చేస్తాడు?’
Published Sat, May 27 2017 7:30 PM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM
హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌నే చావగొట్టినోడు మనకేం చేస్తాడు, మామను చంపి మంత్రి అయినోడు ఎలా చేస్తాడు..' అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్ధేశించి రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలు చేశారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమానికి ఓ చరిత్ర ఉందని, ఆ చరిత్ర ఆధారంగానే ఇప్పుడు తెలంగాణ వచ్చిందని, లేకుంటే వచ్చేది కాదన్నారు. తెలంగాణ వాదులు ముందు నుంచీ మోసపోతూనే ఉన్నారని, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఆంధ్రాకు చెందిన వారు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారనే విషయంపై ముగ్గురు ఐఏఎస్‌లతో కమిటీని వేయగా, ఏపీకీ చెందిన వారు 85వేల మంది ఇక్కడ చేస్తున్నారని.. అందుకే ఇక్కడ వారికి ఉద్యోగాలు దక్కట్లేదని కమిటీ రిపోర్టు ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్ ఆ ఉద్యోగాలన్నీ ఇక్కడ వారికే వర్తించేలా 610 జీఓను ప్రవేశపెట్టారు. ఆ తరువాత బాబు ముఖ్యమంత్రి అవ్వడం, ఎన్టీఆర్ మరణించడం అన్నీ జరిగిపోయాయి.. కానీ జీఓ మాత్రం అమలు కాలేదు. అప్పుడు చంద్రబాబు వంతు వచ్చింది ఎన్టీఆర్‌నే చావగొట్టినోడు ఇంకా మనకేం చేస్తాడులే అని ఆ రోజుల్లోనే అనుకున్నామని.. ‘1969 జై తెలంగాణ విద్యార్థి నేతల ఉద్యమ చరిత్ర’ పుస్తకావిష్కరణ సభలో నాయిని గుర్తు చేశారు.
శనివారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో జరిగిన ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన నాయిని మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పొయారన్నారు. మొక్కవోని దీక్షతో కేసీఆర్ ఉద్యమ ఫలితమే తెలంగాణ వచ్చిందన్నారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని అప్పుడు కాంగ్రెస్ పెద్దలకు నేరుగా చెప్పానన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎస్.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement