నిజాం షుగర్స్‌ అమ్మకానికి పచ్చజెండా  | Nizam Sugars is ready for sale | Sakshi
Sakshi News home page

నిజాం షుగర్స్‌ అమ్మకానికి పచ్చజెండా 

Published Sat, Jun 15 2019 2:02 AM | Last Updated on Sat, Jun 15 2019 2:02 AM

Nizam Sugars is ready for sale - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నష్టాలతో మూతపడిన నిజాం దక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ను విక్రయించి.. బ్యాంకులు, ఇతర సంస్థలకు బకాయిలు చెల్లించాల్సిందిగా నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎస్‌సీఎల్‌టీ) ఆదేశించింది. సుమారు 8 దశాబ్దాల చరిత్ర కలిగిన నిజాం షుగర్స్‌ పునరుద్ధరణ మార్గాలు మూసుకుపోవడంతో ఆస్తుల విక్రయం (లిక్విడేషన్‌) మినహా మరో మార్గం లేకుండా పోయిందని పేర్కొంది. ఇప్పటికే పరిశ్రమలో ఉత్పత్తి నిలిచిపోవడంతో వేతనాల కోసం ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ నెల 3న తీర్పు వెలువరించిన ట్రిబ్యునల్‌ గురువారం లిక్విడేషన్‌కు ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు అందిన తర్వాత.. తదుపరి కార్యాచరణపై స్పష్టత ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాలని చక్కెర శాఖ అధికారులు నిర్ణయించారు. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పాలనలో 1937లో ఏర్పాటు చేసిన నిజాం చక్కెర కర్మాగారం (ఎన్‌ఎస్‌ఎల్‌) సుమారు రెండు దశాబ్దాలుగా నష్టాల బాటలో నడిచింది.

నష్టాల నుంచి పరిశ్రమను గట్టెక్కించే నెపంతో 2002లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం డెల్టా పేపర్‌ మిల్స్‌కు 51శాతం వాటాను విక్రయించింది. నిజాం దక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌డీఎస్‌ఎల్‌)గా పేరు మార్చుకున్న నిజాం చక్కెర కర్మాగారం.. నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి లేకపోవడంతో 2015 డిసెంబర్‌లో పరిశ్రమను మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు పరిశ్రమ ఆస్తులను విక్రయించి అప్పులు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్‌డీఎస్‌ఎల్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో రైతుల భాగస్వామ్యంతో సహకార రంగంలో ఎన్‌డీఎస్‌ఎల్‌ను నడిపేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం 2015, ఏప్రిల్‌లో కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రైవేటు భాగస్వామ్య సంస్థకు చెందిన 51శాతాన్ని టేకోవర్‌ చేయడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి, 3 నెలల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కార్యదర్శుల కమిటీని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్‌ 28ను విడుదల చేసింది.  

ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన ఎన్‌డీఎస్‌ఎల్‌... 
బ్యాంకర్ల వద్ద భారీగా అప్పులు పెరిగిపోవడంతో దివాలా పరిశ్రమగా గుర్తించాలని 2017లో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్, హైదరాబాద్‌ బెంచ్‌ను ఎన్‌డీఎస్‌ఎల్‌ ఆశ్రయించింది. అప్పులు తీర్చేందుకు కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ రిసొల్యూషనల్‌ ప్రాసెస్‌ (సీఐఆర్‌పీ)ని ప్రారంభించాలని కోరింది. ఈ నేపథ్యంలో రుణ దాతలతో (కమిటీ ఆఫ్‌ క్రెడిటర్స్‌) సంప్రదింపులు జరిపేందుకు ఆర్‌.రామకృష్ణ గుప్తా అనే నిపుణుడికి బాధ్యతలు అప్పగించింది. 2017, అక్టోబర్‌ మొదలుకుని 2018, సెప్టెంబర్‌ వరకు 11 పర్యాయాలు రుణదాతలతో సంప్రదింపులు జరిపినా.. పునరుద్ధరణ అంశం కొలిక్కి రాలేదు. సహకార రంగంలో పరిశ్రమను పునరుద్ధరించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ట్రిబ్యునల్‌ ఆదేశించింది. అయితే ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్ట్రప్టెన్సీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీసీ) నిబంధనల మేరకు 2018, సెప్టెంబర్‌ 19లోపు సమస్యను పరిష్కరించాల్సి ఉండగా.. 12 వారాల పాటు గడువు పొడిగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మరోవైపు పరిశ్రమను కొనుగోలు చేసేందుకు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కొన్ని సంస్థలు ఆసక్తి చూపాయి. అయితే పరిశ్రమ ఆస్తులు, అప్పులను పరిశీలించిన సంస్థలు చివరి నిమిషంలో వెనుకడుగు వేశాయి.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం: భద్రు మాలోత్‌ 
నిజాం చక్కెర కర్మాగారం లిక్విడేషన్‌ అనుమతికి సంబంధించి ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వులు అధికారికంగా అందిన తర్వాత.. ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని చక్కెర శాఖ కమిషనర్‌ భద్రు మాలోత్‌ ‘సాక్షి’కి వెల్లడించారు. రైతులు, ఉద్యోగులకు నష్టం జరగకుండా పరిశ్రమ పునరుద్ధరణ మార్గాలను అన్వేషిస్తామన్నారు. ఇదిలా ఉంటే ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు లేదా ఎన్‌సీఎల్‌టీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ను ప్రభుత్వం ఆశ్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. 

లిక్విడేషన్‌కు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు.. 
అయితే వరుస ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి గడువులోగా పునరుద్ధరణ ప్రణాళిక అందకపోవడంతో పరిశ్రమ అమ్మకానికి (లిక్విడేషన్‌) అనుమతిస్తూ ఎన్‌సీఎల్‌టీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 12 వారాల గడువును ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ వినతిని ట్రిబ్యునల్‌ తోసిపుచ్చింది. రామకృష్ణ గుప్తాకు లిక్విడేటర్‌గా బాధ్యతలు అప్పగించింది. లిక్విడేషన్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందు.. పునరుద్ధరణకు సంబంధించి కొనుగోలుకు ఆసక్తి ఉన్న సంస్థలతో సంప్రదింపులు జరపడంతో పాటు, ప్రభుత్వ స్పందన కోసం కొంత కాలం వేచి చూసే యోచనలో లిక్విడేటర్‌ ఉన్నట్లు సమాచారం. వివిధ సంస్థలకు రూ.360 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. ఆస్తులు కూడా అంతే మొత్తంలో ఉన్నట్లు సమాచారం. లిక్విడేషన్‌కు ఎన్‌సీఎల్‌టీ అనుమతి ఇవ్వడంతో సంస్థపై ఆధారపడిన సుమారు 250 మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement