ప్రతిష్టాత్మక నిమ్స్ వైద్య విజ్ఞాన సంస్థ 14 ఏళ్లుగా స్నాతకోత్సవానికి నోచుకోవడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రే చాన్స్‌లర్‌గా వ్యవహరించే ఈ సంస్థలో ఏటా దాదాపు 400 మందికిపైగా విద్యార్థులు వివిధ మెడికల్ కోర్సులు అభ్యసిస్తుంటారు. వీరంతా కోర్సులు పూర్తయ్యాక కాన్వొకేషన్‌లో పట్టాలు, డిగ్రీలు అందుకోవాలని ఆశిస్తారు. కానీ ఇక్కడ స్నాతకోత్సవం నిర్వహించడం మర్చిపోతున్నారు. మూడేళ్ల సూపర్ స్పెషాలిటీ కోర్సులు సహా బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కోర్సులు ఈ సంస్థలో నిర్వహిస్తున్నారు. చాన్స్‌లర్ సమయం ఇవ్వకపోవడం వల్లో..లేక ఆసక్తి లేకనో ఇక్కడ కాన్వొకేషన్‌ను నిర్వహించడం లేదు.
సాక్షి, సిటీబ్యూరో: స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చాన్సలర్‌గా వ్యవహరించే ఇనిస్టిట్యూట్ అది. ఎందరో వైద్య విద్యార్థులు ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తారు. అలాంటి సంస్థ గత 14 సంవత్సరాలుగా స్నాతకోత్సవాలకు నోచుకోవడం లేదు. అంతే కాదు గత ఐదేళ్ల నుంచి పూర్తిస్థాయి డీన్ కూడా లేరంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకప్పుడు మెరుగైన వైద్య విద్య, పరిశోధనలతో ఓ వెలుగు వెలిగిన ప్రతిష్టాత్మాక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ప్రస్తుతం స్నాతకోత్సవాన్ని కూడా నిర్వహించలేకపోతోంది. సమస్యలు చెప్పుకుందామన్నా వినే నాథుడు లేరంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నిజానికి రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఛాన్సలర్‌గా వ్యవహరిసుంటారు. కానీ నిమ్స్‌కు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ఛాన్సలర్‌గా, డైరెక్టర్ వైస్ చాన్సలర్‌గా వ్యవహరిస్తుంటారు. ఎగ్జిక్యూటివ్ బాడీ అధ్యక్షుడిగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కొనసాగుతుండగా, మరో 15 మంది సభ్యులుగా ఉంటారు. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే మరింత మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు, వైద్య ఉన్నత విద్య, పరిశోధనలు వంటి అంశాలే ప్రధాన లక్ష్యంగా ఈ ఆస్పత్రి ఏర్పడింది. 1961 నుంచి 1976 వరకు నిజామ్స్ చారిటీ ట్రస్ట్ సహకారంతో నడిచింది.ఆ తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంది. మొదట్లో ఇక్కడ కేవలం ఎముకల వైద్యం మాత్రమే అందేది. ఆ తర్వాత క్రమంగా జనరల్ ఆస్పత్రిగా మారింది.
కాన్వొకేషన్‌పై ఏదీ శ్రద్ధ?
ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)కు ధీటుగా దీన్ని రూపొందించారు. ఇది పూర్తిగా స్వయంప్రతిపత్తిగల సంస్థ. దీనికి ప్రత్యేక పాలక మండలితో పాటు ప్రత్యేక చట్టాలు కూడా ఉన్నాయి. తొలినాళ్లలో అరుదైన చికిత్సలు, పరిశోధనలతో ఓ వెలుగు వెలిగింది. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ కోర్సులు సహా బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో ప్రస్తుతం 30పైగా విభాగాలు ఉండగా, వీటిలో మూడేళ్ల సూపర్‌స్పెషాలిటీ (పీజీ) కోర్సుల్లో సుమారు 280 మంది చదువుతున్నారు. వందకు పైగా నర్సింగ్ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి స్నాతకోత్సవం రోజు చాన్సలర్ చేతుల మీదుగా డిగ్రీ సహా అవార్డులను పొందడం ఓ గొప్ప అనుభూతిగా భావిస్తుంటారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా, ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు డైరెక్టర్‌గా కొనసాగినన్ని రోజులు నిర్విరామంగా స్నాతకోత్సవాలు జరిగాయి. అప్పట్లో ఇక్కడ చదువుకుని కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు చాలా ఆనందంగా ఫీలయ్యేవారు. ఇప్పుడు మాత్రం చాన్సలర్‌గా ఉన్న సీఎంలు సమయం ఇవ్వక పోవడం, డైరెక్టర్ ఇతర ఉన్నతాధికారులు శ్రద్ధ చూపకపోవడం వల్లే స్నాతకోత్సవాలు జరపడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
ఫ్యాకల్టీ, రెసిడెంట్ల సమస్యలు వినేవారేరి?
వైద్య సీట్ల పెంపు, విద్యాభోధన సహా పరీక్షల నిర్వహణ, డిగ్రీల రూపకల్పనలో డీన్ పాత్ర కీలకం. 2014 నుంచి ఇప్పటి వరకు నిమ్స్‌కు పూర్తిస్థాయి డీన్ లేడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్‌ఛార్జీలే డీన్‌లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు పరిపాలనలో కీలకమైన ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ పోస్టు కూడా గత ఐదేళ్ల నుంచి ఖాళీగానే ఉంది. దీంతో ఆ పోస్టులోనూ ఇన్‌చార్జీలే ఉన్నారు. ఏదైనా సమస్య వస్తే..ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి నెలకొంది. పూర్తిస్థాయిలో ఒక డీన్‌ను కూడా నియమించుకోలేని సంస్థకు ఎంసీఐ అదనపు సీట్లను ఎలా మంజూరు చేస్తుందో అర్థం కావడం లేదని ఫ్యాకల్టీ అసోసియేషన్, రెసిడెంట్స్ అసోసియేషన్లు ఆరోపిస్తున్నాయి. ఎందరో ప్రముఖుల చేత ప్రశంసలందుకున్న నిమ్స్ పూర్వ వై భవాన్ని పునరుద్దరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిమ్స్ డైరెక్టర్ వీ విషయంలో శ్రద్ధ చూపాలంటున్నారు. వెంటనే ఖాళీగా ఉన్న డీన్ సహా అన్ని పోస్టులను భర్తీ చేయడంతో పాటు స్నాతకోత్సవాన్ని నిర్వహించి, విద్యార్థులకు డిగ్రీలు అందజేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment