సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో యూరియా కొరత తీవ్రమైంది. రవాణాల్లో జాప్యం ఒకవైపు.. వ్యాపారుల కృత్రిమ కొరత మరోవైపు.. వెరసి యూరియా నిల్వలు అందుబాటులో లేక రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రైవేటు ఏజెన్సీల వద్ద, ఎరువులు పంపిణీ చేస్తున్న సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రెండు బస్తాల యూరియా కోసం పనులన్నీ మానుకుని రోజంతా వరుసలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లోనూ ఇలాంటి దుస్థితే నెలకొంది. వచ్చిన అరకొర ఎరువులు ఏమాత్రం సరిపోకపోవడంతో అన్నదాతలు ఏకంగా రోడ్డెక్కాల్సి వస్తోంది.
అధిక ధరకు విక్రయాలు..
జిల్లా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 6.40 లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటివరకు సుమారు 4.79 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగుచేశారు. ప్రధానంగా పత్తి, సోయా, వరి పంటలు ఎక్కువగా సాగు చేశారు. అత్యధికంగా పత్తి 3.10 లక్షల హెక్టార్లలో సాైగైంది. పత్తి సాగు చేస్తున్న రైతులు ప్రతి 20 రోజులకోసారి యూరియా వేస్తుంటారు. వారం రోజులుగా అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తుండటంతో యూరియా వేసేందుకు రైతులు ఉపక్రమించారు. దీంతో యూరియాకు డిమాండ్ పెరిగింది.
ఈ మేరకు సహకార సంఘాల వద్ద యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులు తమ వద్ద ఉన్న యూరియా నిల్వలను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రైతుల అవసరాలను ఆసరగా చేసుకుని ఒక్కో బస్తాపై అదనంగా రూ.100 వరకు పెంచి అమ్ముతున్నారని విమర్శలున్నాయి. ఇదేమని ప్రశ్నించిన రైతులకు అసలు స్టాకే అందుబాటులో లేదని సమాధానమిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో అన్నదాతలు అధిక ధరలు చెల్లించక తప్పడం లేదు.
సరఫరాలో జాప్యం..
ఈ ఖరీఫ్ సీజన్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాకు 1.26 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో జూలై నెలాఖరు నాటికి 54,989 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. కానీ.. కేవలం 45 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. అంటే యూరియా డిమాండ్, సరఫరాలో సుమారు పది వేల మెట్రిక్ టన్నులు తేడా ఉండటంతో కొరత తీవ్రమవుతోంది. జిల్లాలో ఆదిలాబాద్‌తోపాటు, మంచిర్యాలలో రైల్వేరేక్ పాయింట్లు ఉన్నాయి.
కాకినాడ, కృష్ణపట్నం ప్రాంతాల నుంచి వచ్చే ఎరువులు ఈ రేక్‌పాయింట్ల వద్ద దిగుమతి చేసి, ఇక్కడి నుంచి మండలాలకు రవాణా చేస్తారు. గత నెలలో పుష్కరాల సందర్భంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడిపింది. ఈ క్రమంలో జిల్లాకు రావాల్సిన రేల్వే రేక్‌ల కేటాయింపుల్లో జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం సరఫరాపై పడుతోందే తప్ప, ఎక్కడా యూరియా కొరత లేదని పేర్కొంటున్నారు.
నిల్వల కేటాయింపుల్లో చేతివాటం..?
యూరియా నిల్వల కేటాయింపుల్లోనూ అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రైతుల నుంచి డిమాండ్ ఎక్కువగా బ్రాండ్ యూరియాను ప్రైవేటు డీలర్లకు కేటాయించి, డిమాండ్ అంతగా లేని బ్రాండ్ల యూరియాను సరకార సంఘాలకు కట్టబెడుతున్నారనే ఆరోపణలున్నాయి. అయితే.. ఏ బ్రాండ్ యూరియా అయినా పనితీరు ఒకేలా ఉంటుందని అధికారులు పేర్కొనడం గమనార్హం. జిల్లాలో వరి నాట్లు పూర్తిస్థాయిలో వేసుకోని ఈ పరిస్థితుల్లోనే కొరత ఈ స్థాయిలో ఉంటే, వరి నాట్లు వేసుకున్న పక్షంలో ఇబ్బందులు మరింత తీవ్రమవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
బఫర్ నిల్వల నుంచి సరఫరా చేస్తున్నాం..
యూరియాకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో ఇబ్బందులు వస్తున్నాయి. ఏడు వేల మెట్రిక్ టన్నుల బఫర్ నిల్వలున్నాయి. వాటి నుంచి ఎరువులు సరఫరా చేస్తున్నాము. రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్‌కు కొంత సమయం పడుతోంది. ఎక్కడా యూరియా కొరత లేదు. ఇంకా అవసరాల కోసం యూరి యా నిల్వలు వస్తున్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - రమేష్, ఇన్‌చార్జి, జేడీఏ
సరిపడా యూరియా ఉండాలి..
రైతులకు సరిపడే యూరియాను ప్రభుత్వం అందుబాటులో ఉంచాలి. మార్కెట్లో యూరియా లభించడం లేదు. మా మండలంలో యూరియా దొరకకపోవడంతో ఇచ్చోడకు వెళ్లి ప్రైవేట్ వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి తీసుకొస్తున్నం. సరైన సమయంలో యూరియా లేకపోతే పంట దిగుబడి తగ్గుతుంది. అధికారులు స్పందించి యూరియా సరఫరా చేయాలి. - తొడసం రాజేశ్వర్, ఉప్పర్ పల్లి
యూరియా.. ఏ‘దయా’..!
Published Sat, Aug 8 2015 3:26 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement