పదవిపై మమకారం లేదు: కోదండరాం
వనపర్తి: ‘తెలంగాణ ఉద్యమంలో మనం కీలక పాత్ర పోషించాం.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. మనకు ఓ పదవి ఉంటే బాగుంటుంది అని కొందరు సలహా ఇస్తున్నారు. అయితే, నాకు ఏ పదవీ అవసరం లేదు’ అని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. ప్రజల అవసరం తీర్చాలంటే పదవులే అవసరం లేదని, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సమస్యల పరిష్కారానికి జేఏసీ ప్రజలను చైతన్యం చేస్తుందన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో జరిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక మహాసభలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత ప్రతి ఉద్యమకారుడిపై ఉందన్నారు. చదువుకున్న వాడి మౌనం సమాజానికి కీడు చేస్తోందని.
. అందుకే ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలన్నారు. దీనివల్ల నీతివంతమైన పాలన అందుతుందన్నారు. తెలంగాణలో విద్యుత్ కొరతకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ప్రముఖ కవి, గాయకుడు గోరేటి వెంకన్న మాట్లాడుతూ మనను మనం ప్రశ్నించుకుని సన్మార్గంలో నడుస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిననాడే తెలంగాణ గోడు తీరుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం సంస్కృతి పోవాలన్నారు. టీఆర్‌ఎస్‌లోకి కొత్తగా వస్తున్న ఆయా పార్టీల నేతలు ప్రజలను దోచుకోకుండా ఓ కంట వారిని కనిపెట్టాలని కేసీఆర్‌కు సూచించారు. సమావేశంలో విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు.