చెంచుల మెడపై తనిఖీల కత్తి!
► సొంతింటికీ వెళ్లాలంటేఅనుమతి తప్పనిసరి !
► బయటికి వెళ్లాలన్నా..రావాలన్నా చెప్పి వెళ్లాల్సిందే
► నల్లమలలో అడవిబిడ్డలను అడ్డుకుంటున్న అధికారులు
వారు సొంతింటికీ వెళ్లాలంటే చెక్‌పోస్టుల వద్ద రిజిస్టర్‌లో తమపేర్లు నమోదు చేసుకోవాల్సిందే..! మందు బిళ్ల, సబ్బు బిళ్ల, అగ్గిపుల్ల ఏది కావాలన్నా అధికారులకు చెప్పి వెళ్లాల్సిందే..! అడవినుంచి బయటికిపోతే ఎక్కడికి వెళ్తున్నారో... ఎప్పుడు వస్తారోననే విషయాలూ చెప్పాల్సిందే..! జిల్లాలోని నల్లమల లోతట్టు అటవీప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు కొన్నిరోజులుగా అమలుచేస్తున్న నిబంధనలివి..
మన్ననూర్: వందల ఏళ్లుగా ఇక్కడే పుట్టిపెరిగిన చెంచుబిడ్డలకు కొత్త ఆపదవచ్చి పడింది. నల్లమల లోతట్టు ప్రాంతం అటవీ సరిహద్దు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న సుమారు 12పెంటల చెంచులు మైదానప్రాంతాలకు పోవాలన్నా.. అక్కడినుంచి రావాలన్నా అటవీశాఖ అధికారుల అనుమతి తప్పనిసరి అనే నిబంధనలు విధించారు. వారిని తనిఖీచేసేందుకు మన్ననూర్ ముఖ్యకూడలి, దుర్వాసుల చెరువు ఫర్హాబాద్ వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. చెంచులు ఎక్కడికి వెళ్తున్నారు.. ఎందుకు వెళ్తున్నారు.. ఎప్పుడు వస్తారు..? తదితర అంశాలను నమోదుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక చెక్‌పోస్టు వద్ద చెంచుగిరిజనులు, ఫారెస్ట్ అధికారులకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది.
ఈ క్రమంలో వారంరోజుల క్రితం చెంచుపెంటలలోని బాలబడులకు ఆటోలో పౌష్టికాహారం తీసుకువెళ్తుండగా ఫారెస్ట్ అధికారులు అడ్డగించారు. ఈ ఘటనను నిరసిస్తూ డీఎఫ్‌ఓ వినయ్‌కుమార్ సమక్షంలోనే మల్లాపూర్, పుల్లాయిపల్లి, అప్పాపూర్, రాంపూర్, భౌరాపూర్, సంగిడిగుండాలు, మేడిమల్కల, పందిబొర్రె, ఈర్లపెంట తదితర పెంటల చెంచులు మన్ననూర్ చెక్‌పోస్టు వద్ద గంటపాటు ఆందోళనకు దిగారు.
తరచూ అడ్డంకులు
హైదరాబాద్- శ్రీశైలం ప్రధాన రహదారికి అటవీలోతట్టులో 12కిలో మీటర్ల దూరం ఉన్న పుల్లాయిపల్లిలో ఆరు కుటుంబాల్లో 20మంది నివాసం ఉన్నారు. 18కి.మీ దూరంలో ఉన్న రాంపూర్‌పెంటలో 16 కుటుంబాల్లో 60మంది ఉన్నారు. 16 కి.మీ దూరంలో ఉన్న అప్పాపూర్‌లో సుమారు 34 కుటుంబాల్లో 150మంది నివాసం ఉంటున్నారు. 22కి.మీ దూరంలో ఉన్న బౌరాపూర్ చెంచుపెంటలో 15 కుటుంబాల్లో 60మంది ఉంటున్నారు.
28కి.మీ ఉన్న మేడిమల్కల పెంటలో 8 కుటుంబాలు ఉన్నాయి. 34కి.మీ ఉన్న సంగిడిగుండాలలో 14 కుటుంబాలు ఉండగా 30మంది జనాభా ఉంది. 31కి.మీ దూరంలో ఉన్న ఈర్లపెంటలో 40కుటుంబాలు ఉన్నాయి. 33కి.మీ దూరంలో ఉన్న పందిబొర్రె పెంటలో 20మంది నివాసం ఉంటున్నారు. ఆరు కి.మీ దూరంలో ఉన్న మల్లాపూర్‌లో 70మంది నివాసం ఉంటున్నారు. ఇదిలాఉండగా, శ్రీశైలం- నాగార్జునసాగర్ పులుల రక్షణప్రాంతంగా పిలిచే ఈ ప్రాంతాన్ని రెండేళ్లుగా అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంగా మార్చారు. ఇక్కడే చెంచులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. పెంటల్లోని తమ ఇంటికి వెళ్తున్న తరచూ అడ్డుకుంటున్నారని, తాత్కాలిక ఉద్యోగాల ఎరచూపి చెంచుల ఐక్యతను దెబ్బతీస్తున్నారని స్థానిక అడవిబిడ్డలు ఆరోపిస్తున్నారు.
అడవికి దూరం చేసేందుకేనా..?
నల్లమలను పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించిన నేపథ్యంలో చెంచు గిరిజనులను మైదాన ప్రాంతాలకు తరలించాలని కొన్ని ఏళ్లుగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే కొందరు చెంచులను రెండేళ్లక్రితం కర్ణాటక సరిహద్దు, కొల్లాపూర్, పరిగి, శంషాబాద్ తదితరులు ప్రాంతాలకు తిప్పి చూపించారు. ఇక్కడ నివాసాలను ఏర్పాటుచేసి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అటవీప్రాంతాన్ని విడిచివెళ్తే కుటుంబానికి రూ.10లక్షలు కూడా ఇస్తామని అధికారులు వారిని సన్నద్ధం చేసేందుకు యత్నిస్తున్నారు. గతంలో కొందరు చెంచులను గ్రూపులుగా చేసి ఆయా ప్రాంతాలను చూపించారు.
కానీ వారిలో కొందరు సమ్మతించగా.. ఎక్కువ మంది అంగీకరించలేదు. దీంతో చెంచుల తరలింపు ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడుతున్నారు. ఈ క్రమంలోనే నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తే అటవీప్రాంతం నుంచి బయటికి పోతారనే.. అధికారులు వేధిస్తున్నారని స్థానిక చెంచులు ఆరోపిస్తున్నారు.