దొంత దేవరాజ్(ఫైల్)
* ఒక్కరోజే ముగ్గురు మృతి, మరొకరి పరిస్థితి విషమం
* ఈ ఏడాదిలో 25 మందికి సోకిన ప్రాణాంతక వైరస్
* నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం
* భయాందోళనలో నగరవాసులు
సాక్షి, హైదరాబాద్: నగరంపై స్వైన్‌ఫ్లూ పంజా విసురుతోంది. ప్రమాదకరమైన వైరస్ బారినపడి బుధవారం ఒక్కరోజే ముగ్గురు మరణించారు. మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఉప్పల్‌కు చెందిన శ్రీనివాస్(47) ఆదిత్య ఆస్పత్రిలో, జీడిమెట్లకు చెందిన గర్భిణి కవిత(25) గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మెదక్ జిల్లాకు చెందిన దేవరాజ్(45)ను ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి గాంధీకి తరలిస్తుండగా ఆయన చనిపోయారు.
మెహిదీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్వాన్‌కు చెందిన మహేశ్వరి(25) పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు హైదరాబాద్‌లో 25 మందికి స్వైన్ ఫ్లూ సోకగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. దీంతో నగరవాసుల్లో భయాం దోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రుల్లో నిత్యం స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి.
రాష్ర్టంలోని ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులు కూడా నగరానికే వస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన ఈ వైరస్(హెచ్1ఎన్1 ఇన్‌ప్లుయాంజా) సాధారణంగా జూన్ నుంచి అక్టోబర్ మధ్య చురుగ్గా ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా ఇది విజృంభిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. వాతావరణంలో ప్రవేశించిన తర్వాత రెండుమూడు గంటలకు మించి ఈ వైరస్ బతకదు, అయితే ప్రస్తుతమున్న ప్రతికూల పరిస్థితుల వల్ల ఇది బలపడుతున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రమాద ఘంటికలు
ఈ వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. బాధితులను ప్రత్యేక వార్డుల్లో ఉంచి, పూర్తిగా నయమయ్యాకే బయటకు పంపాలి. కానీ వైరస్ సోకిన వారు ఆస్పత్రుల నుంచి తమకుతాముగా వెళ్లిపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. అలా వెళ్లిన వారితో ఆ వైరస్ ఇతరులకు వ్యాపిస్తోంది. ఖైరతాబాద్ మక్తాలో స్వైన్‌ఫ్లూ సోకిన ఓ వ్యక్తి(40) గాంధీ ఆస్పత్రిలో రెండు రోజులపాటు చికిత్స తీసుకున్నాడు. ఆసుపత్రి నచ్చలేదంటూ మంగళవారం వెళ్లిపోయాడు.
అలాగే ఈ నెల ఒకటిన అనుమానిత వైరస్‌తో శ్రీనగర్‌కాలనీకి చెందిన వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చేరాడు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్ లక్షణాలు కనిపించడంతో నమూనాలను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపి పరీక్షించారు. ఎబోలా కాదని తేలినా అది ఏ రకమైన వైరస్ అన్నది మాత్రం నిర్ధారణ కాలేదు. అయితే వైద్య సేవలు సరిగాలేవని ఆ వ్యక్తి ఆసుపత్రి నుంచి వెళ్లిపోయాడు. ఇలాంటి వారి వల్ల ఇతరులకు ముప్పు పొంచి ఉంది. ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఉదంతాలే నిదర్శనం.
వైరస్ సోకిన వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి, కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన పర్యవేక్షణ బృందం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆరోగ్య శాఖ డెరైక్టర్ నేతృత్వంలో జిల్లాకో బృందం ఉన్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. కాగా, రోగి వెళ్లిపోతానంటే అడ్డుకోలేమని గాంధీ వైద్యాధికారులు అంటున్నారు. అలా వెళ్లిపోయిన వారి వివరాలను ఆరోగ్య శాఖ డెరైక్టర్‌కు అందిస్తామని, వారి ఆధ్వర్యంలోని పర్యవేక్షణ బృందాలే తదుపరి చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. క్షణాల్లో వ్యాపించే స్వైన్‌ప్లూ వంటి ప్రమాదకరమైన వైరస్ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముందని గాంధీ వైద్యులే వ్యాఖ్యానిస్తున్నారు.