10 నెలల చిన్నారికి స్వైన్‌ఫ్లూ
గాంధీలో ఐదుగురు, నిమ్స్‌లో నలుగురికి చికిత్స
డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 9 మంది మృతి
రోగులను పరామర్శించిన వైద్య, ఆరోగ్య మంత్రి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మళ్లీ కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 5,700 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో 70 మందికి ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణైంది. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందగా, కేవలం ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే నలుగురు చనిపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. బీబీనగర్‌కు చెందిన.. స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న పది మాసాల మగశిశువును శనివారం గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. ఇప్పటికే పీడియాట్రిక్ విభాగంలో నగరానికి చెందిన మరో ఐదుగురు చిన్నారులు ఇదే లక్షణాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం వైద్యులు వీరి నుంచి నమూనాలు సేకరించి ఐపీఎంకు పంపారు. అయితే రిపోర్టు రావాల్సి ఉంది. వైద్యులు అనుమానిత ఫ్లూగా భావించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఉస్మానియా ఐసోలేషన్ వార్డులో పని చేసే ఓ మహిళా ఉద్యోగికి స్వైన్‌ప్లూ లక్షణాలు పాసిటివ్ ఉన్నట్లు తేలింది.
నిమ్స్‌లోని బాధితులకు మంత్రి పరామర్శ...
రోజు రోజుకు స్వైన్‌ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. గాంధీ జనరల్ ఆస్పత్రి సహా నిమ్స్, ఫీవర్, ఉస్మాని యా తదితర ఆస్పత్రుల్లో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసింది. గాంధీతో పాటు నిమ్స్‌లో కూడా రోగులు చికిత్స పొందుతున్నారు. టాంజానియా నుంచి స్వైన్‌ఫ్లూతో వచ్చి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలు అశ్విని సహా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న తిమ్మన్న, రవీందర్‌రెడ్డి, భరత్‌లను మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు. శనివారం ఆయన నిమ్స్‌ను సందర్శించి ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వైన్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తలనొప్పి, జ్వరం, ముక్కు నుంచి నీరుకారడం, కీళ్లనొప్పులు వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే ఫ్లూ లక్షణాలుగా అనుమానించి వైద్యులను ఆశ్రయించాలని సూచించారు.
పెరిగిన మాస్క్‌ల అమ్మకాలు
స్వైన్‌ఫ్లూ మరణాలు సంభవించడంతో నగరంలో మాస్క్‌ల అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్, పేట్ల బురుజు తదితర ఆస్పత్రుల ప్రాంగణాల్లో రోగులు, రోగి సహాయకులు మాస్క్‌లు తప్పనిసరిగా ధరిస్తున్నారు. ఎన్95 మాస్క్‌లు రూ.60 నుంచి రూ.100 వరకు ఉండగా, అదే సాధారణ మాస్క్ రూ.5కే మార్కెట్‌లో లభ్యం అవుతుండడంతో వాటినే ప్రజలు విరివిగా వినియోగిస్తున్నారు.