నెక్నాంపూర్‌ చెరువుకి అరుదైన గుర్తింపు | neknampur lake entered in india book of records | Sakshi
Sakshi News home page

నెక్నాంపూర్‌ చెరువుకి అరుదైన గుర్తింపు

Published Sat, Feb 3 2018 4:53 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

neknampur lake entered in india book of records - Sakshi

మణికొండ : హైదరాబాద్‌ నగర శివారులోని గండిపేట మండలం నెక్నాంపూర్‌ చిన్నచెరువు ఇండియాబుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. చెరువులో అత్యధికంగా 3వేల చదరపు అడుగుల కదిలే మొక్కల భూమి (ఫ్లోటింగ్‌ ఐలాండ్‌)ను ఏర్పాటు చేసి అందులో ఏకంగా 3500 మొక్కలను నాటడంతో ఆ ఘనత దక్కింది. చెరువును దత్తత తీసుకుని దాని అభివృద్ధికి కృషి చేస్తున్న ధృవాన్‌‡్ష స్వచ్ఛంద సంస్థ వాటిని ఏర్పాటు చేయటంతో శుక్రవారం చెరువు వద్ద జరిగిన ప్రపంచ తడినేల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో  ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధి ధరణి అవార్డును స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ చేతుల మీదుగా అందజేశారు. 

ఈ సందర్భంగా ధృవాన్‌‡్ష స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మధుళిక మాట్లాడుతూ.. నెక్నాంపూర్‌ చిన్న చెరువును మూడు సంవత్సరాల క్రితం దత్తత తీసుకుని చెరువు చుట్టూరా మొక్కలు నాటడం, చెరువు నీటిని శుద్ధి చేసేందుకు ఎంతగానో కృషి చేశామన్నారు. చెరువులో థర్మకోల్‌పై కదిలే భూమిని ఏర్పాటు చేసి అందులో మొక్కలను నాటడం వలన చెరువు మలినాలను తక్కువ ఖర్చుతో శుద్ధి చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. మురికినీటిని శుద్ధి చేసేందుకు సహజంగా ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నారని వాటితోనూ కాలుష్యం ఏర్పడుతుందన్నారు. గతంలో ఏర్పాటు చేసిన ఓ ఐలాండ్‌పై కూరగాయలు సైతం అయ్యాయని ఆమె పేర్కొన్నారు. బెంగళూరు, భూపాల్‌లలోని చెరువుల్లో ఇలాంటివి చిన్న సైజులో ప్రయోగం చేశారని దాంతో తాను ఏకంగా 3వేల చదరపు అడుగుల ఫ్లోటింగ్‌ ఐలాండ్‌ను ఏర్పాటు చేయటంతో దాన్ని ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారు గుర్తించటం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌ ఎస్‌. శ్రీనివాస్, ఎంపీపీ తలారి మల్లేశ్, సర్పంచ్‌ ఉశేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
చెరువులో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్‌ ఐలాండ్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement