సాక్షి, హైదరాబాద్: మొన్నటిదాకా ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌కి వెళ్లొచ్చిన వారందరినీ నానా తంటాలు పడి వెతికిపట్టుకున్న పోలీసులకు మరో చిక్కు వచ్చి పడింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ముస్లింఆధ్యాత్మిక ఉద్యమానికి కేంద్రంగా ఉన్న దేవ్‌బంద్‌కి వెళ్లిన వారిలోనూ కరోనా లక్షణాలు వెలుగుచూడటం, వారికి మర్కజ్‌తో లింకులు బయటపడటంతో ఖాకీలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. దీంతో ఇప్పుడు రాష్ట్రం నుంచి ఎవరెవరు దేవ్‌బంద్‌కి వెళ్లారు? వారిలో ఎందరు అక్కడ నుంచి మర్కజ్ వెళ్లారో తెలుసుకునే పనిలో పడ్డారు. నిర్మల్‌లో ఇలాంటి వారిని ముగ్గురిని గుర్తించారు. వీరిలో ఒకరికి కరోనా రావడంతో మరోసారి కలకలం రేగింది. దాదాపు పది మంది వరకు నిర్మల్ నుంచి దేవ్‌బంద్‌కి వెళ్లారని సమాచారం. దీంతో పోలీసులు వాళ్లని వెతికే పనిలో పడ్డారు.
అసలేం జరిగింది..?
మార్చి మొదటి వారంలో నిర్మల్ నుంచి దేవ్‌బంద్‌కి దాదాపు 10 మందికి పైగా వెళ్లినట్లు సమాచారం. వీరిలో కొందరు మర్కజ్ వెళ్లి ప్రార్థనల్లో పాల్గొని స్వస్థలాలకు వచ్చారు. ఇక్కడ జరుగుతున్న హడావుడి చూసి తాము మర్కజ్‌కి వెళ్లి వచ్చామన్న విషయం తెలిస్తే.. అరెస్టు చేస్తారన్న భయంతో ఆ విషయాన్ని దాచిపెట్టారు. తాము వెళ్లి వచ్చింది యూపీలోని దేవ్‌బంద్‌కి అని మాత్రమే వెల్లడించారు. ఇటీవల స్థానికంగా ఇద్దరు కరోనా కారణంగా మరణించారు. దేవ్‌బంద్‌కి వెళ్లి వచ్చినవారు సైతం వారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో జిల్లాకు చెందిన అత్యున్నత అధికారి, మరో పోలీసు ఉన్నతాధికారి కూడా వీరితో సమావేశమయ్యారు. ఈలోపు ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) నుంచి రాష్ట్ర పోలీసులకు నిర్మల్ నుంచి దేవ్‌బంద్‌కి వెళ్లిన వారు మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నారన్న సమాచారం వచ్చింది. దీంతో వీరిలో ముగ్గురికి పరీక్షలు చేయగా, ఒకరికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో మిగిలిన వారిని క్వారంటైన్‌కు తరలించారు.
ఎలా తెలిసింది..?
మర్కజ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో రంగంలోకి దిగిన నిఘా బృందాలు మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారి సెల్‌ఫోన్ నంబర్లు సేకరించాయి. వారి సెల్‌ఫోన్ నంబర్లు, వాటి సిగ్నల్స్, గూగుల్ మ్యాప్ లోకేషన్ ఆధారంగా వారు పర్యటించిన ప్రాంతాలపై ఆరా తీయగా పలువురు యూపీలోని దేవ్‌బంద్, రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు సైతం వెళ్లివచ్చారని తేలింది. దేవ్‌బంద్‌లో జరిగిన ప్రార్థనల్లో కేవలం రాష్ట్రానికి చెందిన నిర్మల్‌వాసులు మాత్రమే పాల్గొన్నారని పోలీసులు పైకి చెబుతున్నా.. వారికి అందిన సమాచారం ఆధారంగా మిగిలిన జిల్లాల్లోనూ అన్వేషిస్తున్నట్లు సమాచారం.
ఏంటీ దేవ్‌బందీ?
ఇది ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహ్రాన్‌పూర్ జిల్లాలో ఉంది. ఢిల్లీకి 150 కి.మీ. దూరంలో ఉంటుంది. సున్నీ ఇస్లాంకు చెందిన ప్రాచీన దేవ్‌బందీ ఉద్యమానికి ఈ ప్రాంతం పుట్టినిల్లు. 1866లో దేవ్‌బందీలో సున్నీ ఇస్లాం మతప్రచారం కోసం దారుల్ ఉలూమ్ దేవ్‌బందీ అనే అరబిక్ యూనివర్సిటీని మౌలానా మహమ్మద్ ఖాసీం నానోతావి అనే వ్యక్తి ప్రారంభించారు. దీనినే దేవ్‌బందీ అని వ్యవహరిస్తారు. తరువాత దీని శాఖలు దేశమంతా ఏర్పడ్డాయి. కాలక్రమంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్‌తోపాటు యూకే, సౌతాఫ్రికాల్లోనూ తన కార్యకలాపాలను విస్తరించింది. అంతేకాకుండా ప్రపంచంలోని పలు ముస్లిం దేశాల విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment