- కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హామీ
- నవోదయ ఉద్యోగుల జాతీయ మహాసభలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: నవోదయ విద్యాలయ ఉద్యోగుల సమస్యలను సంబంధిత మంత్రిత్వ శాఖతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న నవోదయ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిలభారత నవోదయ విద్యాలయ ఉద్యోగుల సమాఖ్య 6వ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ మాట్లాడుతూ నవోదయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. వారం రోజుల్లో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి వద్దకు నవోదయ ఉద్యోగ సంఘం ప్రతినిధులను తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాజేంద్రన్, నవోదయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జగదీశ్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.