భద్రాచలం : పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిప్పటికీ దీనిపై ఈ ప్రాంతవాసుల్లో ఇంకా అయోమయం తొలగలేదు. పార్లమెంటులో చట్టం చేసే సమయంలోనైనా తమ గోడు వినకపోతారా అనే కొండంత ఆశతో ఈ ప్రాంత వాసులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్ రద్దు కోరుతూ ముంపు మండలాల్లో పలు ఆందోళనకార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
అయితే ఆర్డినెన్స్ చట్టం కాకున్నా.. ఈ మండలాలను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ఇప్పటికే బూర్గంపాడు మండల పరిధిలోని ఆరు రెవెన్యూ గ్రామాలను కుక్కునూరు మండలంలో విలీనం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు.
ఇక భద్రాచలం డివిజన్‌లోని కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలను తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌లో చేర్చుతూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా మండలంలోని మిగతా గ్రామాలకు నెల్లిపాక మండల కేంద్రంగా ఏర్పాటు చేసి, దీన్ని కూడా రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోకి చేర్చారు. ఇలా ముంపు మండలాల్లో తమ పాలన సాగించేందుకు ఆంధ్రప్రదేశ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులు నెల్లిపాక గ్రామాన్ని సందర్శించి మండల కార్యాలయాలకు అనువైన భవనాలను పరిశీలించి వెళ్లారు. నెల్లిపాకలోని ఆర్‌అండ్‌బీ స్థలాన్ని, చిన నల్లకుంట వద్ద నిర్మిస్తున్న ఆశ్రమ పాఠశాల భవన సముదాయాలను కూడా పరిశీలించారు. ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్‌తో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, ఇవేమీ పట్టించుకోకుండా ఈ ప్రాంతాన్ని కలుపుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటంపై ముంపు వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగుల్లో తొలగని సందిగ్ధత...
ముంపు మండలాల ఉద్యోగులను ప్రస్తుత పరిణామాలు తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఆప్షన్ సౌకర్యాన్ని కల్పిస్తూ కమల్‌నాథన్ కమిటీ విధి విధానాలను వెలువరించేందుకు సిద్ధమవ్వగా, తమ పరిస్థితి ఏమిటని ముంపు ప్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మండలాల్లోని అన్ని కేడర్‌ల ఉద్యోగులు వారికి నచ్చిన రాష్ట్రంలో పనిచేసేలా ఆప్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆందోళనకు కూడా ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి.
జూలై వేతనాలు ఇచ్చేదెవరో...
ముంపు మండలాల్లో పనిచేసే ఉద్యోగులకు వచ్చే నెల వేతనాలు ఏ ప్రభుత్వం చెల్లిస్తుందనే దానిపై స్పష్టత లేదు. ‘ముంపు’ ఉద్యోగులకు సంబంధించిన వచ్చే నెల వేతనాల బిల్లులు తాము తీసుకోబోమని ఖజానా శాఖ అధికారులు చెపుతుండటంతో తమ పరిస్థితి ఏంటని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
తొలగని అయోమయం
Published Wed, Jul 2 2014 5:08 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement