
మంత్రి నిరంజన్‌రెడ్డి నుంచి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకుంటున్న ఆర్‌జీ అగర్వాల్
సాక్షి, హైదరాబాద్: ఎగుమతులు లక్ష్యంగా వ్యవసాయ ఉత్పత్తులు ఉండేలా రాష్ట్రంలో ప్రత్యేక విధానం రూపొందిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన అగ్రి బిజినెస్ సమ్మిట్, అవార్డులు 2019 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్న తమ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహించడం లక్ష్యంగా విధానాల రూపకల్పన చేస్తున్నామని, నూతన విధానాన్ని త్వరలో కేబినెట్‌లో ప్రవేశ పెడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. 2022 నాటికి రాష్ట్రంలో రైతుల అదాయాన్ని రెట్టింపు చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ద్వారా ఎగుమతులు, ఉపాధి పెంచేందుకు కృషి చేస్తామని వివరించారు. రాష్ట్రంలో జీవనదులు కృష్ణా, గోదావరి ద్వారా సారవంతమైన భూములను సాగులోకి తెస్తామన్నారు. ప్రపంచంలోనే ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. దేశంలోనే వ్యవసాయ రంగానికి నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రే కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు రాజ్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
వ్యవసాయంలో చైనా ముందంజ
అగ్రి ఇన్‌పుట్స్ బిజినెస్ ఇండియా ఫర్ నెక్ట్స్ జనరేషన్ అనే అంశంపై ధనూకా గ్రూప్ ఛైర్మన్ ఆర్.జి.అగర్వాల్ కీలకోపన్యాసం చేశారు. సాగు విస్తీర్ణం, వర్షపాతంలో భారత్ కంటే దిగువనున్న చైనా వ్యవసాయ ఉత్పత్తిలో మన కంటే ముందంజలో ఉందన్నారు. వ్యవసాయ, వాణిజ్య ఉత్పత్తుల విభాగంలో సేవలు అందిస్తున్న పలు సంస్థలకు మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా అగ్రి అవార్డులు అందజేశారు. ధనూకా గ్రూప్ చైర్మన్ ఆర్.జి.అగర్వాల్‌కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందజేశారు. కార్యక్రమంలో ఐటీసీ డైరెక్టర్ శివకుమార్, రవి ప్రసాద్, రాయ్, వెంకటేశ్వర్లు, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment