
మంగళవారం కాల్వ గండిని జేసీబీలతో పూడుస్తున్న దృశ్యం
సాక్షి సిద్దిపేట/గజ్వేల్: కొండపోచమ్మ సాగర్ కాల్వల నిర్మాణంలో డొల్లతనం మరోసారి బయటపడింది. ఇటీవల గజ్వేల్ మండలం కొడకండ్ల హెడ్ రెగ్యులేటరీ వద్ద, మర్కుక్ పంప్‌హౌస్ వద్ద సిమెంట్ లైనింగ్ దెబ్బతినడం, కొండపాక మండలం ఎర్రవల్లి వద్ద కాల్వలు దెబ్బతిన్న ఘటనలు మరువకముందే తాజాగా మంగళవారం మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్‌లో కాల్వకు భారీ గండి పడింది. దీంతో నీళ్లన్నీ పంట పొలాలు, ఇళ్లలోకి చేరాయి. ఈ హఠాత్పరిణామం వల్ల గ్రామస్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అలాగే.. 30 ఎకరాలకుపైగా పంట నష్టం వాటిల్లింది.
వానాకాలం సమీపించే వరకు కాల్వల ద్వారా నీరు వదలాలనే ఉద్దేశంతో వేగంగా పనులు చేయడం.. పనుల్లో నాణ్యత లోపించడం.. సిమెంట్ లైనింగ్ సక్రమంగా చేయకపోవడం.. కాల్వల కోసం పోసిన కట్టలను గట్టిపడే వరకు తొక్కించకపోవడం, సరిగా చదును చేయకపోవడంతో కాల్వల నిర్మాణాల్లో నాణ్యత లోపించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం మూడు చోట్ల గండ్లు పడ్డాయి. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి జగదేవ్‌పూర్ కాల్వకు రిజర్వాయర్ నుంచి 3.5 కిలోమీటర్ల కాల్వ మేడ్చల్ జిల్లా తుర్కపల్లి వద్ద కలుస్తుంది. ఇక్కడ జగదేవ్‌పూర్, తుర్కపల్లి కాల్వలు పాయలుగా విడిపోతాయి. జగదేవ్‌పూర్ కాల్వ శివారు వెంకటాపూర్ నుంచి తీగుల్ వైపు వెళ్తుంది. ఈ కాల్వలను జూన్ 24న ప్రారంభించిన సంగతి తెలిసిందే.
మంగళవారం ఉదయం 6.30 గంటలకు శివారు వెంకటాపూర్ వద్ద మొల్లోనికుంట సమీపంలోని కాల్వ ప్రదేశంలో భారీ గండి పడింది. దీంతో కాల్వ కింది భాగంలో ఉన్న కల్వర్టు ద్వారా మొల్లోని కుంటలోకి భారీ ప్రవాహం, మరో ప్రవాహం గ్రామంలోకి వెళ్లింది. దీని వల్ల 30 ఎకరాల్లో మిర్చి, టమాట, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు గ్రామంలోని పలువురి ఇళ్లలోకి నీరు చేరింది. టీవీలు, వంట సామగ్రి, బియ్యం, బట్టలు, ఇతర విలువైన వస్తువులు తడిసిపోయాయి.
పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నది. సమాచారం అందుకున్న నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ హరేరామ్, ఎస్‌ఈ వేణు, ఈఈ బద్రినారాయణ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు నీటిపారుదల శాఖ అధికారులు ముందుగా కాల్వ ప్రవాహాన్ని ఆపడానికి రిజర్వాయర్ వద్ద గేట్లను మూసేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ప్రవాహం పెరగడం వల్లే గండి
295 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన జగదేవ్‌పూర్ కాలువలో ప్రవాహం పెరగడం వల్లే భారీ గండి ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. కాల్వ నుంచి నీటిని చెరువుల్లోకి పంపడం ఇటీవల మొదలైంది. కొత్త కావడం వల్ల నిజానికి ఈ కాలువలో 195 క్యూసెక్కులకు మించి ప్రవాహం ఉండకూడదని చెబుతున్నారు. కానీ సోమవారం రాత్రి నుంచి ఎక్కువ సామర్థ్యంలో నీటిని వదిలారని తెలిసింది.
దీని వల్ల గండ్లు ఏర్పడి మొల్లోని కుంటలోకి కొంత, గ్రామంలోకి మరో 30 క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం వచ్చినట్లు చెబుతున్నారు. రాత్రి పూట గనుక ఈ గండ్లు పడి ఉంటే నిద్రావస్థలో ఉన్న జనంపైకి నీరు వేగంగా వచ్చి.. ప్రాణ నష్టం సంభవించేదని పలువురు అభిప్రాయపడ్డారు. కాగా, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ దగ్గరుండి జేసీబీ, ఇతర యంత్రాలతో గండ్లను పూడ్చి వేయించారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో ఇలాంటివి సహజం: నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ హరేరామ్
ప్రాజెక్టుల నిర్మాణం, కాల్వల ద్వారా చెరువుల్లోకి నీళ్లు పంపే సందర్భాల్లో గండ్లు పడటం సహజంగా జరుగుతుంటాయని, దీనిని నాణ్యత లోపం, ఇంజనీర్ల వైఫల్యం అని నిరు త్సాహపర్చవద్దని నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ హరేరామ్ అన్నారు. మంగళవారం సాయంత్రం కొండపోచమ్మ సాగర్ జగదేవ్‌పూర్ కాల్వ గండి పడిన శివారు వెంకటాపూర్ వద్ద విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డలో 88 మీటర్ల ఎత్తు నుంచి 10 పంప్‌హౌస్‌లను దాటుకుంటూ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వరకు 618 మీటర్ల ఎత్తుకు విజయవంతంగా గోదావరి జలాలను తీసుకురాగలిగామని పేర్కొన్నారు. ఈ మహత్తర ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజనీర్లు రాత్రిపగలు అలుపెరగకుండా శ్రమించారని గుర్తు చేశారు.
కొత్త ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేసే సందర్భంలో, కాల్వల ద్వారా చెరువులకు నీళ్లను పంపే సందర్భంలో సహజంగా ఇలాంటి చిన్నచిన్న లోపాలు బయటపడుతాయని పేర్కొన్నారు. తాము ప్రస్తుతం జగదేవ్‌పూర్ కాల్వలో నీటి ప్రవాహం ఏవిధంగా ఉందనే అంశంపైనే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. శివారు వెంకటాపూర్ వద్ద కాలువ పక్కన మట్టి వర్షానికి లూజుగా మారి సిమెంట్ లైనింగ్ దెబ్బతినడం చోటుచేసుకుందన్నారు. దీని వల్లే గండి ఏర్పడిందని చెప్పారు. పక్కనే బైపాస్ రోడ్డు ఉండటం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఈనెల 11న అర్ధరాత్రి ఎర్రవల్లి, కొడకండ్ల వద్ద కాలువలు దెబ్బతినడంలోనూ చిన్న లోపాలు బయటపడ్డాయని చెప్పారు.
ఆ రోజు 220 మిల్లీమీటర్ల వర్షం కురవడం వల్ల నీటి ప్రవాహం పెరిగి అలా జరిగిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొండపోచమ్మ సాగర్ కాల్వల ద్వారా నీటిని పంపే సమయంలో తాము పది, పన్నెండు చోట్ల చిన్నచిన్న సమస్యలు వస్తాయని ముందే ఊహించామని, కానీ ఒకటి, రెండు చిన్న సమస్యలతోనే బయట పడగలిగామని స్పష్టం చేశారు. దీన్ని పెద్దదిగా చూపి ప్రజలను భయాందోళనలకు గురిచేయవద్దని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment