ఎండల్లోనూ అదే తీవ్రత
ఉష్ణోగ్రతలు పెరిగినా.. స్వైన్‌ఫ్లూ విజృంభణ
- తాజాగా గాంధీలో ఐదు నెలల శిశువు మృతి
- మరో 11 మంది బాలలకు చికిత్స.. భయాందోళనలో తల్లిదండ్రులు
- నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది.. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి... ఇంత వేడి వాతావరణంలో బ్యాక్టీరియా సహా వైరస్‌లు జీవించే అవకాశం తక్కువ. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు, పెరిగిన కాలుష్యంతో భగ్గున మండుతున్న ఎండల్లోనూ.. స్వైన్‌ఫ్లూ (హెచ్1 ఎన్1) వైరస్ మరింత విజృంభిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వైరస్ కూడా రూపాంతరం చెందుతోంది. సాధారణంగా జూలై నుంచి నవంబర్‌లో ఎక్కువగా విస్తరించే ఈ వైరస్ కాలంతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ప్రతాపం చూపుతుండటంతో ప్రజలు భయాందో ళనలకు గురవుతున్నారు.
తాజాగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఐదు మాసాల మోక్షశ్రీ స్వైన్‌ఫ్లూతో శనివారం మృతి చెందాడు. మరో 11 మంది చిన్నారులు ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నారు. వైద్యులు ప్రస్తుతం వీరిని పీడియాట్రిక్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్సలు అందజేస్తున్నారు. బాధితుల్లో ఆరుగురు బాలికలు, ఐదుగురు బాలురు ఉన్నారు. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగినప్పటికీ స్వైన్ ఫ్లూ వైరస్ విజృంభించడంపై వైద్య నిపుణు లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూపాంతరం చెందిన స్వైన్‌ఫ్లూ వైరస్‌ను అదుపు చేసేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
మూడు గంటలకు మించి బతికే అవకాశం లేకున్నా....
ఏడేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాంచిన హెచ్1ఎన్1 ఇన్‌ఫ్లూయెంజా(స్వైన్‌ఫ్లూ) వైరస్ సీజన్‌తో సంబంధం లేకుండా ఓ సాధారణ వైరస్‌లా రూపాంతరం చెందిం ది. వాతావరణంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల గ్రేటర్ వాతావరణంలో 18 రకాల స్వైన్‌ఫ్లూ కారక వైరస్‌లు స్వైర విహారం చేస్తున్నట్లు ఇప్పటికే ఎర్రగడ్డలోని ఛాతి ఆస్పత్రి వైద్యుల పరిశోధనలో తేలింది. ఇది గర్భిణులు, వృద్ధులు, చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వైరస్ గాల్లోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒకసారి వాతారణంలోకి ప్రవేశించిన వైరస్ రెండు, మూడు గంటలకు మించి బతికే అవకాశం ఉండదు.
నగరంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల సీజన్‌తో సంబంధం లేకుండా విస్తరిస్తూనే ఉంది. వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాల్సిన యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ప్రజల బలహీనత ను కొంత మంది వైద్యులు ఆసరాగా తీసుకుంటున్నారు. స్వైన్‌ఫ్లూను బూచిగా చూపించి అవసరం లేకున్నా వారికి వాక్సిన్ అమ్ముతున్నాయి. వాక్సిన్ కోసం ప్రజలు క్యూ కడుతుండటంతో ఇదే అదనుగా భావించిన యాజమాన్యాలు మందుల ధరలను అమాంతం పెంచేశాయి. సరఫరాకు మించి డిమాండ్ ఉండటంతో మాస్కుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. రూ.5 విలువ చేస్తే మాస్కును రూ.50కి అమ్ముతుండటం విశేషం. ఇక నాలుగు లేయర్లతో తయారు చేసిన ఎన్– 95 మాస్క్ ధర రూ.100కు పెంచడం గమనార్హం.
మాస్క్ ధరించాలి
స్వైన్‌ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా తమ నోటికి ఎన్ 95 మాస్క్ ధరించాలి. లేదంటే రెండు మీటర్ల తెల్లటి గుడ్డను 14 మడతలు మడిచి, ముక్కు, నోటికి ధరించాలి. దీంతో వైరస్ నుంచి కాపాడుకోవచ్చు. – డాక్టర్ రమేశ్ దాంపురి, చిన్న పిల్లల వైద్యనిపుణుడు, నిలోఫర్