సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో క్యాబ్ సర్వీసులు స్తంభించాయి. ఐటీ కారిడార్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తదితర ప్రధాన మార్గాలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో రాకపోకలు సాగించే సుమారు 60 వేల ఓలా, ఉబర్ క్యాబ్ సర్వీసులు సోమవారం ఒక రోజు స్వచ్ఛంద బంద్ పాటించాయి. ఫైనాన్షియర్ల వేధింపుల వల్ల ఇటీవల పలువురు డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడటం, ఓలా, ఉబర్ సంస్థల వైఖరి, ఈ రంగంలో పెరిగిన పోటీ వల్ల సరైన ఉపాధి లభించకపోవడం వంటి కారణాలతో వేలాది మంది డ్రైవర్లు ఆందోళనకు దిగారు.
సికింద్రాబాద్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, శంషాబాద్ విమానాశ్రయంలో ధర్నాకు దిగారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 11వ తేదీ వరకూ క్యాబ్ డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు, నిరవధికంగా క్యాబ్‌ల నిలిపివేతతో నిరసన చేపట్టారు. అయినా క్యాబ్ డ్రైవర్ల సమస్యలకు పరిష్కారం లభించలేదు. గడిచిన 2 నెలల్లో నలుగురు డ్రైవర్లు అప్పుల బాధతో చనిపోయారు. ఈ నేపథ్యంలో ‘ఓలా, ఉబర్ హఠావో, క్యాబ్ డ్రైవర్ బచావో’ నినాదంతో క్యాబ్ డ్రైవర్లు మళ్లీ ఆందోళన బాట పట్టారు.
భరోసా లేని ఉపాధి..
నగరంలో నాలుగేళ్ల క్రితం ఓలా, ఉబర్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. డ్రైవర్లకు మొదట్లో భారీగా ఆదాయం లభించింది. ప్రోత్సాహకాలు, కమిషన్లు తదితర రూపాల్లో నెలకు రూ.60 వేలకుపైగా ఆర్జించారు. అప్పట్లో ఉబర్‌లో 10 వేల వాహనాలు, ఓలాలో మరో 5 వేల వాహనాలు ఉండేవి. గత రెండేళ్లలో వాహనాల సంఖ్య సుమారు 1.5 లక్షలకు చేరింది. ఓలా, ఉబర్ క్రమంగా కమీషన్లు, రాయితీలు, ప్రోత్సాహకాల్లో కోత విధించాయి. ఏడాది క్రితం నెలకు కనీసం రూ.40 వేలు సంపాదించిన డ్రైవర్లు.. ఇప్పుడు రూ.25 వేలు కూడా సంపాదించలేకపోతున్నట్లు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఆందోళన వ్యక్తం చేశారు.
లీజు వాహనాలతో చిక్కులు..
ఓలా, ఉబర్ సంస్థలు స్వయంగా కొన్ని వాహనాలను లీజుకు తీసుకున్నాయి. ఇలా భారీ సంఖ్యలో వాహనాలు వచ్చి చేరడంతో తమ ఉపాధికి విఘాతం కలిగిందనేది డ్రైవర్ల మరో ఆరోపణ. ‘లీజు వాహనాలు తమ సంస్థకు చెందినవి కావడంతో ప్రోత్సాహకాలు, ట్రిప్పులు వాటికి ఎక్కువగా ఇచ్చి, మాకు తక్కువగా ఇస్తున్నారు. దీంతో టార్గెట్లు పూర్తి చేయలేకపోతున్నాయి’ అని డ్రైవర్ మహేందర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇవీ డిమాండ్‌లు..
- ఓలా, ఉబర్ సంస్థల స్థానంలో డ్రైవర్ల అసోసియేషన్‌ను గుర్తించి వారే స్వయంగా నిర్వహించుకునేలా ఒక యాప్‌ను రూపొందించి ఇవ్వాలి.
- అంతర్జాతీయ క్యాబ్ సంస్థలు ప్రభుత్వానికి 5% కమీషన్ చెల్లిస్తుండగా తాము 10% చెల్లించేందుకు అను మతివ్వాలి.
- ఫైనాన్షియర్ల వేధింపుల నుంచి విముక్తి కల్పించాలి.
- ఆత్మహత్యలకు పాల్పడిన డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలి.
ప్రభుత్వమే పరిష్కరించాలి
ఏడాది నుంచి మేము ఇదే డిమాండ్‌పై ఆందోళన చేస్తున్నాం. ప్రైవేట్ దోపిడీ సంస్థల స్థానంలో డ్రైవర్‌లకే యాప్‌ను అప్పగించాలి. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించకుండా అక్రమ కేసులతో వేధిస్తోంది.
– శివ, అధ్యక్షుడు, రాష్ట్ర క్యాబ్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్
భద్రత కల్పించాలి
క్యాబ్ డ్రైవర్లకు భద్రత లేకుండా పో యింది. క్యాబ్ సంస్థలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. పోలీసుల వేధింపులు కూడా భరించలేకపోతున్నాం. ఇది అన్యాయం. డ్రైవర్లకు భద్రత కల్పించాలి.
– సిద్ధార్థగౌడ్, క్యాబ్ డ్రైవర్
ఫైనాన్షియర్ల వేధింపులతో ఆజ్యం
ఇటీవల డ్రైవర్లపై ఫైనాన్షియర్ల వేధింపులు పెరిగాయి. నెల నెలా వాయిదాలు చెల్లించకపోవడంతో సదరు సంస్థలు వాహనాలను జప్తు చేస్తున్నాయి. ఒక్క నెల బాకీ ఉన్నా వాహనాలను తీసుకెళ్తున్నారని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమకు భద్రత కల్పించడంతో పాటు, ఉపాధికి భరోసా లభించేలా ప్రభుత్వమే ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్‌ను రూపొందించి ఇవ్వాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment