నో వేకెన్సీ..! | no job vacancies available in metro station | Sakshi
Sakshi News home page

నో వేకెన్సీ..!

Published Mon, Oct 16 2017 1:58 AM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

no job vacancies available in metro station - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో రైలు.. హైదరాబాదీల కలల ప్రాజెక్టు. దీనికి ఈ ఏడాది నవంబర్‌ 28న ముహూర్తం కుదిరింది. ఈ ప్రాజెక్టు రాకతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని నిరుద్యోగ యువత భావించింది. అయితే నాగోల్‌–అమీర్‌పేట్‌ (17కి.మీ.), మియాపూర్‌–ఎస్‌ఆర్‌ నగర్‌ (13 కి.మీ.) మార్గంలోని 24 మెట్రో స్టేషన్లు, ఉప్పల్, మియాపూర్‌ మెట్రో డిపోలు, ఉప్పల్‌లోని ఆపరేషన్‌ కంట్రోల్‌ సెంటర్‌తోపాటు మెట్రో రైళ్లు నడిపే లోకో పైలట్ల వంటి హోదాల్లో ఇప్పటికే సుమారు రెండు వేల ఉద్యోగ నియామక ప్రక్రియను నిర్వహణ సంస్థ కియోలిస్‌ దాదాపు పూర్తిచేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలోనే వీటిని భర్తీ చేసినట్లు మెట్రో రైలు అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు మోట్రో ఉగ్యోగాలంటూ మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్న నిరుద్యోగులు లక్షల రూపాయలు నష్టపోతున్నారు. అయితే ప్రత్యక్షంగా భర్తీ చేసిన ఉద్యోగాలు, భవిష్యత్‌లో భర్తీ చేయబోయే ఉద్యోగాలపై రాష్ట్ర ప్రభుత్వంగానీ, హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ, కియోలిస్‌ సంస్థలుగానీ స్పష్టత ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

ఉద్యోగాల పేరిట బురిడీ.. 
మెట్రో ప్రాజెక్టును సాకుగా చూపి నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టేందుకు ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పలు అంతర్రాష్ట్ర ముఠాలు రంగంలోకి దిగాయి. టికెట్‌ కలెక్టర్లు, స్టేషన్‌ మేనేజర్ల ఉద్యోగాలంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం, ఫోన్‌ ఇంటర్వ్యూలు, ఫేక్‌ కాల్‌లెటర్లతో నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు దండుకుని నిలువునా ముంచేస్తున్నాయి. మెట్రో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు వల వేస్తోన్న పలువురు మోసగాళ్ల గుట్టును ఇప్పటికే పోలీసులు రట్టు చేశారు. అయితే మెట్రో ప్రాజెక్టులో అవసరమైన ఉద్యోగాల భర్తీలో ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్‌ సంస్థల పాత్ర నామమాత్రమేనని ఆయా సంస్థలు చెబుతున్నాయి. నిర్వహణ సంస్థ కియోలిస్‌ అవసరమైన ఉద్యోగుల ఎంపిక కోసం ప్రాంగణ నియామకాలు మాత్రమే చేపడుతుందని స్పష్టం చేస్తున్నాయి. 

ప్రతి స్టేషన్‌లో షిఫ్టుకు ఐదుగురే.. 
నగరంలో ఎల్బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఫలక్‌నుమా, నాగోల్‌–రాయదుర్గం మొత్తం మూడు కారిడార్లలో 72 కి.మీ. మెట్రో ప్రాజెక్టు చేపడుతున్నారు. ఈ మార్గంలో మొత్తం 65 స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి స్టేషన్‌లో స్టేషన్‌ మేనేజర్, అనౌన్సర్, టికెట్‌ జారీ చేసేవారు, ప్రధాన సెక్యూరిటీ, సాంకేతిక అధికారి ఇలా ప్రతి షిఫ్టుకు ఐదుగురు ఉద్యోగులు మాత్రమే విధుల్లో ఉంటారు. ఇక స్టేషన్‌ లోపల, బయట భద్రతా బాధ్యతలను పోలీసు శాఖ చేపడుతుంది. ఇక 57 మెట్రో రైళ్లను నడిపేందుకు అవసరమైన లోకో పైలట్లను కియోలిస్‌ సంస్థ ఇప్పటికే ప్రాంగణ నియామకాల ద్వారా ఎంపిక చేసి.. వారికి ఉప్పల్‌ మెట్రో డిపోలో శిక్షణ సైతం ఇచ్చింది. ఇక ఉప్పల్, మియాపూర్‌ మెట్రో డిపోల్లో సిగ్నలింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాల్లో పనిచేసే సిబ్బందిలో దాదాపు 50 శాతం నియామకాలు పూర్తిచేసినట్లు సమాచారం. దాదాపు అన్ని ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్‌ విధానంలోనే భర్తీ చేయనున్నారు. 

ప్రాంగణ నియామకాల ద్వారానే.. 
మెట్రో రైళ్లు, స్టేషన్లు, డిపోల్లో పనిచేసేందుకు అవసరమైన సిబ్బంది నియామకాలను కియోలిస్‌ సంస్థ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారానే భర్తీ చేస్తోంది. ఆయా కళాశాలలకు ముందే సమాచారం అందించి నేరుగా సంస్థ ప్రతినిధులు వెళ్లి విద్యార్థులకు వివిధ అంశాల్లో మూడు దశల రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూలు, బృంద చర్చల ఆధారంగా నియామక పత్రాలు అందజేస్తారు. ఇలా ఎంపికైన వారికి ఉప్పల్‌ మెట్రో డిపోలో ఆరు నెలల పాటు స్టైఫెండ్‌ ఇచ్చి శిక్షణ ఇస్తారు. ఒక ఉద్యోగికి వివిధ అంశాల్లో(మల్టీటాస్కింగ్‌) శిక్షణ ఇస్తారు. భవిష్యత్‌లో భర్తీ చేసే ఉద్యోగాల వివరాలను సంస్థ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. 

కియోలిస్‌ సంస్థ వివరాలివే.. 
ఫ్రాన్స్‌కు చెందిన కియోలిస్‌ సంస్థ ప్రజారవాణా రంగంలో విశేష అనుభవం గడించింది. 12 దేశాల్లోని పలు ప్రజారవాణా వ్యవస్థలను నిర్వహిస్తోంది. నగర మెట్రో ప్రాజెక్టు నిర్వహణలోనూ కీలక భాగస్వామిగా మారింది. 15 ఏళ్ల పాటు మెట్రో నిర్వహణ బాధ్యతలను కాంట్రాక్టు విధానంలో స్వీకరించింది. అవసరమైన ఉద్యోగుల భర్తీ, వారి శిక్షణ, రోజువారీగా రైళ్లను నడపడం, వాటి నిర్వహణ, మరమ్మతు పనులను ఈ సంస్థ సిబ్బందే చేపడతారు. 

శ్వేతపత్రం విడుదల చేయాలి 
మెట్రో ప్రాజెక్టులో అన్ని ఉద్యోగాలనూ తెలంగాణ బిడ్డలకే కేటాయించాలి. మెట్రో ప్రాజెక్టులో వివిధ హోదాల్లో ప్రత్యక్షంగా భర్తీ చేయనున్న, ఇప్పటివరకు భర్తీ చేసిన పోస్టులు, ఏఏ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు చేశారు? భవిష్యత్‌లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలపై తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలి. నిరుద్యోగులను మోసం చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి.  – మానవతారాయ్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement