భద్రాచలం, న్యూస్‌లైన్ : పోలవరం ముంపు మండలాలను అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావటంతో మళ్లీ కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. భద్రాచలం డివిజన్‌లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం(భద్రాచలం రెవెన్యూ గ్రామం, పట్టణం, రామాలయం మినహా) మండలాలను పూర్తిగా జిల్లా నుంచి వేరు చేసి అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో కలిపేందుకు సర్వం సిదమైంది.
అదే విధంగా పాల్వంచ డివిజన్‌లోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు (కొత్తగూడెం నుంచి భద్రాచలం వచ్చే మోరంపల్లి బంజర్, బూర్గంపాడు, సారపాక రహదారిలో ఉన్న 12 గ్రామాలు మినహా) మండలాలు మరో మూడు రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కలువనున్నాయి. ఎన్‌డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముంపు మండలాల విలీనంపై ఆర్డినెన్స్ తీసుకురాగా, దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా వేశారు. భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా మండలం అంతా సీమాంధ్రకు కేటాయిస్తుండటంతో తెలంగాణ రాష్ట్రంలోనే ఉండే దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు దారి లేకుండా పోయింది.
ఆ మండలాలకు వెళ్లాలంటే భద్రాచలం నుంచి ఎటపాక, కన్నాయిగూడెం మీదుగానే ప్రయాణించాల్సి ఉంటుంది. దీనిపై సరైన స్పష్టత లేకపోవటమే గందరగోళానికి దారి తీస్తోంది. ఆర్డినెన్స్‌కు మరోసారి సర్దుబాట్లు చేసి భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్లే రహదారిలో గల భద్రాచలం మండలంలోని గ్రామాలన్నీ తిరిగి తెలంగాణలోనే ఉంచేలా చేస్తేనే ఇబ్బందులు తొలగుతాయి. లేకుంటే రామాలయం నుంచి దుమ్ముగూడెం మండలంలోని సీతాకుటీరం(పర్ణశాల)నకు వెళ్లేందుకు దారి లేకుండా పోతుంది.
భద్రాచలం పట్టణంలోనే సరిహద్దులు...
భద్రాచలానికి ఆనుకునే సరిహద్దులు ఏర్పాటు కాబోతున్నాయి. కేవలం రామాలయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్క భద్రాచలం రెవెన్యూ గ్రామాన్ని మాత్రమే తెలంగాణలో ఉంచుతూ మండలం అంతా ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిస్తుండటంతో పెద్ద సమస్యే ఉత్పన్నం కాబోతుంది. భద్రాచలం పట్టణానికి ఆనుకునే లక్ష్మీదేవిపల్లి, పురుషోత్తపట్నం, ఎటపాక రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. పట్టణంలో రాజుపేట కాలనీలో ఒక భాగం లక్ష్మీదేవిపల్లి రెవెన్యూ గ్రామం పరిధిలోకి రాగా, జగదీష్ కాలనీకి ఆనుకొని ఉన్న శ్రీరామ్‌నగర్ కాలనీ పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామం పరిధిలోకి వస్తుంది.
అదే విధంగా పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీకి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలోనే రామాయణం థీమ్ పార్కు నిర్మాణ పనులు జరుగుతుండగా, ఈ ప్రదేశం పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామం పరిధిలోకి వస్తున్నందున దీన్ని కూడా వదులుకోవాల్సిందేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనిపై సరైన స్పష్టత ఇవ్వకపోగా, జూన్ 2 తరువాత భౌగోళికంగా దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయిస్తుండంతో ఎక్కడ సరిహద్దులు ఏర్పాటు చేయాలనే దానిపై అధికారులు సైతం మల్లగుల్లాలు పడుతున్నారు.
ఆ విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ కేనా..?
భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ప్రతిభా పాఠశాల, జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, నవోదయ విద్యాలయాలు తాజాగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్లిపోనున్నాయి. భద్రాచలం రెవెన్యూ గ్రామం ఒక్కటే తెలంగాణలో ఉంచి, మిగతా మండలం అంతా ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించేలా నిర్ణయం తీసుకోవటంతో ఈ పరిస్థితి నెలకొంది. ఎటపాక సమీపంలో ఉన్న ప్రతిభా పాఠశాల, రెసిడెన్సియల్ పాలిటెక్నిక్ కళాశాలల్లో తెలంగాణ పది జిల్లాల్లో ఉన్న విద్యార్థులకు ప్రేవేశాలు కల్పిస్తున్నారు.
జూన్ 2 తరువాత ఇవి అవశేష ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లిపోతుండటంతో ఈ విద్యా సంవత్సరంలో తెలంగాణ విద్యార్థులకు చోటు ఉంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. అలాగే ప్రైవేటు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాల్‌రాజ్ ఇంజనీరింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలు కూడా తెలంగాణ విద్యార్థులకు ఇక దూరం కానున్నాయి. అయితే మండలాల బదలాయింపు జరుగుతున్న సమయంలో వీటిపై పునరాలోచించి తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.
విలీన చిక్కులు..!
Published Sat, May 31 2014 2:01 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement