ఇంటికో ఉద్యోగం ఉత్తమాటే
నిజామాబాద్ సిటీ : టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యో గం కల్పిస్తామన్న కేసీఆర్ హామీ ఉత్తమాటేనని నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పంచరెడ్డి చరణ్ విమర్శించారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే లక్ష ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారని, రెండేళ్లు కావస్తున్నా ఉద్యోగాల మాటే ఎత్తడం లేదని ఆరోపించారు. విద్యార్థుల ఉద్యమాలు, ఆత్మ బలిదానాల ఫలితంగా గద్దెనెక్కిన సీఎం.. ఇప్పుడు వారిని పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి మాత్రం నాలుగు ఉద్యోగాలు దక్కాయన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుంటే యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట నాయకులు నాగరాజు, సుధాకర్, కిషోర్ రాథోడ్, ఆదర్శ, దత్తాద్రి ఉన్నారు.