బంగారం తాకట్టుపెట్టి.. | Nampally Exhibition Victims Protest in front Of Exhibition Society | Sakshi
Sakshi News home page

బంగారం తాకట్టుపెట్టి..

Published Fri, Feb 1 2019 11:36 AM | Last Updated on Fri, Feb 1 2019 11:36 AM

Nampally Exhibition Victims Protest in front Of Exhibition Society - Sakshi

అగ్ని ప్రమాదంలో కాలిపోయిన నగదు, స్వైపింగ్‌ మిషన్‌ చూపుతూ కన్నీటి పర్యంతమవుతున్న బాధితులు

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లోని నుమాయిష్‌లో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం మిస్టరీ 24 గంటలు గడిచినావీడలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులుఅన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బుధ, గురువారాల్లో సహాయక చర్యలు, ఆందోళనల నేపథ్యంలో పూర్తి స్థాయిలో పరిశోధన సాధ్యం కాలేదని తెలిసింది. శుక్రవారం నుంచి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాలురంగంలోకి దిగనున్నాయి. గురువారం ప్రమాదస్థలిని వివిధ విభాగాలకు చెందిన పోలీసులతో పాటు ఫోరెన్సిక్‌ నిపుణులు పరిశీలించారు. ప్రాథమికంగా సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను అధ్యయనం చేస్తున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: నుమాయిష్‌లో బుధవారం రాత్రి చోటు చేసుకున్న ప్రమాదంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రాథమికంగా సేకరించిన వివరాల ప్రకారం ప్రమాదానికి విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణమని  భావిస్తున్నారు. తొలుత ఓ ఏటీఎం సెంటర్‌/బ్యాంకులోని ఏసీలో వచ్చిన షార్ట్‌సర్క్యూట్‌తో చెలగేగిన మంటలు వ్యాపించాయనే వాదన వినిపిస్తోంది. ఆపై నుమాయిష్‌లో ఉన్న మహేష్‌ కో– ఆపరేటివ్‌ బ్యాంకు ప్రాంగణంలో ఈ మంటలు మొదలైనట్లు భావిస్తున్నారు. అక్కడ పని చేయని విద్యుత్‌ బల్బును మార్చడానికి ఓ వ్యక్తి ప్రయత్నించారని, ఆ నేపథ్యంలో షార్ట్‌సర్క్యూట్‌ జరిగి చెలరేగిన నిప్పు రవ్వలు ఎగిరి పడ్డాయని కొందరు పేర్కొంటున్నారు.

ఈ స్పార్క్స్‌ సమీపంలో ఉన్న ఫ్లెక్సీపై పడటంతో చెలరేగిన మంటలు అతి తక్కువ సమయంలోనే ఈ బ్యాంకునకు అటు ఇటు ఉన్న ఆంధ్రాబ్యాంక్, వస్త్ర దుకాణాలకు వ్యా పించాయని కొందరు పేర్కొన్నారు. ఈ మూడింటిలోనూ ఎక్కడా ఫైర్‌ ఎగ్ట్సింగ్విషర్స్, ఇసుక బకెట్లు సహా  ఇతర అగ్ని నిరోధక పరికరాలు లేకపోవడంతో పక్కనే ఉన్న దుకాణాలకు వ్యాపించాయని కొందరు పోలీసులకు తెలిపారు. ఈ రెండు కారణాలతో పాటు సిగిరెట్‌ వ్యవహారమూ బయటకు వచ్చింది. మహేష్‌ బ్యాంకు వద్ద ఉన్న ఏటీఎం సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి సిగరెట్‌ కాల్చి పడేశాడని, అదే ప్రమాదానికి కారణమైందని మరికొందరు పోలీసులకు చెబుతున్నారు. సాక్షులు, బాధితుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్న అధికారులు ఈ మూడింటితో పాటు వివిధ కోణాలను పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేస్తున్నారు. కాలిపోయిన దుకాణాలకు సంబంధించిన శకలాలు పూర్తిగా తొలగిస్తే ఫోరెన్సిక్‌ నిపుణులు పరిశోధన జరిపి అసలు మూలాలు గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొనడం గమనార్హం.  

ఎగ్జిబిషన్‌ సొసైటీ ఎదుట ఆందోళన
నాంపల్లి: నుమాయిష్‌ అగ్ని ప్రమాదంలో స్టాల్స్‌ను కోల్పోయిన నిర్వాహకులు భారీగా నష్టపోయారు. ఒక్కోక్కరికి సుమారు రూ.10లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.ఉత్పత్తులన్నీ బుగ్గిపాలు కావడంతో  బాధితులు గురువారం ఎగ్జిబిషన్‌ సొసైటీ వద్ద ఆందోళనకు దిగారు. తమకు నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకు దిగిన బాధితులతో ఎగ్జిభిషన్‌ సొసైటీ ప్రతినిధులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఎలాంటి భయాందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇవ్వడంతో  బాధితులు ఆందోళన విరమించారు.  నష్టపోయిన బాధితులకు ఎగ్జిభిషన్‌ సొసైటీ చెక్కుల రూపంలో నష్టపరిహారాన్ని చెల్లించనుంది. ఇప్పటికే బాధితుల వివరాలను సేకరించారు. అగ్ని ప్రమాదంలో వాటిల్లిన నష్టాన్ని అంచనా వేశారు.

మెట్రో ఆపన్నహస్తం
సాక్షి, సిటీబ్యూరో: నుమాయిష్‌ అగ్నిప్రమాద బాధితులకు మెట్రో ఆపన్నహస్తం అందించింది.  నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో ఇక్కడి వనితా మహిళా విద్యాలయ, కమలా నెహ్రూ పాలిటెక్నిక్‌ కళాశాలల వసతి గృహాల్లోని విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా మెట్రో స్టేషన్‌కు తరలించి తాత్కాలిక వసతి కల్పించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు అదుపులోకి రావడం, విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించడంతో విద్యార్థినులు సురక్షితంగా వసతి గృహాలకు వెళ్లినట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఉచితంగా మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు ఎల్‌అండ్‌టీమెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తక్షణం అనుమతులు జారీచేయడం పట్ల ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.  

ఆరని మంటలు..
నాంపల్లి: నుమాయిష్‌) జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో కళాకారుల ఉత్పత్తులు పూర్తిగా కాలిపోయాయి. బుధవారం అర్థరాత్రి దాటాక అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అయితే స్టాళ్లలో మిగిలిన ఉత్పత్తులు గురువారం సాయంత్రం వరకు మండుతూనే ఉన్నాయి. ఉత్పత్తులకు అంటుకున్న మంటలను పూర్తిగా ఆర్పివేయకుండా వదిలిపెట్టారు. ఇలా రగులుతున్న అగ్గిరవ్వలు గాలికి ఎగిరి సమీపంలో ఉండే ఇతర దుకాణాలపై పడితే మళ్లీ అగ్ని ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు.   

నష్టపోయిన వ్యాపారులకు పరిహారం చెల్లించాలి
సాక్షి, సిటీబ్యూరో:  భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌)లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లించాలని టెక్‌– టీప్‌ డైరెక్టర్‌ బందగి రియాజ్‌ ఖాద్రీ  గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.  దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి వస్తువులను విక్రయించుకునే వ్యాపారులు భారీగా నష్టపోయారని అన్నారు. రూ.70 కోట్ల వరకు నష్టం వాటిల్లిందన్నారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ  నిర్లక్ష్యం వల్లే నుమాయిష్‌లో భారీగా ఆస్తి నష్టం సంభవించిందని ఆరోపించారు. ఎగ్జిబిషన్‌ నిర్వాహకులు పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టడంలో విఫలమయాయరన్నారు.     

బాధిత కశ్మీరీలను ఆదుకోండికేటీఆర్‌కు ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌
సాక్షి, సిటీబ్యూరో:నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కశ్మీర్‌కు చెందిన డ్రైఫ్రూట్స్‌ స్టాళ్లు ఆహుతి అయ్యాయి. దీంతో కశ్మీర్‌ మాజీ ముఖ్యమంతి ఒమర్‌ అబ్దుల్లా గురువారం కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. ప్రమాదంలో సర్వం కోల్పోయిన కశ్మీరీ బాధితులను ఆదుకోవాలని ఆయన కోరారు.    

బంగారం తాకట్టుపెట్టి..
నుమాయిష్‌లో స్టాల్‌ పెట్టుకుని వ్యాపారం చేసేందుకు బంగారం తాకట్టు పెట్టి మరీ డబ్బులు తెచ్చా. కాలిపోయిన స్టాల్‌లో రూ.5 లక్షల మేర సరుకుంది. చీరలు, గాగ్రా వంటి ఉత్పత్తులను తీసుకువచ్చా. ఇప్పుడు సరుకు మొత్తం అగ్నికి ఆహుతైపోయింది. మా కుటుంబం రోడ్డున పడింది.మమ్మల్ని ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం.         – హారతి, గుజరాత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement