బొల్లారంలో కొత్త అందాలు | New beauty to Bollaram area | Sakshi
Sakshi News home page

బొల్లారంలో కొత్త అందాలు

Published Tue, Dec 25 2018 2:40 AM | Last Updated on Tue, Dec 25 2018 2:40 AM

New beauty to Bollaram area - Sakshi

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మొక్కలను పరిశీలిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు

సాక్షి, హైదరాబాద్‌: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం కొత్త సోయగాలు నింపుకుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని పూదోటలకు దీటుగా పూర్తి పచ్చదనాన్ని సంతరించుకుంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అటవీ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ మంచి ఫలితాలనిచ్చింది. కాండం లేకుండా ఆకులతోనే ఉండే పామ్‌ జాతికి చెందిన 30 రకాల మొక్కలతో పామేటమ్‌ ఏర్పాటు, నీటి అవసరం అంతగా లేని మొక్కల జాతులతో రాక్‌ గార్డెన్‌ అభివృద్ధి, ప్రస్తుతమున్న రాళ్ల మధ్యనే అందంగా తీర్చిదిద్దిన జలపాతాన్ని అటవీ శాఖ ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. సోమవారం ఈ రాక్‌ గార్డెన్, పామేరియం, జలపాతాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు ప్రారంభించారు. అనంతరం రాష్ట్రపతి దంపతులు కొన్ని మొక్కలు కూడా నాటారు.  

170 జాతుల మొక్కలు.. 
ఆగస్టు నుంచి నాలుగున్నర నెలల కాలంలో 20 రకాల థీమ్స్‌తో అటవీ శాఖ వివిధ రకాల మొక్కలు నాటింది. దాదాపు 75 ఎకరాల్లో మొత్తం 170 జాతులకు చెందిన 13,714 కొత్త మొక్కలు నాటింది. శీతాకాల విడిదిలో భాగంగా రోజువారీ మార్నింగ్‌ వాక్‌లో కొత్తగా నాటిన మొక్కలను, పచ్చదనం కోసం చేపట్టిన అభివృద్ధి పనులను అటవీ అధికారులతో కలిసి రాష్ట్రపతి పరిశీలించారు. ఈ మొక్కలు నాటక ముందు ఎలా ఉంది, కొత్త మొక్కలు నాటిన తర్వాత అక్కడి పచ్చదనం ఎలా ఉందనే ఆల్బమ్‌ను కూడా అటవీ శాఖ రాష్ట్రపతికి సమర్పించింది. అటవీ శాఖ పనితీరును స్వయంగా చూసిన రాష్ట్రపతి అధికారులను మెచ్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హరితహారాన్ని కొనసాగించి పర్యావరణపరంగా మంచి ఫలితాలు సాధించాలని, కొత్తగా ఎలాంటి పచ్చదనం చర్యలున్నా ఆహ్వానిస్తామని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, పీసీసీఎఫ్‌ పీకే ఝా, రఘువీర్, అదనపు అటవీ సంరక్షణాధికారులు శోభ, డోబ్రియల్‌ పాల్గొన్నారు.

మూడేళ్లకు రూ. 1.7 కోట్లు..
క్రితంసారి హైదరాబాద్‌ పర్యటనకు వచ్చినప్పుడు హరితహారంలో పాల్గొన్న రాష్ట్రపతి, బొల్లారంలో ఉన్న 75 ఎకరాల్లో కూడా విరివిగా పచ్చదనం పెంచాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. దీనికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. ఇందుకోసం ఉన్న చెట్లను తొలగించకుండా, జీవ వైవిధ్యం విలువ పెంచేలా కొత్తగా అభివృద్ధి చేయటం, మొక్కలు లేని ప్రాంతాల్లో పెద్దవి నాటడం, సందర్శనకు వచ్చే పిల్లలు, పెద్దలకు మొక్కలపై అవగాహన పెరిగేలా బొల్లారం నిలయం ఉండాలని ఐదు సూత్రాలను ప్రతిపాదించారు. ఆ తర్వాత అటవీ శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిన ఆయన మూడేళ్లకు కలిపి రూ. 1.7 కోట్ల నిధులు కూడా విడుదల చేశారు.

26 నుంచి రాష్ట్రపతి నిలయం సందర్శనకు అవకాశం 
సాక్షి, హైదరాబాద్‌: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించే అవకాశాన్ని సాధారణ ప్రజలకు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 26 నుంచి జనవరి 6 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించవచ్చని తెలిపింది. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించిన అనంతరం సాధారణ ప్రజల సందర్శనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాగా, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం 75 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఆర్పీ నిలయం ఆవరణలో వివిధ రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలతో కూడిన ఔషధ ఉద్యానవనం సందర్శకులను ఆకట్టుకుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement