డివిజన్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇస్తున్న యువజన సంఘాల నాయకులు (ఫైల్)
ఇచ్చోడ(బోథ్): ఇచ్చోడ కేంద్రంగా రెవెన్యూ డివిజన్ చేయాలనే వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడంతో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఉట్నూర్ రెండు డివిజన్లు మాత్రమే ఉన్నాయి. ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్‌లో బోథ్ నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలు, ఆదిలాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు ఉన్నాయి.
ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్‌లో 13 మండలాలు ఉండడంతో పని భారంతోపాటు బోథ్‌లోని మండలాల ప్రజలకు దూరభారం కూడా అవుతోంది. కొత్త మండలాలు ఏర్పాటు చేసినప్పుడే ఇచ్చోడను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వినిపించింది. కాని కొన్ని కారణాలతో తెలంగాణాలో కొత్తగా డివిజన్ ఏర్పాటు కాలేదు. సీఎం కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే మరికొన్ని కొత్త మండలాతోపాటు అవసరం ఉన్న చోట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కొత్త రెవెన్యూ డివిజన్ల అంశం తెరపైకి వచ్చింది. అయితే అన్నిసౌకర్యాలు ఉన్న ఇచ్చోడను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
డివిజన్ ఏర్పాటు చేయాలని తీర్మానం..
ఇచ్చోడ మండలాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పా టు చేయాలని ఇటీవల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. యువజన సంఘాల ఆధ్వర్యంలోనూ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు కూడా అందిస్తున్నారు. ఇప్పటికే పలు యువజన సంఘాలతోపాటుగా రాజకీయ పార్టీలు కూడా ఇచ్చోడను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని తీర్మానాలు చేస్తున్నాయి.
ఇచ్చోడ ఏర్పాటుతో తగ్గనున్న దూర భారం
ఇచ్చోడను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తే చుట్టు పక్కల మండలాలకు దూర భారం తగ్గనుంది. కొత్తగా ఏర్పాటు అయిన సిరికొండ మండలం ఇచ్చోడకు కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో పక్కనున్న బజార్‌హత్నూర్ మండలం కూడా ఇచ్చోడకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిహత్నూర్, నేరడిగొండ మండలాలు కూడా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. బోథ్ మండలానికి ఇచ్చోడ మండలానికి 25 కిలో మీటర్లు దూరం ఉంటుంది. ఇచ్చోడ మండలానికి ఐదు మండలాలు పది నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉండడంతోపాటు జాతీయ రహదారిపై ఉండడం అన్ని మండలాలకు సెంటర్ పాయింట్ ఇచ్చోడ కావడంతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సమీప మండలాల ప్రజలు సుముఖంగా ఉన్నారు. దీంతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు వాదన తెరపైకి వస్తోంది.
కొత్త డివిజన్లపై ప్రభుత్వ కసరత్తు...
సీఎం కేసీఆర్ ఆదేశాలతో కొత్తగా డివిజన్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల పునర్విభజనతో ఆదిలాబాద్‌లో రెవెన్యూ డివిజన్ ఒక్కటే కావడంతో అటు అధికారులకు, ఇటు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొత్తగా డివిజన్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాలన సౌలభ్యంతోపాటు దూరంభారం తగ్గి ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. దీంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త డివిజన్‌ల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇచ్చోడ, సిరికొండ, బజార్‌హత్నూర్, గుడిహత్నూర్, నేరడిగొండ, బోథ్ ఆరు మండలాల కలిపి ఇచ్చోడ రెవెన్యూ ఏర్పాటు కానుంది.
Comments
Please login to add a commentAdd a comment