కరోనా.. కమ్మేస్తోంది!: నీతి ఆయోగ్‌ | Niti Aayog Reveals Coronavirus Is In Mass Dispersion | Sakshi
Sakshi News home page

కరోనా.. కమ్మేస్తోంది!

Published Tue, May 19 2020 5:15 AM | Last Updated on Tue, May 19 2020 1:25 PM

Niti Aayog Reveals Coronavirus Is In Mass Dispersion - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి సామూహిక వ్యాప్తి దశలో ఉందని నీతి ఆయోగ్‌ వెల్లడించింది. ఈ పరిస్థితి దేశానికి సవాల్‌గా మారింద ని పేర్కొంది. దేశంలో కరోనా పరిస్థితిపై, దానిని ఎదుర్కోవడంలో మన దేశానికి ఉన్న బలాలు, బలహీనతలు, అవకాశాలు, సవాళ్లపై నీతి ఆయోగ్‌ చేసిన అధ్యయన నివేదిక తాజాగా విడుదలైంది. వైరస్‌ కట్టడికి కేంద్రం లాక్‌డౌన్‌ను విధించిందని, భౌతికదూరాన్ని పాటిం చాలని పిలుపునిచ్చిందని, కానీ అమలులో ఉల్లంఘన జరిగిందని నీతి ఆయోగ్‌ కుండబద్దలు కొట్టింది. కరోనా పాజిటివ్‌లతో కాంటాక్ట్‌ అయినవారిని వెతికి పట్టుకోవడంలో వైఫల్యం ప్రస్తుత పరిస్థితిని మరింత దిగజార్చడానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ పరిస్థితితో కరోనా సామూహిక వ్యాప్తి (కమ్యూనిటీ స్ప్రెడింగ్‌)కి దారి తీసే ప్రమాదం నెలకొందని తెలిపింది. కరోనాతో పోరాడటానికి సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించడానికి, అంతర్గత, బాహ్య కారణాలను గుర్తించడం ముఖ్యమని తెలిపింది.

ఇలా చేయాలి..
► ప్రజల్లో అవగాహన కల్పించడం, కేసులను పర్యవేక్షించడం కోసం గ్రామీణ స్థాయిలో పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు.
► కరోనాతో పోరుకు వినూత్న పరిష్కారాలను అందించడానికి స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలు, కార్పొరేట్, పరిశోధన, విద్యాసంస్థలు ముందుకు రావాలి.
► విద్యాసంస్థలు నడిపించడం, కార్యాలయాల్లో పనుల నిర్వహణకు వీడియో కాన్ఫరెన్సింగ్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి.

కరోనాను ఎదుర్కొనే బలాలివే..
► పాఠశాలలు, రైల్వే కోచ్‌లు, హోటళ్లు, కార్యాలయాలు మొదలైన మౌలిక సదుపాయాలను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చారు.
► కరోనా చికిత్సకు అవసరమైన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల ఉత్పత్తిలో భారతదేశమే టాప్‌.
► అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో, కార్యాలయాల్లో తప్పనిసరిగా థర్మల్‌ స్క్రీనింగ్‌ తనిఖీ నిర్వహించారు.
► కొత్త సవాలును స్వీకరించడానికి వైద్య, ఆరోగ్య వ్యవస్థ క్రమంగా సన్నద్ధమవుతోంది.

ఇవి మన బలహీనతలు..
► కరోనా నిర్ధారణ పరీక్షకు అవసరమైన వస్తు సామగ్రి లేదు. వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, మాస్క్‌లు, వెంటిలేటర్లు తదితరాల కొరత.
► టెస్టింగ్‌ కిట్లు, రిలీఫ్‌ మెటీరియల్స్‌ను దేశీయంగా తయారు చేయడంలో సమస్యలు.. ఈ విషయంలో దిగుమతులపై ఆధారపడాల్సిన దుస్థితి.
► సమాజంలోని నిర్దిష్ట వర్గాలలో కరోనా వైరస్‌పై అవగాహన లేదు.
► ఐసోలేషన్‌లో ఉండటానికి ప్రజలు ఇష్టంగా లేరు. ఇది ఒక మానసిక అవరోధంగా మారింది.
► దేశంలో పేదల రోగనిరోధక శక్తి అత్యం త తక్కువ. ప్రపంచంలో రోగనిరోధక శక్తిలో దేశం 135వ స్థానంలో ఉంది.
► అత్యవసర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలు, నిపుణుల కొరత వేధిస్తోంది.
► దేశంలో 1,445 మంది రోగులకు ఒక డాక్టర్‌ మాత్రమే ఉన్నారు...ప్రతీ వెయ్యి  జనాభాకు పడకల సంఖ్య 0.7 మాత్రమే.
► దేశ జనాభా 130 కోట్లు.. కానీ వెంటిలేటర్ల సంఖ్య 40 వేలు మాత్రమే.
► ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉ ద్యోగులకు సౌకర్యవంతమైన పని ఏర్పాట్లు లేవు.

కరోనా కట్టడిలో వివిధ దేశాలు ఇలా..
కరోనాను కట్టడికి వివిధ దేశాలు పలు పద్ధతులను పాటించాయి. కొన్ని విఫలం కాగా, కొన్ని విజయవంతంగా నియంత్రించగలిగాయి.
► దక్షిణ కొరియా మొదట్లోనే వేగంగా స్పందించింది. అక్కడ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య ఎక్కువ. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కవరేజీ ఉంది. పాజిటివ్‌ వచ్చినవారు, వారి కాంటాక్టులను వెతికి పట్టుకోవడంలో మంచి సామర్థ్యం చూపింది. వర్క్‌ ఫ్రం హోంను అమలు చేసింది.
► రష్యాకు కరోనా వైద్య నిర్ధారణ పరీక్షలు, ఇతరత్రా వైద్య పరికరాల సామర్థ్యం ఎక్కువ. ప్రారంభంలో వైరస్‌ను తక్కువ అంచనా వేసింది. దీంతో ప్రజల్లో భయం, అపనమ్మకం ఏర్పడింది.
► ఇటలీ మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. దీంతో వైద్య ఆరోగ్య రంగంపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. దీంతో కరోనా సృష్టించిన సంక్షోభాన్ని సరిగ్గా ఎదుర్కోలేని దుస్థితి ఏర్పడింది.
► అమెరికాలో బలమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలున్నాయి. మొదట్లో వైరస్‌పై అవగాహన కల్పించలేదు. పైగా లాక్‌డౌన్‌పై జాతీయ స్థాయిలో వ్యతిరేకత నెలకొంది.
► చైనా దూకుడుగా వ్యవహరించి వైరస్‌ను నియంత్రించింది. క్వారంటైన్, సామూహిక నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్‌ పరీక్షలను సులభంగా, ఉచితంగా చేసింది. పెద్దఎత్తున కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ నిర్వహించింది. కొత్త ఆసుపత్రులను ఉన్నపళంగా నిర్మించింది.
► న్యూజిలాండ్‌లో బలమైన నాయకత్వం.. కరోనా నియంత్రణలో సరైన వ్యూహం రచించింది. జాతీయ సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. భౌతికదూరాన్ని పాటించడం ద్వారా సమాజంలో వైరస్‌ వ్యాప్తిని బాగా అడ్డుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement