
యూరియాకు వేపపూత
♦ పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట
♦ ఏటా రూ. 3 వేల కోట్ల యూరియా సబ్సిడీ పక్కదారి
♦ పాల కల్తీ మొదలుకుని పారిశ్రామిక అవసరాలకు
♦ ఇకపై వ్యవసాయంలో వేప పూత యూరియా
♦ ఏటా రూ. 6,500 కోట్ల మేర ఆదా అయ్యే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ‘గతంలో మాదిరిగా యూరియా అక్రమంగా రసాయన కర్మాగారాలకు దారి మళ్లకుండా వేప పూత వేస్తున్నాం.. ఇన్నాళ్లూ యూరియాను లూటీ చేసిన కెమికల్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు నాపై ఆగ్రహంతో.. ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కుట్ర చేస్తున్నారు.’.. ప్రధాని నరేంద్ర మోదీ.
ప్రధాని మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో.. దేశంలో వేప పూత యూరియా వినియోగం చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లూ రైతులకు సబ్సిడీపై సరఫరా చేస్తున్న యూరియాను పాల కల్తీ మొదలుకుని.. పారిశ్రామిక అవసరాల వరకు పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో భూ సారాన్ని కాపాడుతూ దిగుబడులు పెంచే లక్ష్యంతో.. వ్యవసాయ అవసరాలకు వేప పూత ఉన్న యూరియా (ఎన్‌సీయూ) సరఫరాను గత ఏడాది నవంబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. తద్వారా అక్రమ వ్యాపారాలకు యూరియాను ముడి సరుకుగా వినియోగిస్తున్న అక్రమార్కులకు కళ్లెం వేయొచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో ఏటా 22 మిలియన్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుండగా.. మరో 8 నుంచి 9 మిలియన్ టన్నుల యూరియా విదేశాల నుంచి దిగుమతి అవుతోంది.
ప్రస్తుతం మెట్రిక్ టన్ను యూరియా ధర రూ. 5,360 కాగా.. సగం ధరకే యూరియాను సబ్సిడీపై రైతులకు సరఫరా చేస్తోంది. యూరియాను ముడి సరుకుగా వినియోగించుకుని 55 రకాలైన ఇతరత్రా రసాయన ఉత్పత్తులను తయారు చేసే వీలుంది. దీనిని ఆసరాగా చేసుకుని.. పారిశ్రామిక అవసరాలకు యూరియా తయారీ కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేయాల్సిన రసాయన కంపెనీలు సబ్సిడీ యూరియాను పక్కదారి పట్టిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఏటా సుమారు 50 లక్షల టన్నుల యూరియా పక్కదారి పడుతుండగా.. రూ. 3 వేల కోట్ల సబ్సి డీ సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది.
వేప పూత యూరియాతో అడ్డుకట్ట
సబ్సిడీ యూరియా సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వేపపూత యూరియా (ఎన్‌సీయూ) వినియోగాన్ని తెరమీదకు తెస్తూ.. గత ఏడాది నూతన యూరి యా విధానాన్ని ప్రకటించింది. దేశంలో 26 ఎరువుల కంపెనీలు ఎన్‌సీయూను తయారు చేస్తుండగా.. ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యంలో 100 శాతం వేప పూత యూరియా తయారీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతం లో కేవలం 35 శాతం ఎన్‌సీయూ తయారీకి అనుమతి వుండగా ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యంలో కనీ సం 75 శాతం ఎన్‌సీయూ తయారీని తప్పనిసరి చేసింది.
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియాకు కూడా వేప పూతను తప్పనిసరి చేసింది. వ్యవసాయ అవసరాలకు 2015 నవంబర్ నుంచి వేపపూత యూరి యాను నూటికి నూరు శాతం తప్పనిసరి చేసింది. సాధారణ యూరియా ఎంఆర్‌పీ ధరపై అదనంగా ఐదు శాతం ధరలకు అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో రైతులకు సగటున ఒక్కో బస్తాపై పది రూపాయల అదనపు భారం పడనుంది. ఎన్‌సీయూ వినియోగం ద్వారా సాధారణ యూరియా 10 నుంచి 15 శాతం మేర తగ్గినట్లు కేంద్ర వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. వేప పూత యూరియా ద్వారా రైతులకు రాబడి పెరగడంతోపాటు, రూ. 6,500 కోట్ల మేర సబ్సిడీ భారం తగ్గుతుందని కేంద్రం లెక్కలు వేస్తోంది. తద్వారా విదేశీ మారక ద్రవ్యం కూడా ఆదా కానుంది.
పెరుగుతున్న ఎన్‌సీయూ ఉత్పత్తి
వేప పూత యూరియా ఉత్పత్తి విధానాన్ని ప్రవేశ పెట్టిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఏటా తన ఉత్పత్తిని పెంచుతూ వస్తోంది. యూరియా గుళికలకు ఎంత మోతాదులో వేప నూనెతో పూత వేయాలో ఈ సంస్థ ప్రమాణాలను రూపొందించింది.