సాక్షి, హైదరాబాద్ : దిశ నిందితుల ఎన్‌కౌంటర్ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) సభ్యుల బృందం విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆ బృందం పోలీసులను పలు వివరాలు అడిగి తెలుసుకుంది. తొలుత దిశను దహనం చేసిన ప్రాంతం నుంచి ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం వరకు పరిశీలించారు. ఇంతదూరం నిందితులు ఎలా వచ్చారు? అంతా ఒకే దగ్గర ఎలా పడిపోయా రు? నిందితుల శరీరంలో ఎలాంటి బుల్లెట్లు లేకపోవడంపై సభ్యులు దృష్టిసారించినట్లు సమాచారం.
నిందితులు ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్‌లను పోలీసులు ఏ రకం తుపాకీతో కాల్చారు? పిస్టల్స్‌తోనా.. పెద్ద గన్స్ వాడారా? పోలీసులు జరిపిన ఫైరింగ్‌లో ఎంతమంది పాల్గొన్నారు? ఇద్దరు నిందితులు తొలుత ఫైర్ ఓపెన్ చేస్తే.. పోలీసులు నలుగురిని ఎందుకు కాల్చాల్సి వచ్చింది? అన్న విషయాలపై ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ఆరా తీస్తున్నట్లు సమాచారం.
అయితే మృతుల శరీరంలో బుల్లెట్లు లేకపోవడంపై ఓ పోలీసు ఉన్నతాధికారి స్పందిస్తూ.. ఎన్‌కౌంటర్‌లో శరీరంలో నుంచి తూటాలు దూసుకుపోవడం సాధారణ విషయమేనని తెలిపారు. ఎముకలు, పక్కటెముకలకు తగిలినపుడు తూటాల దిశ మారుతుందని, మెత్తని శరీరభాగాలకు తగిలినప్పుడు ఇలా బయటికి వస్తుంటాయని వివరించారు.
ముగ్గుర్ని తూర్పు వైపు నుంచి..
ఎన్‌కౌంటర్‌లో నిందితులపై పోలీసులు ఎక్కుపెట్టిన తుపాకులు ఏ రకానికి చెందినవి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ పోలీసుల వద్ద 9 ఎంఎం పిస్టల్, ఎస్‌ఎల్‌ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్) ఉంటాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. నిందితులను పోలీసులు ఎస్‌ఎల్‌ఆర్ తుపాకులతోనే కాల్చా రు. ఈ ఘటనలో చటాన్‌పల్లి బ్రిడ్జి నుంచి పారిపోతున్న నిందితులను లొంగిపొమ్మని హెచ్చరిస్తూ.. వెంబడించిన పోలీసులు రెండువైపులా చుట్టుముట్టారు. అయినా నిందితులు కాల్పులు ఆపకపోవడంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు.
ఆరిఫ్, శివ, నవీన్ ముగ్గురిని పోలీసులు తూర్పు వైపు నుంచి కాల్చారు. అందుకే, వారి తలలు పడమర వైపు వాలి ఉన్నాయి. అంటే పోలీసుల తూటాలు వారికి ఎదురుగా వచ్చి తగిలినట్లు తెలుస్తోంది. ఇక చెన్నకేశవులుకు మాత్రం బుల్లెట్లు వెనక నుంచి వచ్చి తగిలినట్లుగా అతని శరీరం పడి ఉన్న తీరు చెబుతోంది. అందుకే, ఇతని ఒక్కడి తల మాత్రం తూర్పు వైపు వాలి ఉంది.
గాయం ఆధారంగా చెప్పొచ్చు..!
నిందితుల పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఫోరెన్సిక్ నిపుణులు ఏ తుపాకీతో కాల్చింది చెప్పగలరు. తూటా గాయం ఆధారంగా చేసుకుని, శరీరాన్ని తగిలిన చోట, వెలుపలికి వచ్చిన ప్రాంతంలో ఏమేరకు గాయం చేసింది అన్న విషయాలను ఆధారంగా చేసుకుంటారు.
సాధారణంగా ఏ బుల్లెటయినా శరీరాన్ని తగి లిన చోట మామూలు వ్యాసార్థంలో.. వెలుపలికి వచ్చినపుడు అందుకు రెట్టింపు వ్యాసార్థం లో గాయాలను ఏర్పరుస్తాయి. అదే సమయం లో గాయంపై ఉన్న గన్‌పౌడర్ రెసిడ్యూ (జీపీఆర్) ఆధారంగా చెప్పగలరు. గాయం తగిలిన విధానాన్ని బట్టి, అది ఏ దిశ నుంచి దూసుకొచ్చింది.. ఎంత దూరం నుంచి వచ్చింది.. కచ్చితంగా చెప్పే పరిజ్ఞానం మన ఫోరెన్సిక్ నిపుణుల వద్ద ఉంది. వీరిని ఫోరెన్సిక్ బాలిస్టిక్ ప్రొఫెసర్లు అని పిలుస్తారు. ఈ ఎన్‌కౌంటర్‌లో వీరు ఇచ్చే నివేదిక కీలకం కానుంది.
ఘటనాస్థలి వద్ద బందోబస్తు..
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. రాజేంద్రనగర్ ఏసీపీ చక్రవర్తి ఆధ్వర్యంలో సుమారు 59 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా దిశను దహనం చేసిన చోటు, హంతకులను ఎన్‌కౌంటర్ చేసిన ప్రదేశాన్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే పోలీసులు ఎన్‌కౌంటర్ ఘటనా స్థలానికి వెళ్లనీయకుండా జాతీయ రహదారి వద్దనే కట్టడి చేస్తున్నారు.
‘ఎన్‌కౌంటర్’పై సీన్ రీకన్‌స్ట్రక్షన్
షాద్‌నగర్ : దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై ఆదివారం ఉదయం చటాన్‌పల్లి వద్ద పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. ఘటనా స్థలాలను ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సభ్యులు ఇప్పటికే పరిశీలించారు. మరోమారు ఈ బృందం ఘటనా స్థలానికి వచ్చి ఎన్‌కౌంటర్ గురించి అడిగితే చూపించడానికి పోలీసులు ఆదివారం సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. హంతకులు పోలీసులపై ఏవిధంగా తిరగబడ్డారు.. ఏవిధంగా రాళ్లు, కట్టెలతో దాడికి పాల్పడ్డారు.. ఏవిధంగా పోలీసులు, హంతకులపై కాల్పులు జరిగాయన్న వాటిపై పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. దీనిని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పర్యవేక్షించారు. అయితే, ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం మళ్లీ సంఘటనా స్థలానికి వస్తుందా.. లేదా అన్న విషయంపై స్పష్టత లేదు.
Comments
Please login to add a commentAdd a comment