కలెక్టరేట్: నిజామాబాద్ వ్యవసాయాధారిత జిల్లా అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పునాది బాగుంటే మనం నిర్మించుకునే కట్టడం కూడా తరతరాలుగా బాగుంటుందని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల శిక్షణ కేంద్రంలో ఆయన జిల్లా కలెక్టర్, ముఖ్య అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లాలో ఆపార అనుభమున్న మంత్రి కూడా సంబంధిత శాఖకు ఉండటం మంచిదన్నారు. ఆయన దగ్గర వ్యవసాయానికి సంబందించిన సలహలు, సూచనలు స్వీకరించి వ్యవసాయానికి పెద్ద పీట వేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుంచాలని పిలుపునిచ్చారు.
అక్రమాలపై దృష్టి పెట్టండి
తెలంగాణలో ఉన్న పది జిల్లాలలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఇక క్షేత్ర స్థాయి నుంచి పనులు మొదలు పెట్టడమే కావాలని కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారానికి ముందు శ్రీకారం చుట్టాలన్నారు. పంటలు, సాగునీరు, కరెంట్, ఇండ్ల నిర్మాణాలు, సీసీ, మెటల్ రోడ్లు, రోడ్లు,డ్రైనేజి, తాగు నీటి పథకాలు, పాఠశాలలు మరింత పటిష్ట పరుచడానికి అధికారులు కృషి చేయాలన్నారు.
మండల స్థాయిలో, మున్సిపాలిటి కేంద్రాల పటిష్టతకు చర్యలు తీసుకోవా లని సూచించారు. క్షేత్ర స్థాయిలో పనులు నిలిచి పోతే అబివృద్ధి కుంటు పడుతుందన్నారు. అర్హులకు రేషన్ కార్డులు అందించాలన్నారు. ఇప్పటి వరకు బోగస్ కార్డుల ద్వారా బియ్యం తిన్నా వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో బోగస్ రేషన్ కార్డుల వ్యవహారం ఎక్కువగా ఉందని, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్నందున రేషన్ బియాన్ని రీసైక్లింగ్ చేస్తూ అమ్ముకుంటున్నారన్నారు.
అక్రమాలకు పాల్పడుతున్న డీలర్లు, రీసైక్లింగ్ చేస్తున్న రైస్ మిల్లర్‌లపై రికవరీ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాలన్నారు. జిల్లాలో హౌజింగ్ అక్రమాలుంటే గుర్తించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి పోచారాం శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డి.వెంకటేశ్వర్‌రావు, ఆర్‌డిఓలు, జిల్లా అదికారులు పాల్గొన్నారు.
వనరులు ఉన్నాయి.. ముందుకు సాగండి
Published Tue, Jul 8 2014 2:16 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement