తానూరు : చెరువులపై అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కాలువలు పూడుకపోయి ఆయకట్టుకు సాగు నీరందని పరిస్థితి ఏర్పడినా పట్టించుకోవడం లేదు. దీంతో చెరువుల్లో పుష్కలంగా నీరున్నా ప్రయోజన ం లేకుండా పోయింది. ఫలితంగా భూములు బీళ్లుగా మారుతున్నాయి.
తానూరు మండలంలోని బోల్సా, ఉమ్రి(కె), బెంబర, బోరిగాం, దౌలతాబాద్, ఖర్బాల, మసల్గా, కోలూరు, మొగ్లి, మహలింగి, తానూరు, హిప్నెల్లి, సింగన్‌గాం, వడ్‌ఝరి, ఝరి(బి),బోసి గ్రామాల్లో రెండు దశాబ్దాల క్రితం చెరువుల నిర్మాణం చేపట్టారు.
ఈ ఏడాది కురిసిన వర్షాలకు పుష్కలంగా నీరు చేరింది. కానీ కాలువలు పూర్తిగా పాడవడంతో ఆయకట్టుకు సాగు నీరు అందడం లేదు. దీంతో గ్రామాల్లో చెరువులు ఉన్నా ఫలితం లేకుండా పోయింది. ఉమ్రి(కె) చెరువు కాలువల కింద భూమిపోయిన బాధిత రైతులు పరిహారం అందలేదని కాలువలు పూడ్చివేశారు. అలుగుకు మరమ్మతు చేపట్టకపోవడంతో నీరు వృథా పోతోంది. తానూరు సమీపంలోని చెరువుకు ఈ ఏడాది మరమ్మతు చేపట్టారు. కానీ తూము మరమ్మతు చేపట్టకపోవడంతో ఇక్కడా అదే పరిస్థితి.
మహాలింగి, మొగ్లి, మసల్గా, హిప్నెల్లి, భోంద్రట్ గ్రామాల్లో ఉన్న చెరువుల కాలువలు మరమ్మతుకు నోచుకోవడం లేదు. బోరిగాంలోనూ అదే పరిస్థితి. హిప్నెల్లి చెరువు కాలువలు పూడుకపోయాయి. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పర్యవేక్షణ కరువు
మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న చెరువలపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన చెరువులు పశువులకు తోట్టిలుగా మారుతున్నాయి. ప్రతీ చెరువు ఆయకట్టు కింద 200 నుంచి 300 వరకు ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేసినా ఎక్కడా గుంట భూమికి కూడా సాగు నీరందిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువులు, కాలువలకు మరమ్మతు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
చెరువులపై నిర్లక్ష్యం
Published Fri, Oct 3 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM
Advertisement
Advertisement