
నళినీ.. ఓ నళినీ!
పోరుబిడ్డ ఎక్కడ?
నాడు ఉద్యమం కోసం సర్వం త్యాగం
డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా
నేడు.. ఎక్కడా కానరాని వైనం
తెలంగాణ మలిపోరులో ఉధృతంగా ఉద్యమించిన ఆడపడుచు.. ఉద్యమకారులకు అండగా నిలబడాలనే ఉద్వేగం.. తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేస్తున్న అక్కాతమ్ముళ్లపై లాఠీ ఝుళిపించలేను.. అని స్పష్టం చేసిన వీర వనిత.. ఆమెనే పోలీసు నళిని. ‘నా రాష్ట్రం వచ్చాకే నేను ఉద్యోగం చేస్తా’ అని ప్రతిజ్ఞ చేసి డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి కేంద్రానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలంగా చాటారు. తీరా తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఆమె కనిపించకుండాపోయారు.
సంగారెడ్డి: అది తెలంగాణ మలిపోరు ఎగసిపడుతున్న సమయం. ఉద్యమాన్ని ఆపేందుకు అప్పటి పాలకులు పోలీసులను ప్రయోగించారు. మెదక్ డీఎస్పీగా నళిని కొనసాగుతున్నారు. ఉద్యమకారులపై జరుగుతున్న దౌర్జన్యాలకు ఆందోళన చెంది నేరుగా హైదరాబాద్‌కు చేరుకుని 2009 డిసెంబర్ 7న తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ‘ఈ గడ్డపై పుట్టిన నేను ఉద్యమకారులను అణచివేసి తెలంగాణ తల్లికి ద్రోహం చేయలేను. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా’ అని ప్రకటించారు. ఇది అప్పట్లో సంచలనం రేపింది. ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, సబ్బండ జాతులు ఊరూరా ఆమె త్యాగానికి జై కొట్టారు. డిసెంబర్ 9న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అధికారిక ప్రకటన చేసిన తరువాత.. ఆమె తిరిగి డీఎస్పీగా ఉద్యోగంలో చేరారు. ఏళ్లు గడుస్తున్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయకపోవటాన్ని నిరసిస్తూ, రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ 22 పేజీలతో సోనియాగాంధీకి, 9 పేజీలతో కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాసి 2012 నవంబర్1న మరోమారు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఎంతో ఇష్టపడి పోలీస్ శాఖలో చేరి..
పోలీస్ ఉద్యోగం చేయాలన్న తన చిన్ననాటి కోరిక.. ఈ మేరకు 16 జులై 2009లో ట్రైనింగ్ పూర్తిచేసుకుని ఫస్టు పోస్టింగ్ మెదక్ డీఎస్పీగా వచ్చారు. ఎంతో ఇష్టపడి ఎంచుకున్న తన కెరీర్‌ను కేవలం 5 నెలల్లోనే వదిలి వెళ్లిపోయారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన దీక్ష చేపట్టారు. ఆమె చేపట్టిన దీక్షకు అప్పటి ఎంపీలంతా హాజరై సంఘీభావం తెలిపారు. అనంతరం వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ నుంచి ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ‘ఉప ఎన్నికల్లో గెలుపు లక్ష్యం కాదు, తెలంగాణ వాదాన్ని బతికించుకునేందుకే పోటీలో నిలబడ్డాను’అని ఆమె అప్పట్లో చెప్పారు.
ప్రభుత్వమే శ్రద్ధచూపాలి..
ప్రత్యేక రాష్ట్రం కోసం తనెంతో ఇష్టంగా ఎంచుకున్న కెరీర్‌ను సైతం త్యజించింది. ఆమెను ఎంతో మంది ఆదర్శంగా తీసుకున్న తెలంగాణ వాదులు ఉద్యమానికి ఊపిరి పోశారు. అలాంటి వ్యక్తి మన ప్రత్యేక రాష్ట్రంలో పోలీస్ ఉన్నత స్థానంలో కొనసాగితే ఎంతో గర్వంగా ఉంటుందని పలువురు అంటున్నారు. మెతుకుసీమ ముద్దుబిడ్డే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కనుక, ఈ గడ్డ మీద త్యాగం చేసిన ఆడబిడ్డను సగౌరవంగా సత్కరించాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
నెల రోజులు ప్రయత్నించినా.. నళిని అభిప్రాయాన్ని ప్రచురించేందుకు ఆమె వివరణ కోసం ‘సాక్షి’ నెల పాటు ప్రయత్నం చేసింది. ఆమె సెల్ నంబర్ తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరకు ఫేస్‌బుక్ ద్వారా నళిని అడ్రస్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.