ట్రాఫిక్‌ చిక్కులూ లెక్కేస్తారు! | New Procedure To Traffic Issue Is Traffic Impact Assessment Certificate | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ చిక్కులూ లెక్కేస్తారు!

Published Wed, Jul 17 2019 1:04 AM | Last Updated on Wed, Jul 17 2019 5:13 AM

New Procedure To Traffic Issue Is Traffic Impact Assessment Certificate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  గ్రేటర్‌ హైదరాబాద్‌లో బహుళ అంతస్తులు, వాణిజ్య భవనాల నిర్మాణాలకు ఇక ట్రాఫిక్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి. నిర్మాణాలకు అనుమతులు జారీ చేసే ముందే ఆ భవనాల వల్ల అక్కడ కలిగే ట్రాఫిక్‌ ఇబ్బందులను జీహెచ్‌ఎంసీ అధికారులు అంచనా వేయనున్నారు. ఆ భవనాల్లో ఏర్పాటయ్యే సంస్థల ద్వారా ఎంత రద్దీ పెరుగుతుంది.. ఎన్ని వాహనాలకు పార్కింగ్‌ సదుపాయం ఉంది.. అక్కడి రహదారిపై ఏర్పడే ట్రాఫిక్‌ చిక్కులు వంటివాటిని పరిగణనలోకి తీసుకుంటారు. ఆ మేరకు ట్రాఫిక్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ సర్టిఫికెట్‌ను జత పరిస్తేనే ఆ నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. భవనం వినియోగాన్ని బట్టి సర్టిఫికెట్‌ జారీకి సంబంధించిన మార్గదర్శకాల్ని జీహెచ్‌ఎంసీ త్వరలో విడుదల చేయనుంది. ఉదాహరణకు ఒక మల్టీప్లెక్స్‌ భవనం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటే బిల్టప్‌ ఏరియా ఎంత.. అందులోని సినిమాస్క్రీన్లు, షాపులు, సదరు ప్రాంతంలో పెరిగే రద్దీ, సినిమా ప్రదర్శనలకు ముందు, అనంతరం కలిగే ప్రభావం తదితర వాటిని బేరీజు వేస్తారు.

ప్రస్తుతం అక్కడున్న రహదారి పెరిగే జనాభాకు సరిపోతుందా.. లేనట్లయితే దానిని విస్తరించేందుకు అవకాశం ఉందా.. సమీపంలో ఉన్న జంక్షన్లేమిటి.. ఇలా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. రద్దీ సమస్య పరిష్కారానికి బిల్డర్‌ ఎక్కువ సెట్‌బ్యాక్‌లు వదిలేందుకు ముందుకు వచ్చినా, ప్రత్యామ్నాయంగా లింక్‌ మార్గం వంటివి ఉంటే ఏర్పాటు చేస్తే అనుమతిస్తారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యలకు కారణాల గురించి అధ్యయనం చేసే బాధ్యతల్ని జీహెచ్‌ఎంసీ ‘లీ అసోసియేట్స్‌’కు అప్పగించింది. త్వరలో అది నివేదికను అందజేయనుంది. ఆ నివేదికలోని సూచనల మేరకు ట్రాఫిక్‌ ఇంపాక్ట్‌ స్టడీ సర్టిఫికెట్‌కు మార్గదర్శకాలు జారీ కానున్నాయి.

 ... అయినా తప్పని చిక్కులు
నగరంలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి రూ.25 వేల కోట్లతో ఎస్సార్‌డీపీ కింద పలు ఫ్లైఓవర్లు కడుతున్నా, మెట్రోరైలు అందుబాటులోకొచ్చినా ట్రాఫిక్‌ చిక్కులు తప్పడంలేవు. వర్షం వచ్చిన సమయాల్లో ఇవి మరింత తీవ్రమవుతున్నాయి. ఐటీ కంపెనీలు, బహుళ అంతస్తుల భవనాలున్న మాదాపూర్, హైటెక్‌సిటీ వంటి ప్రాంతాల్లో ఈ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే బహుళ అంతస్తుల భవనాల దరఖాస్తుదారులు సమర్పించాల్సిన మిగతా పత్రాలతోపాటు ఈ ట్రాఫిక్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయనున్నారు. అభివృద్ధి చెందిన పలు దేశాల్లో ఈ విధానం అమల్లో ఉన్నా, మన దేశంలో మాత్రం ఇదే ప్రథమం కానుంది.  

బిల్డర్‌ నుంచి ఫీజు వసూలుకు యోచన
బహుళ అంతస్తుల భవనాలు 44 శాతం స్థలాన్ని పార్కింగ్‌కు వదులుతున్నా, రద్దీకి అది సరిపోవడం లేదు. ఉదాహరణకు ఒక మల్టీప్లెక్స్‌లో 750 వాహనాల పార్కింగ్‌కు అనుమతి ఉన్నా 2 వేల వరకు సీట్లుంటే అక్కడ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది సదరు రహదారి ట్రాఫిక్‌పై ప్రభావం చూపుతోంది. సినిమాలు, షాపింగ్, విండోషాపింగ్‌ కు వచ్చేవారితోపాటు గేమింగ్‌ జోన్స్‌ తదితరమైన వాటితో ఈ సమస్య పెరుగుతోంది. వారాంతాలు, సెలవుల్లో ఇది తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చే బహుళ అంతస్తుల భవనంతో పెరిగే ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి సదరు కారిడార్‌ను అభివృద్ధి పరిచేందుకు జీహెచ్‌ఎంసీకి అయ్యే వ్యయంలో కొంత శాతాన్ని ఇంపాక్ట్‌ ఫీజుగా బిల్డర్‌ నుంచి వసూలు చేయాలని యోచిస్తోంది. ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ఎలాంటి ప్రత్యామ్నాయ పరిష్కారాల్లేని పక్షంలో అనుమతులిచ్చే అవకాశం కూడా లేదని సంబంధిత అధికారి పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement