
సభా ప్రాంగణంలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో సెప్టెంబర్ రెండున జరిగే టీఆర్‌ఎస్ ప్రగతి నివేదన సభకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడూ భద్రతను పర్యవేక్షించేందుకు దాదాపు 12 వేల నుంచి 15 వేల మంది పోలీసులను మోహరిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి ఆర్మ్‌డ్, సెక్యూరిటీ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాలకు చెందిన కొంతమంది పోలీసులు ఇప్పటికే వచ్చి విధుల్లో నిమగ్నమయ్యారు.
మరి కొంతమంది ఈ రెండు రోజుల్లో వస్తారని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. 1,600 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న సభాస్థలికి 25 లక్షల మంది వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీంతో ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. సభకు తరలివచ్చే వాహనాలకుగాను 15 పార్కింగ్ స్థలాల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు, ట్రాక్టర్లు, కార్లు, ఇతర వాహనాలు భారీ సంఖ్యలో వస్తాయన్న అంచనా మేరకు ఎక్కడా ఎవరికీ ఇబ్బంది కాకుండా ఈ పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఔటర్ రింగ్ రోడ్డుకు కొత్త మార్గాలు...
158 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా అన్ని జిల్లాల నుంచి సభాస్థలికి వచ్చే వాహనాలు నేరుగా దిగిపోయేందుకు బొంగళూరు జంక్షన్ సౌకర్యంగా ఉంటుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. అయితే, ఇక్కడ ట్రాఫిక్ జామ్‌కు కూడా అవకాశముంటుందని అంచనా వేస్తున్నారు. రావిర్యాల, తుక్కుగూడ, బొంగళూరు మార్గంలో ఔటర్ సర్వీసు రోడ్లకు ఆనుకొని పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తుండటంతో మళ్లీ వాహనాలు తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులుంటాయని గుర్తించారు.
అందుకే ఔటర్ రింగ్ రోడ్డు మెయిన్ క్యారేజ్ నుంచి నేరుగా సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న పార్కింగ్ ప్రాంతానికి చేరేలా కొత్త మార్గాలు వేయాలన్న ఆలోచనకు కార్యరూపం దాల్చారు. రావిర్యాలలో నాలుగు, బొంగళూరులో నాలుగు ప్రాంతాల్లో మెయిన్ క్యారేజ్‌వే పక్కనే ఉన్న సోల్జర్స్, ర్యామ్‌లను తొలగించి సర్వీసురోడ్డు వరకు తాత్కాలికంగా మట్టితో రోడ్డు వేస్తున్నారు. దీనివల్ల ఓఆర్‌ఆర్‌కు కొంత ఇబ్బంది కలుగుతున్నా ప్రగతి నివేదన సభ ముగిసిన మరుసటిరోజే మళ్లీ మరమ్మతులు చేస్తామని అధికారులు అంటున్నారు. లక్షల్లో వచ్చే వాహనాలు ఎక్కడా ట్రాఫిక్‌లో నిలవకుండా ఉండేందుకు ఈ కొత్త మార్గాలు ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు.
ఇతర రాష్ట్రాల వాహనాల దారి మళ్లింపు...
తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగానే చేరుకోనుండటంతో ఆ రోజూ ఔటర్ రింగ్ రోడ్డుపై ఇతర రాష్ట్రాల వాహనాలను దారి మళ్లించేలా ట్రాఫిక్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఏయే మార్గాల్లో ఆయా వాహనాల రాకపోకలు దారి మళ్లించాలన్న దానిపై ఇంకా స్పష ్టత రాలేదు. హైదరాబాద్‌కు రాకుండానే ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ఇతర నగరాలకు వెళుతున్న ఇతర రాష్ట్రాలవాసులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు.