
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయాధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పలువురు ఉత్తమ రైతులకు మంత్రి నిరంజన్‌రెడ్డి ‘రైతురత్న’ అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. వ్యవసాయాధికారుల సంఘం–2020 డైరీ, క్యాలెండర్లను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయాధికారుల సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరిస్తామని హామీఇచ్చారు. నూతన మండలాల్లో సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తామని, రాబోయే బడ్జెట్‌లో వీటిని ప్రస్తావిస్తామని తెలిపారు.
ఎందరో ప్రధానులు, సీఎంలు పనిచేసి ఉండవచ్చు అని, కానీ స్పష్టమైన ప్రణాళికతో వ్యవసాయ రంగంలోకి ఇంత సూక్ష్మంగా రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపింది మాత్రం కేసీఆరేనని స్పష్టంచేశారు. సమావేశంలో తెలంగాణ వ్యవసాయాధికారుల సంఘం చైర్మన్ బి.కృపాకర్ రెడ్డి, అధ్యక్షురాలు అనురాధ, ప్రధాన కార్యదర్శి జి.కృపాకర్ రెడ్డి, తెలంగాణ విశ్రాంత వ్యవసాయాధికారుల సంఘం కార్యదర్శి చంద్రశేఖర్‌లు పాల్గొన్నారు.
రైతురత్న అవార్డులు అందుకున్నది వీరే
ప్రవీణ్ కుమార్ రెడ్డి (పెబ్బేరు), ఉడుముల లావణ్య (ఆంధోల్), వరికుప్పల మల్లేశ్ (మోటకొండూరు), తుమ్మల రాణా ప్రతాప్ (వైరా), దామోదర్ రెడ్డి (కేసముద్రం), రవిసాగర్ (వనపర్తి).