సాక్షి, విజయవాడ : కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో చెక్‌పోస్టుల వద్ద పరిస్థితిని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించినట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని జిల్లాల ఎస్పీలు, డీఎస్పీల ద్వారా అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే పంపిస్తున్నట్లు వెల్లడించారు. కాగా పోలీస్ సిబ్బంది షిప్ట్ ల వారీగా 24 గంటలు పని చేస్తున్నారని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అనేక చర్యలు తీసుకుంటున్నామని, విదేశాల నుంచి వచ్చినవారి వల్లే తొలుత ఏపీలో వైరస్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. (కావాలని కరోనా అంటించుకున్న జర్మనీ మేయర్)
ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ సమావేశంలో రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొనడం ద్వారా ఊహించని విధంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయన్నారు. ఏపీ నుంచి 1085 మంది ఢిల్లీ సమావేశంలో పాల్గొన్నట్లు అధికారికంగా తేలింది.. కానీ ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నామన్నారు. మర్కజ్‌లో పాల్గొన్న వారంతా స్వచ్ఛందంగా క్వారంటైన్కు రావాలని తాము కోరుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే జాబితా ఆధారంగా చాలా మందిని ఆస్పత్రికి తరలించాం. సీఎం వైఎస్ జగన్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు.
'ఆలస్యం అయ్యే కొద్దీ ప్రాణాలు కోల్పొతారు.. ముందే మేల్కొని ఆస్పత్రికి రావాలి..ఇప్పటికే పది రోజులు లాక్‌డౌన్ పాటించారు.. మరో పది రోజులు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. కొత్త చాలెంజ్ ను ఎదుర్కొనేందుకు డాక్టర్ లు, నర్సులు, పోలీసులు, చాలా శ్రమ పడుతున్నారు.. మీ కోసం వారంతా త్యాగం చేస్తున్నారు.. మీరు ఇళ్లు వదలి రాకండి' అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా కేసుల విషయంలో అసత్యాలను ప్రచారం చేస్తే శిక్షలు తప్పవని, ముఖ్యంగా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment